Share News

కుల విషాన్ని తిరస్కరించిన బిహార్‌ ఓటర్లు: మోదీ

ABN , Publish Date - Nov 16 , 2025 | 07:05 AM

ప్రతిపక్షాలు చిమ్మిన ‘కులతత్వ విషాన్ని’ బిహార్‌ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ అన్నారు.

కుల విషాన్ని తిరస్కరించిన బిహార్‌ ఓటర్లు: మోదీ

సూరత్‌, నవంబరు 15: ప్రతిపక్షాలు చిమ్మిన ‘కులతత్వ విషాన్ని’ బిహార్‌ ప్రజలు తిరస్కరించారని ప్రధాని మోదీ అన్నారు. ఇది దేశానికి శుభ సూచకమని చెప్పారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్‌డీఏ ఘన విజయం సాఽధించడాన్ని పురస్కరించుకొని గుజరాత్‌లోని సూరత్‌లో అక్కడ నివసిస్తున్న బిహారీలు శనివారం నిర్వహించిన సన్మాన సభలో ఆయన ప్రసంగించారు. కులాల పేరు చెప్పి విజయం సాధించాలనుకున్న నాయకుల ప్రయత్నాలను బిహార్‌ ప్రజలు వమ్ముచేశారని చెప్పారు. ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌ గాంఽధీపై మోదీ విమర్శల బాణాలు సంధించారు. మాజీ ప్రధానులు ఇందిరాగాంధీ, రాజీవ్‌ గాంధీలతో కలిసి పనిచేసిన కాంగ్రెస్‌లోని జాతీయవాద నాయకులు ‘నామ్‌ధార్‌’ (రాహుల్‌ గాంఽధీ) చర్యలను చూసి విచారంలో మునిగిపోయారని వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్‌ ఎదుర్కొంటున్న వరుస పరాజయాలను చూసి ఆ పార్టీ ఆత్మపరిశీలన చేసుకోవాల్సి ఉందని చెప్పారు. దళితులు ఆధిక్యం ఉన్న 38 నియోజకవర్గాలకుగానూ 34 ఎన్‌డీఏకు దక్కాయని గుర్తు చేశారు. దళితులు ప్రతిపక్షాలను తిరస్కరించారనడానికి ఇదే రుజువని చెప్పారు.

Updated Date - Nov 16 , 2025 | 07:06 AM