Share News

Himalayas: హిమాలయాల్లో అణు ముప్పు!

ABN , Publish Date - Dec 16 , 2025 | 05:21 AM

మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు! చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో....

Himalayas: హిమాలయాల్లో అణు ముప్పు!

న్యూఢిల్లీ, డిసెంబరు 15: మాజీ ప్రధానులు నెహ్రూ, ఇందిరపై బీజేపీ ఎంపీ నిశికాంత్‌ దూబే మరోసారి సంచలన ఆరోపణలు చేశారు! చైనాపై గూఢచర్యానికి అణుశక్తితో పనిచేసే నిఘా పరికరాన్ని మన హిమాలయాల్లో ఏర్పాటు చేసేందుకు అమెరికా గూఢచార సంస్థ సీఐఏకి వారిద్దరూ అనుమతి ఇచ్చారని.. గంగానది ఒడ్డున నివశిస్తున్నవారిలో ఇటీవలికాలంలో క్యాన్సర్‌ కేసులు పెరగడానికి, హిమాలయ ప్రాంతాల్లో విపత్తులు సంభవించడానికి కారణం ఇదేనని ఆయన ‘ఎక్స్‌’ వేదికగా ధ్వజమెత్తారు. ఆయన ఈ అంశంపై ఆరోపణలు చేయడం ఇది మొదటిసారి కాదు. ఈ ఏడాది జూలై 14న కాంగ్రెస్‌ పార్టీపై ఇదే విషయమై తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. ‘‘భారత తొలి ప్రధాని నెహ్రూ 1964లో, ఆ తర్వాత.. 1967, 1969 సంవత్సరాల్లో ఇందిర సీఐఏతో కుమ్మక్కై.. చైనాపై గూఢచర్యానికిగాను హిమాలయాల్లోని నందాదేవి శిఖరంపై అణు పరికరాలను ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఆ తర్వాత అమెరికన్లు ఆ పరికరాలను అక్కడే వదిలి వెళ్లిపోయారు’’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. 1978లో అప్పటి అమెరికా చట్టసభల సభ్యులు అప్పటి దేశాధ్యక్షుడికి రాసిన ఒక లేఖ ప్రతిని కూడా ఆయన తన పోస్టుకు జత చేశారు. అప్పట్లో హిమాలయాల్లో అమర్చిన ‘ప్లుటోనియంతో పనిచేసే నిఘా పరికరం’ ఎక్కడుందో కనిపించకుండా పోయిందని.. దాని నుంచి అణుధార్మిక లీకేజీ జరిగే ప్రమాదం ఉందని వారు ఆ లేఖలో ఆందోళన వ్యక్తంచేశారు. డిసెంబరు 13న న్యూయార్క్‌టైమ్స్‌ దీనిపై ఒక కథనాన్ని ప్రచురించింది.


ఇదీ నేపథ్యం..

ఆరు దశాబ్దాల క్రితం, ప్రచ్ఛన్న యుద్ధం పతాకస్థాయిలో జరుగుతున్న సమయంలో.. చైనా ఒక అణుబాంబు పరీక్ష నిర్వహించింది. దీంతో అప్రమత్తమైన సీఐఏ.. చైనా క్షిపణి పరీక్షలపై నిఘా కోసం హిమాలయ పర్వత శిఖరాల్లో ఒకటైన నందాదేవిపై ప్లుటోనియంతో పనిచేసే పరికరాన్ని అమర్చాలని నిర్ణయించింది. ఈమేరకు అమెరికా, భారత్‌కు చెందిన పర్వతారోహకులు ఒక పెద్ద యాంటెన్నా, కేబుళ్లు, ‘శ్నాప్‌ 19-సి’గా పిలిచే 13 కిలోల జనరేటర్‌ను నందాదేవి శిఖరంపైకి మోసుకెళ్లారు. అక్కడ అమర్చే సమయంలో మంచుతుఫాను వారిని చుట్టుముట్టింది. ఈ మిషన్‌కు నాయకత్వం వహిస్తున్న కెప్టెన్‌ ఎంఎస్‌ కోహ్లీ అప్పటికి కిందనున్న శిబిరంలో ఉన్నారు. ఆయన.. వెంటనే కిందికి వచ్చేయాలని రేడియో సందేశం పంపారు. దీంతో పైనున్నవారు తమ శిబిరానికి దగ్గర్లో ఆ పరికరాలను దాచి, కిందికి వచ్చేశారు. వారు పైన దాచినవాటిలో ఒక అణు పరికరం ఉంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో నాగసాకి పట్టణంపై అమెరికా ప్రయోగించిన అణుబాంబు తయారీకి ఉపయోగించినదాంట్లో మూడోవంతుకు సమానమైన ప్లుటోనియం.. ఆ అణు పరికరంలో ఉంది. అయితే, ఏడాది తర్వాత ఆ ప్రాంతానికి వెళ్లి వెతికితే ఏమీ దొరకలేదు. కనిపించకుండాపోయిన పరికరాల్లో ప్లుటోనియం క్యాప్సూల్స్‌ ఉండడంతో.. రేడియేషన్‌ డిటెక్టర్లతో, ఇన్‌ఫ్రారెడ్‌ సెన్సర్లతో వాటిని గుర్తించేందుకు ప్రయత్నించారుగానీ.. ఉపయోగం లేకపోయింది. ఇప్పుడా పరికరాలు ఎక్కడ ఉన్నాయో కూడా ఎవరికీ తెలియని పరిస్థితి. అయితే, ఈ మిషన్‌పై అమెరికా ఎప్పుడూ అధికారికంగా ప్రకటన చేయలేదు.

Updated Date - Dec 16 , 2025 | 06:43 AM