Bihar Minister Nitin Nabin: బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్!
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:05 AM
బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్(45)ని ప్రకటించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆయన్ను నియమించినట్లు....
న్యూఢిల్లీ, పట్నా, లఖ్‌నవూ, డిసెంబరు 14 : బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్ మంత్రి నితిన్ నబీన్(45)ని ప్రకటించారు. పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆయన్ను నియమించినట్లు బీజేపీ జాతీయ జనరల్ సెక్రటరీ అరుణ్ సింగ్ ఆదివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నితిన్ నబీన్ బిహార్ ప్రభుత్వంలో ప్రజాపనులశాఖ మంత్రిగా ఉన్నారు. రానున్న కాలంలో ఈయన ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా స్థానాన్ని భర్తీ చేస్తారని బీజేపీ నేతలు తెలిపారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన నబీన్‌ఇప్పటికే బిహార్ రాష్ట్ర ప్రభుత్వంలో రెండుసార్లు మంత్రిగా వ్యవహరించారు. ప్రస్తుతం పట్నాలోని బంకిపూర్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన యువ నేతల్లో ఈయన ఒకరు. కాగా ఈయన నియామకం పలువురిని ఆశ్చర్యపరిచింది. అయితే పరిపాలన అనుభవం, పార్టీకి అంకిత భావంతో చేసి న సేవలు ఆయనకు ఈ పదవిని తెచ్చి పెట్టాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. బీజేవైఎం నేతగా సుదీర్ఘ అనుభవం, బూత్ స్థాయిలో పనిచేసి న అనుభవం, కార్యకర్తలను నడిపించే నైపుణ్యం ఆయనకు కలిసి వచ్చా యి. 2023లో జరిగిన ఛత్తీ్‌సగఢ్ అసెంబ్లీ ఎన్నికలు ఆయన నాయకత్వ పటిమను మరింత వెలుగులోకి తెచ్చాయి. ఆ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పలు ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయగా.. అందుకు భిన్నంగా ఘనవిజయం సాధించింది. అప్పుడు ఛత్తీ్‌సగఢ్ బీజేపీ ఇన్‌చార్జిగా ఉన్న నితిన్ నబీన్ తన వ్యూహరచనతో పార్టీని ప్రజలకు చేరువ చేయడంతోపాటు నేతలను ఏకతాటిపై నడిపించి పార్టీకి ఘన విజయాన్ని సాధించి పెట్టారు. దీంతో ఎన్నికల వ్యూహకర్తగా పార్టీలో ఆయన పేరు గడించారు. ప్రధాని మోదీ ఆయన్ను అభినందిస్తూ.. నబీన్ అంకిత భావం, సమర్థత రానున్న కాలంలో బీజేపీని మరింత బలోపేతం చేస్తుందని ఆకాంక్షించారు.
బీజేపీ యూపీ అధ్యక్షుడిగా పంకజ్ చౌధరి
బీజేపీ ఉత్తర్‌ప్రదేశ్ యూనిట్ నూతన అధ్యక్షుడిగా కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌధరి ఎన్నికయ్యారు. ఈమేరకు లఖ్‌నవూలో ఆదివారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, ఉప ముఖ్యమంత్రులు కేశవ్ ప్రసాద్ మౌర్య, బ్రజేష్ పాఠక్ సమక్షంలో పంకజ్ చౌధరి ఎన్నికైనట్లు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. అధ్యక్ష పదవికి పంకజ్ ఒక్కరే నామినేషన్ వేశారు. కాగా బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఎంపికైన నితిన్ నబీన్‌కు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేశ్ అభినందనలు తెలిపారు. కాగా, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు డాక్టర్ కె.లక్ష్మణ్ యూపీ సంస్థాగత ఎన్నికల ఇన్‌చార్జిగా వ్యవహరించారు. ఆదివారం లఖ్‌నవూలో జరిగిన సంస్థాగత ఎన్నికల ప్రక్రియలో ఆయన పాల్గొన్నారు.