Share News

CM Controversial Comment: ఏడుకొండలు కాదన్న ఏపీ సీఎం ఆనాడే గాలిలో కలిసిపోయారు

ABN , Publish Date - Aug 15 , 2025 | 04:18 AM

తిరుమలలో ఉన్నవి ఏడు కొండలు కావని, ఆరు కొండలేనని కొన్నేళ్ల క్రితం వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒకరు ..

CM  Controversial Comment: ఏడుకొండలు కాదన్న ఏపీ సీఎం ఆనాడే గాలిలో కలిసిపోయారు

  • హిందూ ఆలయాలపై వ్యూహాత్మకంగా కుట్రలు

  • కర్ణ్ణాటక శానససభలో ప్రతిపక్ష నేత అశోక్‌ వ్యాఖ్యలు

  • ధర్మస్థల వివాదంపై వాడీవేడి చర్చ

బెంగళూరు, ఆగస్టు 14(ఆంధ్రజ్యోతి): ‘తిరుమలలో ఉన్నవి ఏడు కొండలు కావని, ఆరు కొండలేనని కొన్నేళ్ల క్రితం వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి ఒకరు గాలిలోనే కలిసిపోయార’ని కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నేత ఆర్‌ అశోక్‌ వ్యాఖ్యానించారు. ధర్మస్థల వివాదంపై శాసన సభలో గురువారం ఆయన మాట్లాడారు. ‘కొన్ని శతాబ్దాల నుంచి ఏడుకొండల వాడా.. ఆపదమొక్కుల వాడా అని హిందువులు మొక్కుతున్నారు. అటువంటి తిరుమలలో ఉన్నవి ఏడు కొండలు కాదని, ఆరే కొండలని వ్యాఖ్యానించిన ఆయన పేరును నేను ప్రస్తావించను. ఆ తర్వాత ఆయన గాలిలోనే కలిసిపోయారు’ అని అన్నారు. దేశవ్యాప్తంగా హిందూ ఆలయాలపై వ్యూహాత్మకంగా కుట్రలు సాగుతున్నాయని అశోక్‌ ఆరోపించారు. ‘గతంలో శబరిమలై అయ్యప్ప ఆలయ దర్శనం చేసుకోవాలని ఓ మహిళ ఎంత వీరంగం చేసిందో తెలిసిందే. ప్రతి మతానికీ కొన్ని సంప్రదాయాలుంటాయి. ఇప్పటికీ మసీదులలోకి మహిళలకు ప్రవేశం లేదు. కొంతకాలం కిందట మహారాష్ట్రలోని శనిశింగనాపుర విషయంలోనూ తప్పుడు ప్రచారం చేశారు. ధర్మస్థలలో శవాలను పూడ్చి పెట్టానని ఓ వ్యక్తి ఫిర్యాదు చేసిన వెంటనే ప్రభుత్వం సిట్‌ ఏర్పాటు చేసింది. అయితే, అతడి పూర్వాపరాలు తెలుసుకున్నారా?’ అని నిలదీశారు. అతడిది చామరాజనగర్‌ జిల్లా అని తెలుస్తోందని, మతం కూడా మారినట్లు సమాచారం ఉందని పేర్కొన్నారు.

Updated Date - Aug 15 , 2025 | 04:18 AM