Share News

Ayodhya Mosque Plan Rejected: నిరభ్యంతర పత్రాలు రాక అయోధ్య మసీదు ప్లాన్‌ తిరస్కరణ

ABN , Publish Date - Sep 24 , 2025 | 02:49 AM

అయోధ్యకు సమీపంలోని ధన్నీపూర్‌ గ్రామంలో నిర్మించతలపెట్టిన మసీదు ప్లాన్‌ను అయోధ్య అభివృద్ధి సంస్థ...

Ayodhya Mosque Plan Rejected: నిరభ్యంతర పత్రాలు రాక అయోధ్య మసీదు ప్లాన్‌ తిరస్కరణ

అయోధ్య, సెప్టెంబరు 23: అయోధ్యకు సమీపంలోని ధన్నీపూర్‌ గ్రామంలో నిర్మించతలపెట్టిన మసీదు ప్లాన్‌ను అయోధ్య అభివృద్ధి సంస్థ (ఏడీఏ) తిరస్కరించింది. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఇంకా నిరభ్యంతర పత్రాలు (ఎన్‌ఓసీలు) అందకపోవడమే ఇందుకు కారణమని తెలిపింది. సమాచార హక్కు చట్టం కింద జర్నలిస్టు ఓం ప్రకాశ్‌ సింగ్‌ సమర్పించిన దరఖాస్తుకు సమాధానంగా ఈ నెల 16న ఈ విషయాన్ని వెల్లడించింది. రామజన్మభూమి కేసు తీర్పులో భాగంగా నూతన మసీదు నిర్మాణం నిమిత్తం సెంట్రల్‌ సున్నీ వక్ఫ్‌ బోర్డుకు అయిదెకరాల స్థలం కేటాయించాలని 2019 నవంబరు 9న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఆ మేరకు అయోధ్యకు 25 కి.మీ. దూరంలోని ధన్నీపూర్‌లో ఆ స్థలాన్ని అప్పగిస్తూ 2020 ఆగస్టు 3న జిల్లా కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణానికి సంబంధించి 2021 జూన్‌ 23న మసీదు ట్రస్టు అయోధ్య అభివృద్ధి అథారిటీకి దరఖాస్తు సమర్పించింది. అయితే పబ్లిక్‌ వర్క్స్‌ డిపార్ట్‌మెంట్‌, కాలుష్య నివారణ బోర్డు, నీటి పారుదల, రెవెన్యూ. మున్సిపల్‌ కార్పొరేషన్‌ల నుంచి నిరభ్యంతర పత్రాలు అందకపోవడంతో ఆ దరఖాస్తును తిరస్కరించింది.

Updated Date - Sep 24 , 2025 | 02:49 AM