Share News

Voter List Update: 68.5 లక్షల ఓటర్ల తొలగింపు

ABN , Publish Date - Oct 01 , 2025 | 01:56 AM

వచ్చే నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దాదాపు 68.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది....

Voter List Update: 68.5 లక్షల ఓటర్ల తొలగింపు

  • బిహార్‌లో ఓటర్ల తుది జాబితా వెల్లడి

  • కొత్తగా 21.53 లక్షల ఓటర్ల నమోదు

  • మొత్తం ఓటర్ల సంఖ్య 7.42 కోట్లు

న్యూఢిల్లీ/పట్నా, సెప్టెంబరు 30: వచ్చే నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న బిహార్‌లో కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) దాదాపు 68.5 లక్షల మంది ఓటర్ల పేర్లు తొలగించింది. గత జూన్‌ 24న 7.89 కోట్ల మంది ఓటర్లుండగా, మంగళవారం ప్రకటించిన తుది జాబితాలో 7.42 కోట్ల మందే ఉన్నారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) తుది జాబితాలోనూ మరో 3.66 లక్షల మంది పేర్లను తొలగించడంతోపాటు కొత్తగా 21.53 లక్షల మందిని జత చేసింది. కేంద్రంలోని అధికార బీజేపీ ఆదేశాల మేరకే బిహార్‌లో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎస్‌ఐఆర్‌ నిర్వహిస్తోందని విపక్షాలు దుమ్మెత్తిపోశాయి. కానీ, ప్రతిపక్షాల ఆరోపణలను ఈసీ నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. దీంతో పౌరసత్వ తనిఖీ తరహాలో ఎస్‌ఐఆర్‌ను ఈసీ నిర్వహిస్తోందని, దీనికి చట్టబద్ధత ఉందా? అని సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. కాగా, 3 నెలలు సాగిన ఎస్‌ఐఆర్‌ తర్వాత గత ఆగస్టు ఒకటో తేదీన ప్రకటించిన ఓటర్ల జాబితాలో 65 లక్షల మందిని తొలగించింది. మృతులు, శాశ్వతంగా ఇల్లు మారిన వారు, పలు చోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు, జాడ తెలియని వారి పేర్లను పోలింగ్‌ బూత్‌ స్థాయి అధికారుల నిర్ధారణతో తొలగించినట్లు ఈసీ పేర్కొంది. ఇక, ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ప్రకటించే అనుబంధ జాబితాతో తుది ఓటర్ల జాబితాలో స్వల్పంగా మార్పులు చేర్పులుండొచ్చునని ఈసీ వివరించింది. ఎస్‌ఐఆర్‌లో భాగంగా ఈసీ ఆదేశాల ప్రకారం 7.89 కోట్ల మంది ఓటర్ల జాబితాలో 2003 తర్వాత ఓటర్లుగా నమోదైన వారు పౌరసత్వంతోపాటు తమ అర్హతలను రుజువు చేసే పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. దేశవ్యాప్తంగా ఎస్‌ఐఆర్‌ చేపట్టనున్నట్లు గత జూన్‌ 24న ప్రకటించిన ఈసీ.. తొలుత వచ్చే నవంబరులో అసెంబ్లీ ఎన్నికలు జరిగే బిహార్‌లో ప్రారంభించింది. రెండు దశాబ్దాలుగా వార్షిక ఓటర్ల సవరణ మినహా తాజా ఓటర్ల జాబితాను రూపొందించేందుకే ఎస్‌ఐఆర్‌ చేపట్టామని గత జూన్‌ 24న ప్రకటించింది. దీనికి శరవేగంగా పట్టణీకరణ, తరచూ వలసలు, ఓటర్లుగా నమోదైన యువజనులు, మృతుల పేర్లు నివేదించకపోవడం, విదేశీ అక్రమ వలసదారుల పేర్ల నమోదు వంటి అంశాలు కారణాలని వివరించింది. ఈసీ ఆదేశాల ప్రకారం 1987 జూలై ఒకటో తేదీ నుంచి 2004 డిసెంబర్‌ రెండో తేదీ మధ్య జన్మించిన ఓటర్లు.. తమతోపాటు తల్లిదండ్రుల పత్రాలు సమర్పించాలి. ఈ నిబంధనలన్నీ 1955లోని పౌరసత్వ చట్టంలోనివే కావడం గమనార్హం. ఓటర్ల పౌరసత్వ తనిఖీకి ఈసీ చేపట్టిన ఎస్‌ఐఆర్‌ చట్టబద్ధతను సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. రాజ్యాంగంలోని 326వ అధికరణం ప్రకారం ప్రస్తుతం ఓటరుగా పేరు నమోదు చేసుకునేందుకు వినియోగిస్తున్న ఫామ్‌-6 ప్రకారం పౌరసత్వ ధ్రువీకరణ అవసరం లేదు.


పట్నాలో పెరిగిన 1.63 లక్షల మంది ఓటర్లు

బిహార్‌ రాష్ట్ర రాజధాని పట్నా జిల్లాలో కొత్తగా 1.63 లక్షల మంది ఓటర్లు తమ పేర్లు నమోదు చేసుకున్నారు. పట్నా జిల్లాలోని 14 అసెంబ్లీ సెగ్మెంట్ల పరిధిలో ఆగస్టు ఒకటో తేదీన ప్రకటించిన 48.15 లక్షల మంది ఓటర్లకు ఇది అదనం. జిల్లాలో 22.75 లక్షల మంది మహిళా ఓటర్లు ఉండగా, డిఘా సెగ్మెంట్‌లో అధికంగా 4.56 లక్షల మంది ఉన్నారు.

Updated Date - Oct 01 , 2025 | 06:07 AM