Second Phase of Assembly Elections: ఓటెత్తిన బిహార్‌రెండో దశలో భారీగా 68.79శాతం పోలింగ్
ABN , Publish Date - Nov 12 , 2025 | 02:25 AM
బిహార్లో ఓటర్లు పోటెత్తారు. మున్నెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 121 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో...
పట్నా, నవంబరు 11: బిహార్లో ఓటర్లు పోటెత్తారు. మున్నెన్నడూ లేని విధంగా భారీ సంఖ్యలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. 121 అసెంబ్లీ స్థానాలకు మంగళవారం జరిగిన రెండో దశ ఎన్నికల్లో ఏకంగా 68.79 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్(ఈసీ) ప్రకటించింది. గత ఎన్నికల్లో రెండో విడతలో 58.8 శాతం మాత్రమే పోలింగ్ జరుగగా.. ఈసారి 9.6 శాతం ఎక్కువ ఓటింగ్ నమోదైంది. మంగళవారం 3.7 కోట్ల మంది ఓటర్లు 1,302 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఈవీఎంలలో నిక్షిప్తంచేశారు. రాష్ట్ర అసెంబ్లీలో 243 సీట్లు ఉండగా.. తొలివిడతలో 122 స్థానాలకు ఈ నెల 6న ఎన్నికలు జరిగాయి. 65.09ు పోలింగ్ నమోదైంది. రెండు దశల్లో కలిపి సగటున 66.9ు పోలింగ్ జరిగిందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వినోద్‌సింగ్ గుంజియాల్ వెల్లడించారు. రాష్ట్రంలో ఇంత ఓటింగ్ గతంలో ఎప్పుడూ లేదు. తొలి విడత(69.04ు)లో మాదిరిగానే మంగళవారం కూడా మహిళలు భారీస్థాయిలో ఓటుహక్కు వినియోగించుకున్నారు. ఓటింగ్‌లో 74.03ు వారిదే. మొత్తంగా రెండు దశల్లో కలిపి 71.6ు మంది మహిళలు ఓటుహక్కు వినియోగించారు. కాగా, బిహార్ ఫలితాలను శుక్రవారం ప్రకటిస్తారు. కాగా, తెలంగాణ మినహా మిగిలిన అయిదు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ-కశ్మీర్‌లలో ఏడు స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లోనూ భారీగా పోలింగ్ నమోదైంది. దంపా(మిజోరాం)లో 82.34ు, అంత(రాజస్థాన్)లో 80.32ు, నువాపడా(ఒడిశా)లో 75.08ు, ఘటశిల (ఝార్ఖండ్)లో 74.65ు కాగా తరన్‌తారన్(పంజాబ్)లో కేవలం 50.02ు ఓటింగ్ నమోదయింది. జమ్మూ-కశ్మీర్‌లోని నగ్రోటాలో 74.63ు, బుడ్‌గాంలో 50.02శాతం ఓటింగ్ జరిగింది.