Share News

Dharmendra Passes Away: బాలీవుడ్‌ హీమ్యాన్‌ ఇక లేరు

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:33 AM

హీమ్యాన్‌ ఆఫ్‌ ద హిందీ సినిమా’గా పేరొందిన దిగ్గజ నటుడు, నిర్మాత, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు.. ధర్మేంద్ర (89) ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు.....

Dharmendra Passes Away: బాలీవుడ్‌ హీమ్యాన్‌ ఇక లేరు

  • దిగ్గజ నటుడు ధర్మేంద్ర తుదిశ్వాస

  • అనారోగ్యంతో ఇంట్లోనే మృతి

  • ముంబైలో పూర్తయిన అంత్యక్రియలు

  • ఆరున్నర దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300కు పైగా చిత్రాల్లో నటన

  • ‘బాలీవుడ్‌ హీమ్యాన్‌’ అనే బిరుదుతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం

  • రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ సంతాపం

ముంబై, నవంబరు 24: ‘హీమ్యాన్‌ ఆఫ్‌ ద హిందీ సినిమా’గా పేరొందిన దిగ్గజ నటుడు, నిర్మాత, పార్లమెంట్‌ మాజీ సభ్యుడు.. ధర్మేంద్ర (89) ఇక లేరు. కొంతకాలంగా శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించడంతో సోమవారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. ధర్మేంద్ర పార్థివ దేహాన్ని కుటుంబ సభ్యులు అంబులెన్స్‌లో స్థానిక విల్లే పార్లీ శ్మశానవాటికకు తరలించారు. ఆయన కన్నుమూశారన్న విషయం తెలుసుకున్న సినీ, రాజకీయ ప్రముఖులు అక్కడికి వచ్చి ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఆయనకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. ధర్మేంద్ర మృతిపట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము,ప్రధాని నరేంద్ర మోదీ తదితరులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం వ్యక్తం చేశారు. తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్న ధర్మేంద్రను ఆయన కుటుంబసభ్యులు అక్టోబరు 31న ముంబైలోని బ్రీచ్‌ క్యాండీ ఆస్పత్రిలో చేర్చిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆయన చనిపోయారంటూ సామాజిక మాధ్యమాల్లో వదంతులు వైరల్‌ అయ్యాయి. అయితే.. ధర్మేంద్ర ఆరోగ్యం కుదురుగానే ఉందని, అసత్య ప్రచారాలు నమ్మొద్దని ఆయన కుటుంబసభ్యులు ఆ సమయంలో అందరికీ విజ్ఞప్తి చేశారు. నవంబరు 12న.. వైద్యులు ఆయనను ఇంటికి తరలించి చికిత్సను కొనసాగించారు. డిసెంబరు 8వ తేదీ ధర్మేంద్ర పుట్టినరోజు కావడం.. ఆయన 90వ పడిలో అడుగు పెట్టనుండడంతో కుటుంబసభ్యులు జన్మదిన వేడుకలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అంతలోనే ఇలా జరగడం వారిని శోకసంద్రంలో ముంచివేసింది.


ఆరున్నర దశాబ్దాల కెరీర్‌..

పంజాబ్‌లోని ఓ మారుమూల గ్రామంలో పుట్టిన ధర్మేంద్ర.. చిన్నప్పటి నుంచీ సినిమాలపై ఆసక్తిగా ఉండేవారు. ఈ క్రమంలోనే.. నూతన ప్రతిభావంతులను వెలుగులోకి తెచ్చేందుకు ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌ జాతీయస్థాయిలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొని విజేతగా నిలిచి ముంబైకి చేరుకున్నారు. 1960లో ఆయన కల.. ‘దిల్‌ భీ తేరా హమ్‌ భీ తేరే’ చిత్రంతో నెరవేరింది. అయితే ఆ సినిమా అంత బాగా ఆడలేదు. 1961లో వచ్చిన ‘షోలా ఔర్‌ షబ్నమ్‌’ ఆయనకు తొలి వాణిజ్య విజయాన్ని సాధించి పెట్టిన సినిమా. అలాదాదాపు 65 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌లో ఆయన 300కు పైగా చిత్రాల్లో నటించారు. ‘ఆంఖేన్‌’, ‘సావన్‌ ఝామ్‌ కీ’, ‘అనుపమ’, ‘అన్‌పఢ్‌’, ‘మేరా గావ్‌ మేరా దేశ్‌’, ‘సీతా ఔర్‌ గీత’, ‘షోలే’, ‘ధర్మ వీర్‌’, ‘సత్యకామ్‌’, ‘చుప్కే చుప్కే’, ‘ఫూల్‌ ఔర్‌ పత్తర్‌’ తదితర చిత్రాల్లో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్నారు. తెలుగులో కృష్ణ, కృష్ణంరాజు నటించిన ‘అడవి సింహాలు’ చిత్రాన్ని హిందీలో ‘జానీ దోస్త్‌’ పేరుతో ధర్మేంద్ర, జితేంద్ర హీరోలుగా నిర్మించారు. ఈ రెండు చిత్రాల షూటింగ్స్‌ ఏకకాలంలో జరగడం విశేషం.. షాహిద్‌ కపూర్‌, కృతి సనన్‌ నటించిన ‘తేరీ బాతోమే ఐసా ఉల్టా జియా’తో చివరిసారిగా వెండితెరపై కనిపించారు. ఆయన నటించిన చివరి చిత్రం ‘ఇక్కీస్‌’ విడుదలకు సిద్ధంగా ఉంది. ఆయన నటించిన ఆల్‌టైమ్‌ క్లాసిక్‌ ‘షోలే’ 50 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా డిసెంబరు 12న రీ రిలీజ్‌ అవుతోంది. 1935లో జన్మించిన ఆయన.. 1952లో ప్రకాశ్‌ కౌర్‌ను పెళ్లి చేసుకున్నారు ధర్మేంద్ర. వారి సంతానం.. సన్నీ డియోల్‌, బాబీ డియోల్‌, విజేత, అజిత. అయితే.. ధర్మేంద్ర 1980లో హేమమాలినిని రెండో వివాహం చేసుకున్నారు. వారికి ఈషా డియోల్‌, అహానా డియోల్‌ జన్మించారు. కథానాయకుడిగా దశాబ్దాలపాటు వెండితెరను ఏలిన ధర్మేంద్ర రాజకీయాల్లోకీ అడుగుపెట్టారుగానీ.. ఆట్టేకాలం కొనసాగలేదు. 2004 లోక్‌సభ ఎన్నికల్లో ఆయన బీజేపీ రాజస్థాన్‌లోని బికనీర్‌ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు. తర్వాత మళ్లీ రాజకీయాల జోలికి పోలేదు.

Updated Date - Nov 25 , 2025 | 04:33 AM