Ashwini Vaishnaw: జనగణనకు 11,718 కోట్లు
ABN , Publish Date - Dec 13 , 2025 | 05:24 AM
ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం.. 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది.....
రెండు దశల్లో నిర్వహణ
గ్రామీణ ఉపాధి హామీ ఇకపై పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన
పనిదినాలు 100 నుంచి 125కు
ఎండు కొబ్బరి మద్దతు ధర పెంపు
బీమా రంగంలో 100ు ఎఫ్‌డీఐలు
ఉన్నత విద్య.. ఒకే నియంత్రణ సంస్థ
కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు
న్యూఢిల్లీ, డిసెంబరు 12: ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం.. 2027 జనాభా లెక్కల సేకరణకు ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.11,718.24 కోట్లు మంజూరు చేసింది. రెండు దశలుగా నిర్వహించే ఈ జనాభా లెక్కల సేకరణలో భాగంగా.. తొలిసారి కులగణన కూడా చేయనున్నారు. దీంతోపాటు.. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, కోల్ సేతు విధానం సులభతరం, ఉన్నత విద్యకు సంబంధించి ఒకటే నియంత్రణ సంస్థ ఏర్పాటు, పనికిరాని 71 పాత చట్టాల రద్దు వంటి నిర్ణయాలకు క్యాబినెట్ ఆమో దం తెలిపింది. అనంతరం మీడియాతో భేటీ అయిన కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్.. క్యాబినెట్ నిర్ణయాల ను వెల్లడించారు. దాదాపు 30 లక్షల మంది ఎన్యూమరేటర్లు పాల్గొంటారని, ఇంటింటికీ వెళ్లి గృహజాబితా, ప్రజల వివరాలు సేకరిస్తారని.. తొలిసారి పూర్తిగా డిజిటల్ పద్ధతిలో(మొబైల్ యాప్స్ ద్వారా) ఈ ప్రక్రియను నిర్వహిస్తారని ఆయన తెలిపారు. ఈసారి పౌరులు తమ వివరాలను తామే ఆన్‌లైన్‌లో నింపుకొనే (సెల్ఫ్ ఎన్యూమరేషన్) అవకాశాన్ని కల్పించనున్నారు.
దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచీ ఇప్పటిదాకా 15 జనగణనలు జరిగాయి. 2027లో జరపబోయేది 16వ జనగణన. నిజానికి 2021లో జరగాల్సిన ఈ ప్రక్రియ.. కొవిడ్ కారణంగా అప్పట్లో వాయిదా పడిన సంగతి తెలిసిందే. తాజా జనగణన రెండు దశల్లో జరుగుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబరు దాకా జరిగే మొదటి దశలో గృహాల జాబితా రూపొందిస్తామని (హౌస్ లిస్టింగ్), 2027 ఫిబ్రవరి నుంచి జనాభా లెక్కల సేకరణ జరుగుతుందని తెలపిరు. లద్దాఖ్‌లో, మంచుతాకిడి ఎక్కువగా ఉండే జమ్ముకశ్మీర్‌తోపాటు, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ వంటి రాష్ట్రాల్లో 2026 సెప్టెంబరులోనే జనాభా లెక్కలను సేకరిస్తామని తెలిపారు. ఈ భారీ ప్రక్రియలో భాగంగా 18,600 మంది సాంకేతిక సిబ్బందిని దాదాపు 550 రోజులపాటు నియమిస్తారని.. తద్వారా 1.02 కోట్ల పనిదినాల ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. జనగణనలో సేకరించే సమాచారానికి ‘డేటా భద్రత చట్టాలు’ వర్తిస్తాయని.. ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని, జనగణనకు సంబంధించిన స్థూల వివరాలు మాత్రమే ప్రచురిస్తామని స్పష్టం చేశారు. ఈ ప్రక్రియలో పాల్గొనేవారందరికీ గౌరవ పారితోషికం అందిస్తామన్నారు. జనగణన ప్రక్రియ మొత్తాన్నీ నిర్వహించేందు, రియల్‌టైమ్‌లో పర్యవేక్షించేందుకు ‘సెన్సస్ మేనేజ్‌మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్ (సీఎంఎంఎస్)’ పేరుతో ఒక ప్రత్యేక పోర్టల్‌ను అభివృద్ధి చేసినట్టు కేంద్ర మంత్రి వెల్లడించారు. అలాగే.. సేకరించిన డేటా ఆధారంగా విధానాలు రూపొందించడానికి అవసరమైన సమాచారాన్ని ఒక్క క్లిక్కుతో పొందేలా చేస్తామన్నారు. అలాగే.. పౌర అణు రంగంలో ప్రైవేటు కంపెనీలు కూడా పాల్గొనే అవకాశాన్ని కల్పించే బిల్లుకు కూడా కేంద్ర క్యాబినెట్ పచ్చజెండా ఊపింది. 2047 నాటికి 100 గిగావాట్ల అణు ఇంధన సామర్థ్యాన్ని సాధించే లక్ష్యంలో భాగంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
మరిన్ని నిర్ణయాలు..
