Share News

Bihar Elections: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం

ABN , Publish Date - Oct 29 , 2025 | 05:56 AM

యువతకు, మైనార్టీలకు ప్రాధాన్యం, భరోసా ఇస్తూ మహా కూటమి మంగళవారం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే కుటుంబంలో ...

Bihar Elections: ఇంటికో ప్రభుత్వ ఉద్యోగం

  • అధికారంలోకి వచ్చిన 20 రోజుల్లోనే

  • పాత పింఛను విధానం కూడా అమలు

  • బిహార్‌లో మహాకూటమి మేనిఫెస్టో

  • ‘తేజస్వీ ప్రాణ్‌ పత్ర్‌’గా అభివర్ణణ

పట్నా, అక్టోబరు 28: యువతకు, మైనార్టీలకు ప్రాధాన్యం, భరోసా ఇస్తూ మహా కూటమి మంగళవారం ఉమ్మడి ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. అధికారంలోకి వచ్చిన మొదటి 20 రోజుల్లోనే కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని ఘనంగా ప్రకటించింది. 25 అంశాలతో కూడిన ఈ మేనిఫెస్టోలో ఇదే అగ్రస్థానంలో ఉండడం గమనార్హం. కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న జీవిక దీదీలను పర్మినెంట్‌ చేస్తామని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్‌ విధానం పునరుద్ధరణ కూడా హామీల్లో ఒకటి. కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన వక్ఫ్‌ సవరణ చట్టాన్ని బిహార్‌లో అమలు చేయబోమని స్పష్టం చేసింది. మరింత పారదర్శకంగా వక్ఫ్‌ ఆస్తులను నిర్వహించేలా విధానాలు రూపొందిస్తామని తెలిపింది. బోధ్‌ గయలోని బుద్ధ ఆలయాలు బౌద్ధులకే అప్పగిస్తామని ప్రకటించింది. మైనార్టీల రాజ్యాంగపర హక్కులను కాపాడుతామని తెలిపింది.


హాజరుకాని రాహుల్‌ గాంధీ

పట్నాలో జరిగిన ఎన్నికల మేనిఫెస్టో ఆవిష్కరణ కార్యక్రమంలో తేజస్వీ యాదవ్‌, దీపాంకర్‌ భట్టాచార్యతో పాటు కాంగ్రెస్‌ నాయకుడు పవన్‌ఖేరా, ఉపముఖ్యమంత్రి అభ్యర్థి, వికా్‌సశీల్‌ ఇన్సాఫ్‌ పార్టీ నాయకుడు ముకేశ్‌ సాహ్నీ పాల్గొన్నారు. మేనిఫెస్టోను ‘తేజస్వీ ప్రాణ్‌ పత్ర్‌’గా అభివర్ణిస్తున్నారు. సమస్యలకు ఆచరణాత్మక పరిష్కారాలు ఉండేలా దీన్ని రూపొందించినట్టు తేజస్వీ చెప్పారు. అయితే కాంగ్రెస్‌ అగ్ర నాయకుడు రాహుల్‌ గాంధీ హాజరుకాకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎన్నికలు జరుగుతున్నా రాహుల్‌ గత రెండు నెలలుగా బిహార్‌లో అడుగు పెట్టలేదేమని ఇప్పటికే చర్చలు నడున్నాయి. మేనిఫెస్టో మొదటి పేజీపై తేజస్వీ ఫొటోను పెద్దదిగా ప్రచురించి, రాహుల్‌ ఫొటోను పేజీ పైభాగాన ఓ మూల చిన్నదిగా ముద్రించడాన్ని కూడా పలువురు ఎత్తిచూపుతున్నారు. మారిన రాజకీయ ప్రాధాన్యతలకు ఇది నిదర్శనమని వ్యాఖ్యానిస్తున్నారు. రాహుల్‌ ఆగస్టులో ఓటర్‌ అధికార్‌ యాత్ర నిర్వహించిన తరువాత మళ్లీ రాలేదు. కాగా, రాహుల్‌ మంగళవారం బిహార్‌ యువతను ఉద్దేశించి ఎక్స్‌లో పోస్టు పెట్టారు. యువత ఆశలను మోదీ-నీతీశ్‌ సర్కారు గొంతు నులిమి చంపిందని విమర్శించారు. మరోవైపు, పార్టీ సిద్ధాంతాలను ధిక్కరించినందుకు ఆర్జేడీ నుంచి 17 మందిని సస్పెండ్‌ చేశారు. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారు.


ఓట్ల వివాదంలో ప్రశాంత్‌ కిశోర్‌!

బిహార్‌ ఎన్నికల వేళ జన్‌సురాజ్‌ పార్టీ అధినేత ప్రశాంత్‌ కిశోర్‌ చిక్కుల్లో పడ్డారు. ఆయనకు రెండు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉన్న విషయం మంగళవారం వెలుగు చూసింది. స్వరాష్ట్రం బిహార్‌తోపాటు పశ్చిమ బెంగాల్‌లోనూ ఆయనకు ఓటు హక్కు ఉందని తెలియడం వివాదంగా మారింది. బెంగాల్‌లోని భవానిపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో పీకేకు ఓటు ఉంది. ఇది బెంగాల్‌ సీఎం మమత నియోజకవర్గం కావడం గమనార్హం. 2021, బెంగాల్‌ ఎన్నికల సమయంలో టీఎంసీ పార్టీకి పీకే రాజకీయ వ్యూహకర్తగా పనిచేశారు. ఈక్రమంలో ఆయన భవానీపూర్‌లో ఓటరుగా పేరు నమోదు చేసుకున్నారు.

Updated Date - Oct 29 , 2025 | 05:57 AM