Share News

Bilawal Bhutto: భారత్‌తో మరో యుద్ధానికి మేం సిద్ధం

ABN , Publish Date - Jun 23 , 2025 | 04:35 AM

సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని భారత్‌ మార్చుకోకపోతే పాకిస్థాన్‌ మరో యుద్ధం చేస్తుందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో హెచ్చరించారు.

Bilawal Bhutto: భారత్‌తో మరో యుద్ధానికి మేం సిద్ధం

  • సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేతపై బిలావల్‌ హెచ్చరిక

  • 6 నదులనూ తమ ఆధీనంలోకి తీసుకుంటామంటూ ప్రేలాపనలు

ఇస్లామాబాద్‌: సింధూ నదీ జలాల ఒప్పందం నిలిపివేత నిర్ణయాన్ని భారత్‌ మార్చుకోకపోతే పాకిస్థాన్‌ మరో యుద్ధం చేస్తుందని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్‌ భుట్టో హెచ్చరించారు. అంతేకాదు ఒప్పందం ప్రకారం భారత్‌కు కేటాయించిన 3 నదులతో సహా మొత్తం 6 నదులను తమ ఆధీనంలోకి తెచ్చుకుంటామన్నారు. భారత్‌ ముందు రెండే మార్గాలున్నాయన్నారు. ఒప్పందం నిలిపివేతను తొలగించడం లేదా పాకిస్ధాన్‌తో యుద్ధానికి సిద్ధపడటం అని బిలావల్‌ భుట్టో స్పష్టం చేశారు.


పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ నేతృత్వంలో జరిగిన బహిరంగ సభలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయన గతంలో కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సింధూ నదిలో నీళ్లు పారకపోతే భారతీయుల రక్తం ప్రవహిస్తుందన్నారు. ఏప్రిల్‌లో పహల్గంలో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడంతో భారత్‌.. సింధూ ఒప్పందాన్ని నిలిపివేసింది. ఉగ్రవాదానికి ఊతమియ్యడం మానేసేవరకు నిలిపివేత కొనసాగుతుందని భారత్‌ స్పష్టం చేసింది.

Updated Date - Jun 23 , 2025 | 04:35 AM