Rahul Gandhi: ఓట్ చోరీ ఆరోపణల్లో విదేశీ హస్తం
ABN , Publish Date - Sep 12 , 2025 | 03:48 AM
ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది...
రాహుల్ డాక్యుమెంట్లు ’మేడిన్ ఇండియా’ కాదు
అన్నీ మయన్మార్ టైమ్ జోన్‌తో ఉన్నాయ్: బీజేపీ
న్యూఢిల్లీ, సెప్టెంబరు 11: ఎన్నికల్లో ‘ఓట్ల చోరీ’ జరిగిందంటున్న కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ సంచలన ఆరోపణలు చేసింది. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి ఆయన చూపుతున్న పత్రాలు భారత్‌లో కాకుండా విదేశాల్లో తయారయ్యాయని, ప్రతిపక్షాల ఆరోపణల్లో విదేశీ హస్తం ఉందని బీజేపీ నేత ప్రదీప్ భండారి అన్నారు. ‘‘రాహుల్ గాంధీ అంతర్జాతీయ ‘ఓట్ల చోరీ టూల్‌కిట్’ బహిర్గతమైంది’’ అని ఎక్స్‌లో పోస్టు చేశారు. రాహుల్ రిమోట్ కంట్రోల్‌ను నడుపుతున్న ‘విదేశీ బాస్’ ఎవరు? అని ప్రశ్నించారు. ఓట్ల చోరీ ఆరోపణలకు సంబంధించి రాహుల్ ఆగస్టు 7న తన అధికారిక వెబ్‌సైట్‌లో ఇంగ్లిష్, హిందీ, కన్నడ భాషల్లో అప్‌లోడ్ చేసిన పత్రాల మెటాడేటాను నిశితంగా పరిశీలించగా.. ఈ డాక్యుమెంట్లన్నీ మయన్మార్ టైమ్ జోన్‌తో (+6:30 కకఖీ) ఉన్నట్లు వెల్లడైందన్నారు. సిస్టమ్ క్లాక్‌పై ఆధారపడే అడోబ్ ఇల్లుస్ట్రేటర్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఈ ఫైళ్లను ఎక్స్‌పోర్టు చేశారని, వీపీఎన్ ఉపయోగించి దాన్ని మార్చలేరన్నారు. మూడు ఫైళ్ల సృష్టిలో సమయం అంతరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. దీంతో రాహుల్ చూపిస్తున్న ‘ఆధారాలు’.. భారత్‌లో తయారు కాలేదని స్పష్టమవుతోందని ప్రదీప్ భండారి పేర్కొన్నారు.
‘హైడ్రోజన్ బాంబ్’తో అన్నీ స్పష్టం: రాహుల్
మరోవైపు తాను చేసిన ‘హైడ్రోజన్ బాంబ్’ వ్యాఖ్యలపై బీజేపీ చేస్తున్న విమర్శలకు రాహుల్ గాంధీ గురువారం స్పందించారు. ‘‘ఆందోళన చెందుతున్న బీజేపీ నేతలకు చెబుతున్నా.. ఆందోళన పడొద్దు. ‘హైడ్రోజన్ బాంబ్’ వచ్చినప్పుడు, ప్రతీది స్పష్టంగా వెల్లడవుతుంది’’ అని అన్నారు. అయితే ఎక్కడ విడుదల చేస్తామనేది ప్రస్తుతానికి రహస్యమన్నారు. మహారాష్ట్ర, హరియాణా, కర్నాటకల్లో ఎన్నికలను చోరీచేశారని, బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గానికి సంబంధించి అన్ని రకాలుగా ఆధారాలు ఇచ్చామని పేర్కొన్నారు. రాబోవు రోజుల్లో మరో సంచలన, కీలక ఆధారాలను బయటపెడతామని ఆయన పేర్కొన్నారు.