Share News

C-130J Super Hercules: హైదరాబాద్‌లో సీ-130జే విమానాల తయారీ?

ABN , Publish Date - Dec 29 , 2025 | 01:11 AM

భారీ సరుకు రవాణా విమానాలైన సీ-130జే సూపర్‌ హెర్య్కుల్‌సలు త్వరలోనే హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో తయారయ్యే అవకాశం ఉంది...

C-130J Super Hercules: హైదరాబాద్‌లో సీ-130జే విమానాల తయారీ?

  • సరుకు రవాణా విమానాల కొనుగోలుకు ఐఏఎఫ్‌ సిద్ధం

  • కాంట్రాక్టు కోసం లాక్‌హీడ్‌ మార్టిన్‌ యత్నాలు

  • నగరంలో ఇప్పటికే వీటి తోక భాగాల ఉత్పత్తి

  • ఐఏఎఫ్‌ వద్ద ప్రస్తుతం 12 సీ-130జే సూపర్‌ హెర్య్కులస్‌ విమానాలు

మారీటా, డిసెంబరు 28: భారీ సరుకు రవాణా విమానాలైన సీ-130జే సూపర్‌ హెర్య్కుల్‌సలు త్వరలోనే హైదరాబాద్‌లో పూర్తిస్థాయిలో తయారయ్యే అవకాశం ఉంది. తన అవసరాల కోసం 80 సరుకు రవాణా విమానాలను కొనుగోలు చేయాలని భారత వాయుసేన (ఐఏఎఫ్‌) భావిస్తోంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ ప్రక్రియకు డిఫెన్స్‌ అక్విజిషన్‌ కౌన్సిల్‌ మరికొన్ని వారాల్లో ఆమోదం తెలుపుతుందని సమాచారం. దీంతో లాక్‌హీడ్‌ మార్టిన్‌ సంస్థ తన విమానాలను విక్రయించేందుకు ఐఏఎ్‌ఫతో సంప్రదింపులు మొదలుపెట్టినట్లు తెలిసింది. ఒకవేళ సీ-130జే సూపర్‌ హెర్య్కులస్‌ విమానాలను కొనుగోలు చేయాలని ఐఏఎఫ్‌ నిర్ణయిస్తే.. వాటిని హైదరాబాద్‌లోనే తయారు చేయనున్నారు. హైదరాబాద్‌లోని టాటా లాక్‌హీడ్‌ మార్టిన్‌ ఏరోస్ట్రక్చర్స్‌ లిమిటెడ్‌ (టీఎల్‌ఎంఏఎల్‌) లో ఇప్పటికే ఈ విమానాల తోక భాగాలను తయారుచేసి అమెరికాకు ఎగుమతి చేస్తున్నారు. ఇటీవలే 250వ యూనిట్‌ను టీఎల్‌ఎంఏఎల్‌ నుంచి అమెరికాకు పంపారు. సీ-130జే విమానాలను ఇప్పటివరకు అమెరికాలోని మారీటా యూనిట్‌లో మాత్రమే లాక్‌హీడ్‌ మార్టిన్‌ పూర్తిస్థాయిలో తయారుచేస్తోంది. ఒకవేళ ఐఏఎ్‌ఫతో ఒప్పందం ఖరారైతే ఆ విమానాల తయారీ కోసం భారత్‌లో ప్రత్యేకంగా మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే తమకు హైదరాబాద్‌లో టీఎల్‌ఎంఏఎల్‌ ఉన్నందున.. అందులోనే ఈ భారీ విమానాలను తయారు చేస్తారని లాక్‌హీడ్‌ మార్టిన్‌ వర్గాలు తెలిపాయి.

సరుకు రవాణాకు మించి సేవలు..

ఐఏఎఫ్‌ వద్ద ఇప్పటికే 12 సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానాలు ఉన్నాయి. వీటిని భారత్‌ బహుళ ప్రయోజనాల కోసం వినియోగిస్తోంది. సైనిక అవసరాలతోపాటు ప్రకృతి విపత్తుల సమయంలో సహాయ సామగ్రి సరఫరాకు, ప్రజలను రక్షించేందుకు కూడా వినియోగించింది. అయితే, సీ-130జే కొత్త వేరియంట్లన భారీగా ఆధునీకరించినట్లు లాక్‌హీడ్‌ మార్టిన్‌ సస్టెయిన్‌మెంట్‌ ఆపరేషన్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రోడెరిక్‌ మెక్‌లీన్‌ తెలిపారు. ప్రత్యేకంగా వీటిల్లో డిస్ట్రిబ్యూషన్‌ అపెర్చర్‌ సిస్టమ్‌ (డాస్‌) అనే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. పైలట్లు రాత్రిపూట కూడా స్పష్ట్టంగా చూసేందుకు డాస్‌లో ఆరు ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరాలు ఉంటాయి. క్షిపణి హెచ్చరిక వ్యవస్థ కూడా ఉంటుంది. దీంతో యుద్ధ క్షేత్రంలో కూడా ఈ కొత్త వేరియంట్లు సమర్థంగా సేవలందించగలవని మెక్‌లీన్‌ తెలిపారు. ఈ సంస్థ ఇప్పటివరకు వివిధ దేశాలకు 560 సీ-130జే సూపర్‌ హెర్క్యులస్‌ విమానాలను విక్రయించింది. అవి మొత్తంగా 30 లక్షల విమాన గంటలు (ఫ్లైట్‌ అవర్స్‌) ప్రయాణించాయి. ఈ విమానం 23 టన్నుల బరువును అవలీలగా మోసుకెళ్లగలదు. ఐఏఎ్‌ఫతో ఒప్పందం ఖరారైతే హైదరాబాద్‌లో భారీగా ఉత్పత్తి ప్రారంభించి భారత్‌తోపాటు అక్కడి నుంచే విదేశాలకు కూడా ఈ విమానాలను ఎగుమతి చేసే అవకాశం ఉందని లాక్‌హీడ్‌ మార్టిన్‌ బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ విభాగం వైస్‌ ప్రెసిడెంట్‌ రాబర్ట్‌ టోత్‌ తెలిపారు.

Updated Date - Dec 29 , 2025 | 01:11 AM