Share News

Common Fertilizer Turned Dangerous: అమ్మోనియం నైట్రేట్‌!

ABN , Publish Date - Nov 12 , 2025 | 02:19 AM

ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన కారు పేలుడుకు వాడింది అమ్మోనియం నైట్రేట్‌ అని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందు హరియాణాలో ...

Common Fertilizer Turned Dangerous: అమ్మోనియం నైట్రేట్‌!

  • ఢిల్లీలో కారుపేలుడుకు వాడిన రసాయనం

  • మొక్కలకు ఆక్సిజన్‌ అందించేందుకు వాడే ఎరువు

  • పెట్రోలియం పదార్థాలతో కలిస్తే ప్రాణాంతకం

ఎర్రకోట వద్ద సోమవారం జరిగిన కారు పేలుడుకు వాడింది అమ్మోనియం నైట్రేట్‌ అని అధికారులు భావిస్తున్నట్టు సమాచారం. ఈ పేలుడుకు కొన్ని గంటల ముందు హరియాణాలో జమ్ముకశ్మీర్‌ పోలీసులు 350 కిలోల అమ్మోనియం నైట్రేట్‌ సహా 2900 కిలోల బాంబు తయారీ పదార్థాలను పట్టుకోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే ఎర్రకోట వద్ద పేలుడుకూ దాన్నే వాడి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆర్డీఎక్స్‌కి దీనికి తేడా ఏమిటంటే.. ఆర్డీఎక్స్‌ అత్యంత శక్తిమంతమైన మిలటరీ గ్రేడ్‌ పేలుడు పదార్థం. దాని లభ్యత చాలా కష్టం. సైన్యానికి, లైసెన్స్‌ ఉన్న సంస్థలు, ప్రభుత్వం అనుమతించిన పరిశ్రమలకు మాత్రమే లభిస్తుంది. అదే అమ్మోనియం నైట్రేట్‌ అయితే.. అది ఒక సాధారణ కెమికల్‌ సాల్ట్‌. సహజంగా దానంతట అది ఒక పేలుడు పదార్థం కాదు. ఇది ఒక ఆక్సిడైజర్‌. అందుకకే రైతులు మొక్కలకు ప్రాణవాయువుఅందించడానికి దాన్ని ఎరువుగా వాడుతారు. ఆక్సిడైజర్‌ కాబట్టి.. ఇది కాలిపోవడానికి అవసరమైన ఆక్సిజన్‌ను కూడా అందిస్తుంది. ఢిల్లీలో పేలుడుకు దీన్ని అందుకే వాడుకున్నారు. పేలుడు ప్రారంభం కావడానికి ఫ్యూయల్‌ ఆయిల్‌ని (డీజిల్‌/పెట్రోల్‌/కిరోసిన్‌.. ఏదైనా కావొచ్చు) వాడుతారు. ఆ పేలుడు తీవ్రతను పెంచడానికి ఈ అమ్మోనియం నైట్రేట్‌ ఉపయోగపడిందన్నమాట. అయితే.. అమ్మోనియం నైట్రేట్‌ కూడా అంత సులువుగా ఎవరికి పడితే వారికి దొరకదు. దాని తయారీ, నిల్వ, వినియోగం అన్నిటికీ ‘పెట్రోలియం అండ్‌ ఎక్స్‌ప్లోజివ్స్‌ సేఫ్టీ ఆర్గనైజేషన్‌’ నుంచి అనుమతులు కావాలి.

తీవ్రతలో తేడాలు..

ఆర్డీఎక్స్‌కు, దీనికి ఉన్న మరొక ప్రధానమైన తేడా.. పేలుడు తీవ్రత. ఆర్డీఎక్స్‌ డిటొనేషన్‌ వేగం సెకనుకు 8700 మీటర్లు. అంటే.. పేలినప్పుడు షాక్‌ వేవ్‌ చాలా వేగంగా వ్యాపిస్తుంది. దాని రిలెటివ్‌ ఎఫెక్టివ్‌నెస్‌ (ఆర్‌ఈ) ఫ్యాక్టర్‌ దాదాపుగా 1.5 నుంచి 1.6 దాకా ఉంటుంది. అంటే ఒక కిలో ఆర్డీఎక్స్‌ పేలుడు తీవ్రత 1.5 కిలో టీఎన్‌టీ బలానికి సమానం. ఢిల్లీలో కారు పేలుడుకు ఉపయోగించిన ఏఎన్‌ఎ్‌ఫవో (అమ్మోనియం నైట్రేట్‌+ఫ్యూయెల్‌ ఆయిల్‌) ఆర్‌ఈ ఫ్యాక్టర్‌ 0.75 మాత్రమే. ఆర్డీఎక్స్‌తో పోలిస్తే.. దీని పేలుడు తీవ్రత అందులో సగమే. అందుకే పేలుడుకు పెద్ద ఎత్తున వినియోగిస్తారు. ఉదాహరణకు.. 1995లో టిమోతీ మెక్వీ అనే అమెరికన్‌ మాజీ సైనికుడు అమెరికాలోని ఒక్లహోమా నగరంలో ఒక ప్రభుత్వ కార్యాలయం ముందు 2000 కిలోల ఏఎన్‌ఎఫ్‌వో బాంబును పెద్ద ట్రక్కులో పెట్టి పేల్చేశాడు. ఆ పేలుడు ధాటికి 168 మంది మృతి చెందారు. అమెరికా చరిత్రలో అప్పటికి అదే అతిపెద్ద ఉగ్రదాడి. ఐదేళ్ల క్రితం లెబనాన్‌ రాజధాని బీరుట్‌లో పెద్ద పేలుడు జరిగి 218 మంది మరణించారు గుర్తుందా? అప్పుడు అంతమంది చనిపోవడానికి ప్రధాన కారణం అమ్మోనియం నైట్రేటే. అమ్మోనియం నైట్రేట్‌ ఉన్న గిడ్డంగిలో అగ్ని ప్రమాదం తో భారీ పేలుళ్లు సంభవించాయి. - సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Nov 12 , 2025 | 02:19 AM