Thiruvananthapuram: కేరళలో మెదడు తినే అమీబా కలకలం
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:51 AM
కేరళ రాష్ట్రాన్ని ‘మెదడు తినే అమీబా’ (నెగ్లేరియా ఫౌలెరి) కలవరపెడుతోంది. ఈ అరుదైన, అత్యంత ప్రమాదకరమైన అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) వ్యాధి కారణంగా...
ఇప్పటివరకు 104 కేసుల నమోదు.. 23 మంది మృతి
తిరువనంతపురం, అక్టోబరు 12: కేరళ రాష్ట్రాన్ని ‘మెదడు తినే అమీబా’ (నెగ్లేరియా ఫౌలెరి) కలవరపెడుతోంది. ఈ అరుదైన, అత్యంత ప్రమాదకరమైన అమీబిక్ మెనింగోఎన్సెఫలైటిస్ (మెదడు వాపు) వ్యాధి కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో 104 కేసులు నమోదవగా, అందులో 23 మంది మరణించినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణా జార్జ్ ఆదివారం వెల్లడించారు. కొల్లాం, తిరువనంతపురం జిల్లాల్లో అత్యధిక కేసులు నమోదు కాగా, కోజికోడ్, మలప్పురం జిల్లాల్లో కూడా ఈ కేసుల సంఖ్య పెరుగుతున్నట్లు ఆమె పేర్కొన్నారు. 2023లో కోజికోడ్‌లో నిఫా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత, అన్ని ఎన్సెఫలైటిస్ కేసులను తప్పనిసరిగా నివేదించాలని, వాటి మూలాలను గుర్తించాలని అధికారులను ఆదేశించినట్లు మంత్రి తెలిపారు. ఫలితంగా, 2024 నుంచి ఈ కేసులను అధికారికంగా నమోదు చేశారని, వాటిలో కొన్నింటిని అమీబిక్ ఎన్సెఫలైటిస్ కేసులుగా గుర్తించారని చెప్పారు.