రెండు దశాబ్దాల క్రితం యూపీఏ సర్కారు ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును.. ‘పూజ్య బాపు గ్రామీణ్ రోజ్‌గార్ యోజన’గా మార్చే బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశ్వసనీయ వర్గాల సమాచా రం ప్రకారం.. ఈ పథకం కింద ప్రస్తుతం ఉన్న పనిదినాలను (ఏడాదికి) 100 నుంచి 125కి పెంచనున్నారు. ఇక.. బీమా రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రస్తుతం ఉన్న 74ు నుంచి 100 శాతానికి పెంచుతూ రూపొందించిన బిల్లుకు క్యాబినెట్ ఆమో దం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లోనే ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. విదేశీ పెట్టుబడులకు 100ు అవకాశం కల్పిస్తున్నప్పటికీ.. ఉన్నతస్థాయి యాజమాన్యంలో (అంటే చైర్మన్, ఎండీ, సీఈవో వంటి స్థానాల్లో) కనీసం ఒక్కరు తప్పనిసరిగా భారతీయులు ఉండాలని ఈ బిల్లులో ప్రతిపాదించినట్టు సమాచారం. అలాగే.. ఉన్నత విద్యకు సంబంధించి ప్రస్తుతం ఉన్న యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ), ఆలిండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (ఏఐసీటీఈ), నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (ఎన్‌సీటీఈ) వంటి సంస్థలన్నింటి స్థానంలో ఒకే ఒక నియంత్రణ సంస్థను ఏర్పాటు చేసే బిల్లుకు కూడా క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ ‘ఉన్నత విద్య నియంత్రణ సంస్థ’ను ‘వికసిత్ భారత్ శిక్షా అధీక్షణ్’గా వ్యవహరించనున్నారు. వైద్య, న్యాయ కళాశాలలు మాత్రం ఈ నియంత్రణ సంస్థ పరిధిలోకి రావు. ఇక.. ఉపయోగంలోని 71 పాత చట్టాలను తొలగించేందుకు కేంద్ర మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. 2014లో మోదీ సర్కారు ఏర్పాటైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇలా 1562 పాత చట్టాలను తొలగించిన సంగతి తెలిసిందే. ఈ 71 చట్టాల తొలగింపు బిల్లుకు పార్లమెంటు ఆమోదం లభిస్తే.. ఆ చట్టాల సంఖ్య 1633కు చేరుతుంది. అలాగే.. ఎలాంటి ‘ఎండ్-యూజ్’ ఆంక్షలూ లేకుండా బొగ్గు లింకేజీలను వేలం వేసే కొత్త డిజిటల్ ప్లాట్‌ఫామ్ కోల్‌సేతుకు ప్రధాని నేతృత్వంలోని ‘ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ’ ఆమోదం తెలిపింది. ఎండ్-యూజ్ ఆంక్షలు లేకపోవడంవల్ల.. తమకు కేటాయించే బొగ్గును దేనికి ఉపయోగించాలో స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునే వీలు కంపెనీలకు కలుగుతుంది. బొగ్గు అవసరమైన ఏ వినియోదారు అయినా దీని ద్వారా వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. అలాగే.. 2026 సీజన్‌కుగాను మిల్లింగ్ కోప్రా (ఎండుకొబ్బరి చిప్పల) కనీస మద్దతు ధరను రూ.445 మేర పెంచి క్వింటాలుకు రూ.12.027గా కేంద్రం నిర్ణయించింది. బాల్ కోప్రా (ఎండు కొబ్బరి కురిడీ) ధరను క్వింటాలుకు రూ.400 మేర పెంచి రూ.12,500గా నిర్ణయించింది. ఈమేరకు ‘ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ’ నిర్ణయం తీసుకున్నట్టు అశ్విని వైష్ణవ్ తెలిపారు.