Share News

Election Commission: బిహార్‌ దంగల్‌ షురూ

ABN , Publish Date - Oct 07 , 2025 | 02:21 AM

దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది.....

Election Commission: బిహార్‌ దంగల్‌ షురూ

  • అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం

  • రెండు దశల్లో ఎన్నికలు.. నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్‌

  • 14న ఓట్ల లెక్కింపు, ఫలితాలు.. సీట్లు 243.. మొత్తం ఓటర్లు 7.43 కోట్లు

న్యూఢిల్లీ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న బిహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం షెడ్యూల్‌ విడుదల చేసింది. బిహార్‌లోని మొత్తం 243 అసెంబ్లీ స్థానాలకు రెండు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ జ్ఞానేశ్‌కుమార్‌ చెప్పారు. నవంబరు 6, 11 తేదీల్లో పోలింగ్‌ జరుగుతుందని, 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఎన్నికల కమిషనర్లు సుఖ్‌బీర్‌సింగ్‌, వివేక్‌ జోషిలతో కలసి ఆయన ఈ వివరాలను వెల్లడించారు. అన్ని ఎన్నికల కన్నా ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవని అభివర్ణించారు. అక్టోబరు నెలాఖరులో జరిగే ఛత్‌ పూజ ఉత్సవాల తర్వాత ఎన్నికలు జరపాలని రాజకీయ పార్టీలు కోరడంతో అందుకు అనుగుణంగా తేదీలను నిర్ణయించామని తెలిపారు. దాదాపు 8.5 లక్షల మంది అధికారులు ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షిస్తారని వివరించారు. బిహార్‌లో సోమవారం నుంచే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినట్టు ప్రకటించారు. పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లపై వివాదం నేపథ్యంలో.. కౌంటింగ్‌లో చివరి రెండు రౌండ్లు మిగిలేసరికల్లా పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు కచ్చితంగా పూర్తి చేయనున్నట్టు వెల్లడించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (ఎస్‌ఐఆర్‌)ను శుద్ధీకరణగా జ్ఞానేశ్‌కుమార్‌ అభివర్ణించారు. దానితో 69 లక్షల ఓట్లను తొలగించినట్టు చెప్పారు. కాగా, బిహార్‌లో రెండు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నా రు. తొలి విడతలో 121 స్థానాల ఎన్నికలకు అక్టోబర్‌ 10న నోటిఫికేషన్‌ విడుదలవుతుంది. 20వ తేదీ నాటికి నామినేషన్ల ప్రక్రియ పూర్తయి అభ్యర్థులు ఖరారవుతారు. నవంబర్‌ 6న పోలింగ్‌ జరుగుతుంది. రెండో విడతలో 122 స్థానాలకు అక్టోబర్‌ 13న నోటిఫికేషన్‌ ఇస్తారు. 23వ తేదీ నాటికి అభ్యర్థులు ఖరారవుతారు. నవంబర్‌ 11న పోలింగ్‌ జరుగుతుంది. మొత్తం అన్ని స్థానాలకు 14వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలు విడుదల చేస్తారు.


దేశవ్యాప్తంగా ఎనిమిది చోట్ల ఉప ఎన్నికలు

తెలంగాణలోని జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ స్థానం సహా దేశవ్యాప్తంగా ఎనిమిది అసెంబ్లీ సెగ్మెంట్ల ఉప ఎన్నికలకు కూడా కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్‌ విడుదల చేసింది. జమ్మూకశ్మీర్‌లోని బుడ్గామ్‌, నగ్రోటా, రాజస్థాన్‌లోని అంతా, జార్ఖండ్‌లోని ఘట్‌సిలా, పంజాబ్‌లోని తరన్‌ తరన్‌, మిజోరంలోని డంపా, ఒడిశాలోని నౌపాడ నియోజకవర్గాలకు నవంబర్‌ 11న పోలింగ్‌ జరగనుంది. రెండు స్థానాల్లో గెలిచిన జమ్మూకశ్మీర్‌ సీఎం ఒమర్‌ అబ్దుల్లా బుడ్గామ్‌ స్థానాన్ని వదులుకోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. రాజస్థాన్‌లోని అంతా స్థానం బీజేపీ ఎమ్మెల్యే కొందరిని తుపాకీతో బెదిరించిన కేసు కారణంగా అనర్హతకు గురవడంతో ఉప ఎన్నిక జరుగుతోంది. మిగతా ఆరు స్థానాల్లో ఎమ్మెల్యేలు మృతి చెందడంతో ఉప ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

జంగిల్‌ రాజ్‌ నుంచి బయటికి తెచ్చాం:షా

బిహార్‌ను జంగిల్‌రాజ్‌ (ఆటవిక రాజ్యం) నుంచి తమ ఎన్డీయే ప్రభుత్వమే బయటపడేసిందని.. అభివృద్ధి, సుపరిపాలన మార్గం చూపిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. ఈసారి కూడా ప్రజలు అభివృద్ధికే ఓటేస్తారని పేర్కొన్నారు. బిహారీలు మరో సారి ఎన్డీయేను గెలిపిస్తారని బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో ప్రజలు మార్పు కోసం ఓటేయనున్నారని ఆర్జేడీ నేత తేజస్వియాదవ్‌ పేర్కొన్నారు.

Updated Date - Oct 07 , 2025 | 02:21 AM