Sonia Gandhi Voter ID Allegations: మీ ఫొటోషాప్ బాగుంది..
ABN , Publish Date - Aug 15 , 2025 | 04:15 AM
పౌరసత్వం పొందక ముందు నుంచే సోనియా గాంధీకి భారతదేశ ఓటుకార్డు ఉందని బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ ..
సోనియా ఓటుకార్డు ఆరోపణలపై బీజేపీకి కాంగ్రెస్ కౌంటర్
న్యూఢిల్లీ, ఆగస్టు 14: పౌరసత్వం పొందక ముందు నుంచే సోనియా గాంధీకి భారతదేశ ఓటుకార్డు ఉందని బీజేపీ చేసిన ఆరోపణలను కాంగ్రెస్ పార్టీ తిప్పికొట్టింది. పౌరసత్వానికి ముందు సోనియా గాంధీకిచ్చిన కార్డు ఇదేనంటూ ఆ పార్టీ ఓ ఓటుకార్డును విడుదల చేయడంపై కాంగ్రెస్ విస్మయం వ్యక్తం చేసింది. మంచిగా ఫొటోషాప్ చేసి ఐడీ కార్డును రూపొందించారని ఎద్దేవా చేసింది. ‘‘మీ ఫొటోషాప్ చాలా బాగుంది. సోనియా ఓటు కార్డును బాగా రూపొందించారు. కాని, 69వ రాజ్యాంగ సవరణ చట్టం 1991 ద్వారా 1992 జనవరి 2న నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ ఏర్పాటయింది. దానికి ముందు ఢిల్లీ కేంద్ర పాలిత ప్రాంతం మాత్రమే, మీరు ఆ విషయాన్ని గ్రహించకుండా కార్డును విడుదల చేయడం విడ్డూరంగా ఉంది’’ అంటూ బీజేపీ ఐటీ విభాగాన్ని ఉద్దేశించి ఎక్స్‌లో పేర్కొంది.