Aviation Fuel Price Rise: మరింత పెరిగిన విమాన ఇంధనం ధర
ABN , Publish Date - Dec 02 , 2025 | 04:36 AM
అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విమాన ఇంధనం (ఏటీఎఫ్), వాణిజ్య ఎల్పీజీ ధరల్లో మార్పులు చేశాయి....
5.4ు పెంచిన కంపెనీలు.. టికెట్ రేట్లు పెరిగే అవకాశం
న్యూఢిల్లీ, డిసెంబరు 1: అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా దేశీయ ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు విమాన ఇంధనం (ఏటీఎఫ్), వాణిజ్య ఎల్పీజీ ధరల్లో మార్పులు చేశాయి. ఈ మేరకు సోమవారం ఏటీఎఫ్ ధర 5.4 శాతం పెరగ్గా.. వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర స్వల్పంగా తగ్గింది. ఢిల్లీలో కిలో లీటరు ఏటీఎఫ్ ధర రూ.5,133.75 మేర పెరిగి రూ.99,676.77కు చేరింది. ముంబైలో ధర రూ.93,281.04కు చేరుకుంది. చెన్నై, కోల్‌కతాలో కిలో లీటరు ధరలు వరుసగా రూ.1,03,301.80, రూ.1,02,371.02గా ఉన్నాయి. వరుసగా మూడో నెలలోనూ ఏటీఎఫ్ ధర పెరిగింది. ధర పెరగడం వల్ల విమానయాన కంపెనీలపై ఒత్తిడి పెరగడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ కంపెనీల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 40 శాతం వాటా ఈ ఇంధనానిదే. విమాన ఇంధనం ధర పెరిగితే టికెట్ల ధరలు కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు వినియోగించే 19 కిలోల వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధరను కంపెనీలు రూ.10 మేర తగ్గించాయి. దీంతో ఢిల్లీలో ఈ సిలిండర్ ధర రూ.1,580.50కు చేరుకుంది. ఏప్రిల్ నుంచి ఆరుసార్లు వాణిజ్య ఎల్పీజీ ధర తగ్గడంతో మొత్తంగా ఈ సిలిండర్ రూ.223 మేర చవకగా మారింది.