Share News

PM Modi: అయోధ్య రామ మందిరంపై నేడు కాషాయ ధ్వజారోహణ

ABN , Publish Date - Nov 25 , 2025 | 04:01 AM

అయోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం మంగళవారం పూర్తికానుంది. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ పనులు పూర్త్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేయనున్నారు.....

 PM Modi: అయోధ్య రామ మందిరంపై నేడు కాషాయ ధ్వజారోహణ

  • ఆవిష్కరించనున్న ప్రధాని మోదీ

  • ఆలయ పనులు సంపూర్ణం

  • త్రికోణం ఆకృతిలో కాషాయ జెండా

  • మధ్యలో సూర్యుడు, ఓం,దేవకాంచనం చెట్టు చిహ్నాలు

అయోధ్య, నవంబరు 24: యోధ్య రామ మందిర నిర్మాణ పనుల్లో చివరి ఘట్టం మంగళవారం పూర్తికానుంది. ఆలయ శిఖరంపై కాషాయ ధ్వజాన్ని ప్రధాని మోదీ ఆవిష్కరించనున్నారు. ఆలయ పనులు పూర్త్తయ్యాయనడానికి గుర్తుగా ఈ ధ్వజారోహణ చేయనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఆ జెండా 10 అడుగుల ఎత్తు, 20 అడుగుల పొడవుతో లంబకోణ త్రిభుజం ఆకారంలో ఉంటుంది. జెండా మధ్యలో రాముని ప్రతిభ, ధైర్యానికి చిహ్నంగా ప్రకాశించే సూర్యుని బొమ్మ ఉంటుంది. ఓం చిహ్నంతో పాటు, కోవిదార వృక్షం(దేవ కాంచనం చెట్టు) బొమ్మ ఉంటుంది. ఈ పవిత్ర కాషాయ ధ్వజం.. ప్రతిష్ఠ, ఐక్యత, సాంస్కృతిక పరంపర, రామరాజ్య ఆదర్శాలకు చిహ్నంగా ఉంటుందని ఆ ప్రకటనలో వివరించింది. ఆలయం పైభాగాన ఉత్తర భారత సంప్రదాయ వాస్తు అయిన నగర శైలిలో శిఖరం నిర్మించారు. ఆ శిఖరంపై ఈ ధ్వజాన్ని అమర్చనున్నారు. 800 మీటర్ల చుట్టుకొలత ఉన్న ఆలయ ప్రాకారాన్ని దక్షిణాది శైలిలో నిర్మించడం విశేషం. అయోధ్య రామ మందిరంలో నిర్మించిన ఇతర ఆలయాలను కూడా ప్రధాని మోదీ సందర్శించనున్నారు. సప్త మందిర్‌గా వ్యవహరిస్తున్న మహర్షి వశిష్ఠ, మహర్షి విశ్వామిత్ర, మహర్షి వాల్మీకి, మహర్షి అగస్థ్య, దేవీ అహల్య, మాతా శబరి, నిషాద్‌రాజు గుహుని మందిరాలను దర్శించి అనంతరం శేషావతార్‌ మందిర్‌కు వెళ్లనున్నారు. మాతా అన్నపూర్ణ, రామ దర్బార్‌ గర్భ గృహంలో పూజలు చేయనున్నారు. చివరగా రామ లల్లా గర్భ గృహాన్ని దర్శించి పూజలు చేయనున్నారు. మధ్యాహ్నం ధ్వజారోహణ చేసిన అనంతరం అక్కడ నిర్వహించే సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. వాల్మీకి రామాయణంలోని ఘట్టాలను ఆలయ గోడలపై 87 రాతి శిల్పాలుగా చెక్కారు. దేశ సంస్కృతిని 79 కాంస్య రేకులపై చిత్రీకరించారు. ఇవన్నీ కనువిందు చేయనున్నాయి. ధ్వజారోహణ ముహార్తానికి కూడా విశేషం ఉంది. మార్గశిర మాస శుక్ల పక్ష పంచమి నాడు అభిజిత్‌ లగ్నంలో ఈ కార్యక్రమం జరగనుంది. పంచమినాడు అభిజిత్‌ లగ్నంలోనే సీతారాముల కల్యాణం జరిగింది. సిక్కుల తొమ్మిదవ గురువు తేగ్‌ బహాదుర్‌ ఇదే రోజున అమరుడయ్యారు. ఆయన 17వ శతాబ్దంలో అయోధ్య సమస్యపై 48 గంటల పాటు సంప్రదింపులు జరపడం గమనార్హం. ప్రధాని రాక సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చేసిన ఏర్పాట్లపై యూపీ సీఎం యోగి సోమవారం సమీక్ష జరిపారు.

Updated Date - Nov 25 , 2025 | 04:01 AM