Pune: నదిలో కూలిన ఇనుప వంతెన..
ABN , Publish Date - Jun 16 , 2025 | 05:46 AM
మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఇంద్రాయణి నదిపై ఇనుప వంతెన కూలిపోయుంది. కుందమాల గ్రామంలో నదిపై నడక దారి కోసం ఏర్పాటు చేసిన ఈ ఇనుప వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది.
నలుగురి మృతి 30 మందికి గాయాలు.. పుణెలో ఘటన
మృతులకు రూ.5 లక్షల చొప్పున పరిహారం
పాత వంతెన పైకి ఎక్కువ మంది
చేరుకోవడంతో ప్రమాదం: మహారాష్ట్ర మంత్రి
పుణె, జూన్ 15: మహారాష్ట్రలోని పుణె సమీపంలో ఇంద్రాయణి నదిపై ఇనుప వంతెన కూలిపోయుంది. కుందమాల గ్రామంలో నదిపై నడక దారి కోసం ఏర్పాటు చేసిన ఈ ఇనుప వంతెన ఆదివారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఎక్కువ మంది వంతెనపై నిలబడి ఉండగా కూలిపోయిందని అధికారులు తెలిపారు. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారని, 30 మంది గాయపడ్డారని పోలీసులు చెప్పారు. 38 మందిని కాపాడామని, కొందరు నదీ ప్రవాహంలో కొట్టుకుపోయారని తెలిపారు. సాయంత్రం 4 గంటల సమయంలో 100 మంది వరకు పర్యాటకులు బ్రిడ్జిపై ఒకేచోట నిల్చొని ఉన్నారన్నారు. కాగా, ఈ పాత ఇనుప వంతెనను కేవలం పాదచారుల కోసమే నిర్మించారని మహారాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖ మంత్రి గిరీశ్ మహాజన్ తెలిపారు. ద్విచక్ర వాహనదారులు ఈ వంతెనపై రాకపోకలు సాగించరాదని హెచ్చరిక బోర్డులు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదని చెప్పారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం అందించనున్నట్లు తెలిపారు.