Sajid Akram: బోండీ బీచ్ ఉగ్రవాదికి హైదరాబాద్ మూలాలు
ABN , Publish Date - Dec 17 , 2025 | 04:09 AM
ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై కాల్పులు జరిపిన తండ్రీ కొడుకుల్లో.. తండ్రి సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది.....
1998లో విద్యార్థిగా ఆస్ట్రేలియా వెళ్లిన సాజిద్ అక్రమ్.. గత 27 ఏళ్లలో ఆరుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు..
హైదరాబాద్‌లో సాజిద్‌కు నేరచరిత్ర లేదు
డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడి..
ఫిలిప్పైన్స్‌లో ఆయుధ శిక్షణ తీసుకున్న సాజిద్, అతడి కుమారుడు నవీద్
న్యూఢిల్లీ/హైదరాబాద్/హైదరాబాద్ సిటీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): ఆస్ట్రేలియాలోని సిడ్నీలో యూదులపై కాల్పులు జరిపిన తండ్రీ కొడుకుల్లో.. తండ్రి సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ మూలాలు ఉన్నట్లు బయటపడింది. పాతబస్తీకి చెందిన అతడు 1998లో ఉన్నత విద్యాభ్యాసం కోసం ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడే యూరోపియన్ మూలాలున్న వెనెరా గ్రాసో అనే మహిళను వివాహం చేసుకొని స్థిరపడ్డాడని రాష్ట్ర డీజీపీ శివధర్‌రెడ్డి మంగళవారం వెల్లడించారు. వీరికి కుమారుడు నవీద్ అక్రమ్‌తోపాటు ఒక కుమార్తె కూడా ఉందని చెప్పారు. సాజిద్ అక్రమ్ హైదరాబాద్‌లో బీకాం చదువుకున్నాడని, గత 27 ఏళ్లలో ఆరుసార్లు మాత్రమే హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలిపారు. సాజిద్ విదేశీయురాలిని వివాహం చేసుకోవడంతో కుటుంబానికి దూరమయ్యాడని, తన తండ్రి మరణించినప్పుడు కూడా అతను అంత్యక్రియలకు హజరుకాలేదన్న విషయం తమ విచారణలో వెల్లడైందని డీజీపీ వివరించారు. అతడికి ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్న విషయం ఇక్కడి కుటుంబ సభ్యులకు తెలియదని, తెలంగాణలో సాజిద్‌కు ఎలాంటి నేరచరిత్ర లేదని పేర్కొన్నారు. ఈ కేసుపై సంబంధిత విభాగాలకు తెలంగాణ పోలీసులు సహకరిస్తున్నారని, దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు. కాగా, తల్లికి అనారోగ్యంగా ఉందని కబురు చేసినా సాజిద్ తిరిగిరాలేదని అతని కుటుంబసభ్యులు చెప్పారు. సాజిద్ 2001లో తన విద్యార్థి విసాను పార్టనర్ వీసాగా మార్చుకొని, 2002లో రెసిడెంట్ వీసా పొందినట్లు తెలిపారు. అదే సంవత్సరంలో టోలీచౌకీలో ఉన్న తన ఆస్తులను అమ్ముకొని వెళ్లిపోయాడన్నారు. బోండీ బీచ్‌లో సాజిద్ అతడి కుమారుడు నవీద్ అక్రమ్ ఆదివారం జరిపిన కాల్పుల్లో 15 మంది మర ణించిన విషయం తెలిసిందే. పోలీసుల ఎదురు కాల్పుల్లో సాజిద్ కూడా మరణించాడు. నవీద్ తీవ్రంగా గాయపడ్డాడు. సాజిద్‌ది పాకిస్థాన్ అని మొదట ప్రచారమైంది. అయితే, పోలీసుల దర్యాప్తులో సాజిద్‌కు భారత పాస్‌పోర్టు ఉన్నట్లు గుర్తించి, భారత విదేశాంగ శాఖ అధికారులను అప్రమత్తం చేశారు. వారు తెలంగాణ పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పిలిప్పైన్స్‌లో ఆయుధ శిక్షణ
సాజిద్, నవీద్‌లు గత నెలలో పిలిప్పైన్స్‌కు వెళ్లి.. ఆయుధాలు ఉపయోగించటంలో మిలిటరీ స్థాయి శిక్షణ తీసుకున్నట్లు ఆస్ట్రేలియా పోలీసుల విచారణలో తేలింది. నవంబర్ 1వ తేదీ నుంచి 28 వర కు వారిద్దరు పిలిప్పైన్స్‌లోనే ఉన్నట్లు ఆ దేశ ఇమిగ్రేషన్ అధికారులను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియా మంగళవారం రిపోర్ట్ చేసింది. సాజిద్ అక్రమ్.. పిలిప్పైన్స్‌కు కూడా భారత పాస్‌పోర్టుతోనే వచ్చినట్లు ఆ దేశ అధికారులు వెల్లడించారు. దక్షిణ పిలిప్పైన్స్‌లో వీరు అతివాద ఇస్లామిక్ గురువులను కలిసి, అక్కడే ఆయుధ శిక్షణ తీసుకున్నట్లు గుర్తించారు. ఆ ప్రాంతం ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న మత గురువులు, సాయుధ గ్రూపులకు నిలయంగా ఉంది.
వారిద్దరిది ఐఎస్ భావజాలం
ఐఎస్ సిద్ధాంతాలతో ప్రభావితమైన సాజిద్, నవీద్.. బోండీ బీచ్‌లో ఘాతుకానికి పాల్పడ్డారని ఆస్ట్రేలియా ప్రధాని అల్బనీస్ తెలిపారు. బోండీ బీచ్‌లో ఆదివారం కాల్పులు ఘటన తర్వాత నవీద్ పేరుతో ఉన్న ఓ వాహనం నుంచి రెండు ఐఎస్ పతాకాలతోపాటు ఐఈడీ పేలుడు పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. కాగా, సాజిద్, నవీద్‌ల కాల్పుల్లో నలుగురు భారతీయ విద్యార్థులు గాయపడినట్లు ది ఆస్ట్రేలియా టుడే వార్తా సంస్థ తెలిపింది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పేర్కొంది.