Share News

BJP Victory: బీజేపీకి 90 శాతం స్ట్రైక్‌ రేట్‌ ఎలా సాధ్యం

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:09 AM

బిహార్‌ ఫలితాలపై సమీక్షిస్తున్నాం. దేశ చరిత్రలో ఓ రాజకీయ పార్టీ (బీజేపీ)కి 90శాతం స్ట్రైక్‌ రేట్‌ అనేది ఎప్పుడూ సాధ్యం కాలేదు.

 BJP Victory: బీజేపీకి 90 శాతం  స్ట్రైక్‌ రేట్‌ ఎలా సాధ్యం

  • దేశ చరిత్రలో ఎన్నడూ ఇలా జరగలేదు: కేసీ వేణుగోపాల్‌

  • బిహార్‌ ఫలితాలు ఓట్‌ చోరీకి నిదర్శనం: జైరాం రమేశ్‌

న్యూఢిల్లీ, నవంబరు 15: ‘బిహార్‌ ఫలితాలపై సమీక్షిస్తున్నాం. దేశ చరిత్రలో ఓ రాజకీయ పార్టీ (బీజేపీ)కి 90ు స్ట్రైక్‌ రేట్‌ అనేది ఎప్పుడూ సాధ్యం కాలేదు. ఈసీ మొదట్నుంచీ పక్షపాతంతో వ్యవహరించింది. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత లేదు. డేటాను సేకరిస్తున్నాం. ఒకటి, రెండు వారాల్లో కచ్చితమైన ఆధారాలతో వస్తాం’ అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ అన్నారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, కోశాధికారి అజయ్‌ మాకెన్‌, బిహార్‌ ఇన్‌చార్జి కృష్ణ అల్లవారు తదితర సీనియర్‌ నేతలతో ఆ పార్టీ అధ్యక్షుడు ఖర్గే, అగ్రనేత రాహుల్‌గాంధీ శనివారం సమావేశమై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశం తర్వాత వేణుగోపాల్‌ మీడియాతో మాట్లాడారు. ఈసీపై ఆరోపణలు గుప్పించారు. బీజేపీని ఈసీ కాపాడుతోందన్నారు. మెషీన్‌ రీడబుల్‌ ఓటర్ల జాబితాలను అందించడానికి నిరాకరించడం, పోలింగ్‌ ప్రక్రియల నుంచి సీసీటీవీ ఫుటేజీని తొలగించడం ద్వారా సిగ్గు లేకుండా ఈసీ అన్ని పరిధులు దాటిందని దుయ్యబట్టారు. ‘ఏ సందేహం లేదు. బిహార్‌ ఎన్నికల ఫలితాలు ప్రధాని, కేంద్ర హోంమంత్రి, ఎన్నికల సంఘం అమలు చేసిన భారీ స్థాయి ఓట్‌ చోరీనే ప్రతిబింబిస్తున్నాయి’ అని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జైరాం రమేశ్‌ ఆరోపించారు. ఎన్ని పరాజయాలు ఎదురైనా కాంగ్రెస్‌ ఎన్నడూ కనుమరుగు కాలేదని మహారాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జ్‌ రమేశ్‌ చెన్నితాల చెప్పారు. కాంగ్రెస్‌ అంతం అవుతుంది లేదా ముక్కలవుతుందన్న వాదనకు అసలు అర్థమే లేదని వ్యాఖ్యానించారు.

Updated Date - Nov 16 , 2025 | 07:11 AM