Amit Shah: నెహ్రూది ముమ్మాటికీ ద్రోహమే..
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:09 AM
వందేమాతర గేయం విషయంలో తొలి ప్రధాని నెహ్రూది ముమ్మాటికీ ద్రోహమేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం వందేమాతర గీతంలో....
బుజ్జగింపు రాజకీయాల కోసమే ‘వందేమాతరం’లో విభజన: అమిత్ షా
న్యూఢిల్లీ, డిసెంబరు 9: వందేమాతర గేయం విషయంలో తొలి ప్రధాని నెహ్రూది ముమ్మాటికీ ద్రోహమేనని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా అన్నారు. బుజ్జగింపు రాజకీయాల కోసం వందేమాతర గీతంలో తెచ్చిన విభజనే దేశ విభజనకు దారితీసిందని ఆయన మండిపడ్డారు. వందేమాతరం గేయానికి 150 ఏళ్లు నిండిన సందర్భంగా మంగళవారం రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం తరఫున అమిత్‌షా చర్చను ప్రారంభించారు. వందేమాతరం చర్చను, పశ్చిమ బెంగాల్ ఎన్నికలతో ముడిపెట్టడం సరికాదన్నారు. బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ మాట్లాడుతూ.. వందేమాతరం గేయాన్ని మజ్లిస్ పార్టీకి కాంగ్రెస్ తాకట్టు పెట్టిందని విమర్శించారు. మజ్లిస్ ఒత్తిడికి తలొగ్గి చాలా ఏళ్లుగా కాంగ్రెస్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. వందేమాతర గేయంలోని మొదటి రెండు చరణాలను మాత్రమే ఆలపించాలనే నిర్ణయం ఒక్క నెహ్రూ మాత్రమే తీసుకున్నది కాదని రాజ్యసభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అన్నారు. ఈ నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో నెహ్రూతోపాటు మహాత్మాగాంధీ, సుభా్‌షచంద్రబోస్, మదన్ మోహన్ మాలవీయా, ఆచార్య జేపీ కృపలానీ కూడా ఉన్నారని, కాంగ్రెస్ నిర్ణయాన్ని రవీంద్రనాథ్ ఠాగూర్ సమర్థించారని గుర్తు చేశారు. కాగా, ముస్లింలు మరణాన్నైనా అంగీకరిస్తారు కానీ.. బహు దేవతారాధనను ఎప్పటికీ అంగీకరించబోరని జమైత్ ఉలేమా-ఐ-హింద్ చీఫ్ మౌలానా అర్షద్ మదానీ అన్నారు. వందేమాతర గీతంపై పార్లమెంటులో జరుగుతున్న చర్చపై మంగళవారం ఆయన ‘ఎక్స్’లో స్పందించారు. వందేమాతరం గేయంలో మాతృభూమిని దుర్గామాత అనే దేవతతో పోల్చారని, ‘అమ్మా నేను నిన్ను పూజిస్తాను..’ అనే అర్థం ఇచ్చేలా గేయం ఉంటుందన్నారు. ఇది ముస్లిం మత విశ్వాసాలకు విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.