Amit Shah: భాష ఈ దేశపు ఆత్మ
ABN , Publish Date - Jun 27 , 2025 | 03:10 AM
భాష కేవలం వ్యక్తీకరణ మాధ్యమంకాదని, అది దేశపు ఆత్మ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. భారతీయ భాషలతో హిందీకి మిత్రత్వం ఉన్నదని, అన్ని భాష లూ మిళితమైతేనే దేశ ఆత్మగౌరవాన్ని నిలపడంలో గొప్ప పాత్ర పోషించగలవన్నారు.
వ్యక్తీకరణ మాధ్యమం మాత్రమే కాదు
హిందీకి ఏ భాషతోనూ శత్రుత్వం లేదు: అమిత్‌షా
స్థానిక భాషల్లో మెడికల్, ఇంజనీరింగ్ కోర్సుల బోధనకు సిద్ధం కండి
రాష్ట్ర ప్రభుత్వాలకు అమిత్‌షా సూచన
న్యూఢిల్లీ, జూన్ 26: భాష కేవలం వ్యక్తీకరణ మాధ్యమంకాదని, అది దేశపు ఆత్మ అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా వ్యాఖ్యానించారు. భారతీయ భాషలతో హిందీకి మిత్రత్వం ఉన్నదని, అన్ని భాష లూ మిళితమైతేనే దేశ ఆత్మగౌరవాన్ని నిలపడంలో గొప్ప పాత్ర పోషించగలవన్నారు. ఢిల్లీలో అధికార భాషా విభాగం ఏర్పడి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహించిన వేడుకల్లో గురువారం అమిత్‌షా పాల్గొన్నారు. భాషల సాయం లేకుండా చరిత్ర, సంస్కృతి ప్రాచుర్యం పొందలేవన్నారు. భారతీయ భాషల ఉన్నతి, అధికార భాష అభివృద్ధికి రానున్నకాలంలో ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టనున్నట్టు అమిత్‌షా తెలిపారు. కేంద్రం, రాష్ట్రాల్లో పాలనా వ్యవహారాలన్నీ భారతీయ భాషల్లోనే సాగుతున్నాయన్నారు. భాషల మధ్య వైషమ్యంలేదని, విదేశీ భాషలు సహా ఏ భాషకూ హిందీ శత్రువుకాదని పేర్కొన్నారు. మన ఆలోచనల్లో, సంభాషణల్లో మన భాషలకు ప్రాధాన్యమివ్వాలన్నారు. స్థానిక భాషల్లో మెడికల్, ఇంజనీరింగ్ కోర్సులను బోధించేలా ఏర్పాట్లు చేసుకోవాలని రాష్ట్రాలను కోరారు. యువతకు భారతీయ భాషలను చేరువ చేసే పనిని రానున్నకాలంలో అధికార భాషా విభాగం చేపడుతుందని షా తెలిపారు.