Share News

Recruit Over One Lakh Agniveers: ఆర్మీలోకి లక్ష మంది అగ్నివీర్‌లు

ABN , Publish Date - Nov 27 , 2025 | 04:13 AM

అగ్నివీర్‌లను భారీఎత్తున సైన్యంలోకి తీసుకునేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతోంది. అగ్నిపథ్‌ విధానంలో ఇకపై ఏడాదికి లక్ష మందికి పైగా...

Recruit Over One Lakh Agniveers: ఆర్మీలోకి లక్ష మంది అగ్నివీర్‌లు

  • ఏటా నియమించాలని యోచన

  • జవాన్ల తీవ్ర కొరత దృష్ట్యా నిర్ణయం

  • సైన్యంలో ప్రతి సంవత్సరం 60 వేల మంది పదవీ విరమణ

న్యూఢిల్లీ, నవంబరు 26: అగ్నివీర్‌లను భారీఎత్తున సైన్యంలోకి తీసుకునేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతోంది. అగ్నిపథ్‌ విధానంలో ఇకపై ఏడాదికి లక్ష మందికి పైగా అగ్నివీర్‌లను భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. 2020కి ముందు భర్తీ అయిన జవాన్లు ఏడాదికి దాదాపు 60 వేల మంది చొప్పున ప్రతి సంవత్సరం పదవీవిరమ చేయనున్నారు. కొవిడ్‌ చుట్టుముట్టిన రెండేళ్ల కాలం సైన్యంలోకి భర్తీలు నిలిచిపోయాయి. దానివల్ల రానున్న సంవత్సరాల్లో పదవీవిరమణల కారణంగా తీవ్ర సిబ్బంది కొరతను సైన్యం ఎదుర్కోనుంది. దాదాపు 1.80 లక్షల పోస్టులు ఖాళీ అవుతాయని అంచనా. దానికితోడు నాలుగేళ్ల కోసం భర్తీ చేసుకున్న అగ్నివీర్‌ల పదవీకాలం కూడా వచ్చే ఏడాది చివరికి పూర్తి కానుంది. రక్షణ శాఖ 2022 మధ్యలో అగ్నిపథ్‌ పథకం తెచ్చేనాటికి త్రివిధ దళాల్లో మొత్తం 46 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆర్మీలోనే 40 వేల మంది సిబ్బందికి కొరత ఉంది. అగ్నిపథ్‌ కింద గరిష్ఠంగా మొత్తం 1.75 లక్షల మంది అగ్నివీర్‌లను మిలిటరీలోకి, దాదాపు 28,700 మందిని వాయుసేవ, నేవీలోకి భర్తీ చేసుకోవాలని అప్పట్లో భావించారు. అయితే, రెగ్యులర్‌ ఆర్మీ, అగ్నివీర్‌ల నుంచి రిటైర్‌మెంట్లు పెరగనున్న దరిమిలా ఏటా లక్షకుపైగా పోస్టులు సైన్యంలో ఖాళీ అవుతాయని తాజాగా అంచనా వేస్తున్నారు. దీంతో అదేస్థాయిలో కొత్తగా అగ్నివీర్‌లను భర్తీ చేసుకునేందుకు సైన్యం సిద్ధమవుతోందని ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది.

Updated Date - Nov 27 , 2025 | 04:13 AM