Prashant Kishore Jansuraj Party: ప్రపంచబ్యాంకు రుణంతో ఓట్ల కొనుగోలు
ABN , Publish Date - Nov 17 , 2025 | 04:10 AM
బిహార్ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్ కుమార్ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్‌కిశోర్‌కు...
1.25 కోట్ల మంది మహిళలకు రూ.14 వేల కోట్లు పంచిపెట్టారు
నితీశ్ ప్రభుత్వ ‘మహిళలకు 10 వేలు’ పథకంపై జన్‌సురాజ్‌పార్టీ ఆరోపణలు
పట్నా, నవంబరు 16: బిహార్ ఎన్నికల వేళ ‘ముఖ్యమంత్రి మహిళా ఉపాధి పథకం’ కింద మహిళలకు రూ.10 వేల చొప్పున నితీశ్ కుమార్ ప్రభుత్వం జరిపిన పంపకాలపై ప్రశాంత్‌కిశోర్‌కు చెందిన జన్‌సురాజ్‌పార్టీ తీవ్ర ఆరోపణలు చేసింది. ప్రపంచబ్యాంకు నుంచి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న రుణం నుంచి ఈ మొత్తాన్ని పంచారని, ఇది రూ.14,000 కోట్లకు సమానమని పేర్కొంది. పార్టీ జాతీయాధ్యక్షుడు ఉదయ్‌సింగ్ విలేకర్ల సమావేశంలో ఈ వివరాలు వెల్లడించారు. ‘అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని డబ్బులిచ్చి కొనుగోలు చేశారు. జూన్ 21వ తేదీ నుంచి పోలింగ్ ప్రారంభమయ్యే తేదీ వరకూ దాదాపు రూ.14 వేల కోట్లు పంచిపెట్టారు. ప్రభుత్వధనం ఖర్చు చేసి ఓట్లు కొన్నారు. ప్రపంచబ్యాంకు నుంచి ఈ డబ్బులు తీసుకున్నట్లు సమాచారం ఉంది’ అని తెలిపారు. దీనిపై పూర్తి దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. జన్‌సురాజ్‌పార్టీ అధికారప్రతినిధి పవన్‌వర్మ కూడా ఈ అంశంపై మాట్లాడుతూ.. వేరే ప్రాజెక్టు కోసం ప్రపంచబ్యాంకు నుంచి తీసుకున్న రూ.21 వేల కోట్ల నుంచి ఒక కోటీ 25 లక్షల మంది మహిళలకు రూ.10 వేల చొప్పున పంచారని వెల్లడించారు. ఎన్నికల కోడ్ అమలులోకి రావటానికి కేవలం గంట ముందు ఈ తాయిలాల పంపిణీ మొదలైందని ఆరోపించారు. మొత్తంగా రూ.14 వేల కోట్లు పంచిపెట్టారని, ఖజానా ఖాళీ అయిపోయినట్లు తెలిసిందన్నారు.