Bihar Assembly Elections: బీజేపీ, జేడీయూలకు చెరి నూటొక్క సీట్లు
ABN , Publish Date - Oct 13 , 2025 | 06:05 AM
బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్‌డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఆదివారం ఖరారయింది. మొత్తం 243 స్థానాలకుగానూ ప్రధాన పార్టీలైన జేడీయూ, బీజేపీ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి.
చిరాగ్ పాసవాన్ పార్టీకి 29.. బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ సీట్ల కేటాయింపులు పూర్తి
న్యూఢిల్లీ, అక్టోబరు 12: బిహార్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఎన్‌డీఏ కూటమిలో సీట్ల సర్దుబాటు ఆదివారం ఖరారయింది. మొత్తం 243 స్థానాలకుగానూ ప్రధాన పార్టీలైన జేడీయూ, బీజేపీ చెరి 101 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. కేంద్ర మంత్రి చిరాగ్ పాసవాన్ ఆధ్వర్యంలోని లోక్ జనశక్తి పార్టీ (రాంవిలాస్) 29 సీట్లలో, మరో కేంద్ర మంత్రి జితన్ రాం మాంఝీ నేతృత్వంలోని హిందుస్థానీ ఆవాం మోర్చా (సెక్యులర్) ఆరు చోట్ల, ఇంకో కేంద్ర మంత్రి ఉపేంద్ర కుశ్వాహాకు చెందిన రాష్ట్రీయ లోక్‌మోర్చా ఆరు స్థానాల్లో పోటీ చేయనున్నాయి. సీట్ల పంపకం ఖరారయినట్టు కేంద్ర మంత్రి, బీజేపీ బిహార్ ఇన్‌ఛార్జి ధర్మేంద్ర ప్రధాన్ ఎక్స్ ద్వారా ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర సీనియర్ నాయకులు పాల్గొన్న బీజేపీ సెంట్రల్ కమిటీ సమావేశంలో సీట్ల సర్దుబాటుకు ఆమోదం లభించిందని తెలిపారు. బీజేపీ కన్నా జేడీయూ ఎక్కువ సీట్లలో పోటీ చేయకుండా ఉండడం ఇదే ప్రథమం కావడం గమనార్హం. బీజేపీ కన్నా జేడీయూ కనీసం ఒక్క సీటులోనయినా అదనంగా అభ్యర్థిని నిలబెడుతుందని తొలుత ఊహాగానాలు వ్యాపించినా రెండు సరిసమాన స్థానాల్లో పోటీ చేయనుండడం విశేషం. గత ఎన్నికల్లో జేడీయూ 115 సీట్లలో, బీజేపీ 110 స్థానాల్లో పోటీ చేశాయి. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ..జేడీయూ కన్నా ఒక్కస్థానం అఽధికంగా ఉండేటట్టు సర్దుబాటు చేసుకుంది. ఇది జేడీయూ ప్రాబల్యం తగ్గుదలకు, బీజేపీ ప్రాధాన్యం పెరుగుదలకు సూచిక అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. చిరాగ్, మాంఝీ, కుశ్వాహాలు మరిన్ని సీట్ల కోసం గట్టిగా బేరసారాలు చేసినప్పటికీ పెద్దగా ఫలించలేదు. చివరకు అన్ని పార్టీల నాయకులు, కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేశారని దేవేంద్ర ప్రధాన్ పేర్కొన్నారు.
నేడు మహా కూటమి చర్చలు
సీట్ల పంపకాలపై మహాగట్‌బంధన్ భాగస్వామ్య పార్టీల మధ్య సోమవారం చర్చలు జరిపే అవకాశం ఉంది. కోర్టులో జరిగే విచారణకు హాజరయ్యే నిమిత్తం ఆర్జేడీ నాయకులు లాలు ప్రసాద్, తేజస్వీ యాదవ్‌లు ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. ఈ సందర్భంగా సీట్ల సర్దుబాటుపై కూడా చర్చలు జరిగే అవకాశాలు ఉన్నట్టు భావిస్తున్నారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 70 స్థానాలు కేటాయించగా కేవలం 19 సీట్లలోనే గెలిచింది. అందువల్ల ఈసారి ఆ పార్టీకి సీట్లు తగ్గిస్తారని, 50కి మించకపోవచ్చన్న అంచనాలు ఉన్నాయి. గత రెండు రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా వివిధ పార్టీలతో చర్చలు జరుపుతున్నారు. మహాకూటమిలో కొత్త పార్టీలు చేరాయని, వాటికి సీట్లు ఇవ్వాల్సి ఉన్నందున చర్చల్లో జాప్యం జరుగుతున్నట్టు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ చెప్పారు. అభ్యర్థుల పేర్లతో పాటు, ఉమ్మడి ఎలక్షన్ మేనిఫెస్టోను కూడా ఈ వారంలోనే ప్రకటించే అవకాశం ఉంది.
తేజస్వి యాదవ్‌ను ఎక్స్‌లో
అన్‌ఫాలో అయిన తేజ్ ప్రతాప్
న్యూఢిల్లీ, అక్టోబర్ 12: ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కుమారుడు, ఆ పార్టీ బహిష్కృత నేత తేజ్ ప్రతాప్ యాదవ్.. తన తమ్ముడు తేజస్వి యాదవ్‌ను ఎక్స్‌లో అన్‌ఫాలో అయ్యారు. ఇప్పటికే తన అక్కలు మీసా యాదవ్, హేమా యాదవ్‌లను అన్‌ఫాలో చేశారు. తేజ్ ప్రతాప్ యాదవ్ ఓ మహిళతో ఎప్పటి నుంచో రిలేషన్‌షి్‌పలో ఉన్నానని పోస్ట్ చేయడం ఇటీవల వివాదాస్పదమైంది. పార్టీ నైతిక విలువలు ఉల్లంఘించినందుకు ఆయన్ను పార్టీ, కుటుంబం నుంచి బహిష్కరిస్తున్నట్లు లాలూ ప్రసాద్ యాదవ్ ప్రకటించారు. ఆర్జేడీ నుంచి సస్పెన్షన్‌కు గురైన తేజ్ ప్రతాప్ కొత్తగా జనశక్తి జనతాదళ్(జేజేడీ) పార్టీని ప్రారంభించారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో తాను మహువా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నానని, తమ పార్టీ అభ్యర్థుల జాబితాను అక్టోబర్ 13న ప్రకటిస్తానని చెప్పారు. తేజ్ ప్రతా్‌పకు గతంలో బిహార్ మాజీ సీఎం దరోగా రాయ్ మనవరాలు ఐశ్వర్యతో వివాహమైంది. ఆ తర్వాత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో విడిపోయారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు కోర్టులో పెండింగ్‌లో ఉంది