Ajit Doval: అజిత్ దోవల్ వ్యాఖ్యలపై వివాదం!
ABN , Publish Date - Nov 22 , 2025 | 04:29 AM
ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2014లో (అప్పటికింకా ఆయన ఆ పదవి చేపట్టలేదు) ఓ సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి....
ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో 11 ఏళ్ల నాటి వీడియో క్లిప్ వెలుగులోకి
‘ఐఎ్‌సఐ నియామకాల్లో 80 శాతం హిందువులే’ననే వ్యాఖ్యలు వైరల్
న్యూఢిల్లీ, నవంబరు 20: ప్రస్తుత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ 2014లో (అప్పటికింకా ఆయన ఆ పదవి చేపట్టలేదు) ఓ సమావేశంలో చేశారని చెబుతున్న వ్యాఖ్యలు తాజాగా వివాదాస్పదమయ్యాయి. 2014 మార్చి 11న ‘ఆస్ట్రేలియా ఇండియా ఇన్‌స్టిట్యూట్’ అనే సంస్థ ‘ప్రపంచానికి ఎదురవుతున్న సవాళ్లు’ అనే అంశంపై నిర్వహించిన ఓ సదస్సులో అజిత్ దోవల్ ప్రసంగించారు. గంటా 17 నిమిషాలపాటు ఉన్న ఆ ఉపన్యాసాన్ని అదే సంస్థ యూట్యూబ్‌లో అప్పట్లోనే అప్‌లోడ్ చేసింది. ఉగ్రవాదానికి మతంతో సంబంధం లేదని, హిందువులు వర్సెస్ ముస్లింలు అన్న కోణంలో కాకుండా.. దేశ సమస్యగా ఉగ్రవాదాన్ని చూడాలంటూ దోవల్ ఆ ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో ‘భారత్‌లో నిఘా కార్యకలాపాల కోసం పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎ్‌సఐ నియమించుకుంటున్న భారతీయుల్లో ముస్లింలకంటే హిందువులే అత్యధిక సంఖ్యలో ఉన్నారు. 1947 నుంచి ఉన్న 4 వేలకుపైగా కేసులను పరిశీలిస్తే వాటిల్లో 20 శాతం కేసులు కూడా ముస్లింలకు సంబంధించినవి లేవు’ అని చెప్పినట్లుగా ఉంది. తాజాగా, ఈ వ్యాఖ్యలతో కూడిన వీడియో క్లిప్ వైరల్ అయ్యింది. ఇటీవలి ఢిల్లీ కారు పేలుడు ఉగ్ర ఘటన నేపథ్యంలో.. ముస్లింలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విద్వేషపూరిత ప్రచారం కొనసాగింది. దీనికి వ్యతిరేకంగా.. 11ఏళ్ల నాటి అజిత్ దోవల్ మాటలతో కూడిన వీడియో క్లిప్ ముందుకొచ్చింది. ఇది వైరల్ అవుతున్న నేపథ్యంలో.. అజిత్ దోవల్ స్పందిస్తూ.. తాను అలా మాట్లాడలేదని, అది డీప్‌ఫేక్ వీడియో అని పేర్కొన్నారు.
అది నకిలీ వీడియో కాదు!
సదరు క్లిప్ ఉన్న వీడియోను మొత్తంగా పరిశీలించిన ఫ్యాక్ట్‌చెక్ వెబ్‌సైట్ ఆల్ట్‌న్యూస్ మాత్రం.. అది ఫేక్ వీడియో కాదని తమ పరీక్షలో తేలిందని వెల్లడించింది. ఇదే వీడియోలో దోవల్ మాట్లాడిన ఇతర అంశాలను ఆల్ట్‌న్యూస్ ప్రస్తావించింది. ఇస్లామిక్ ఉగ్రవాదం వల్ల నష్టపోతున్న వారిలో 90ు మంది ముస్లింలేనని, 10ు మంది మాత్రమే ఇతరులని.. ఈ విషయం సదరు ఉగ్రవాదులకు కూడా తెలుసని దోవల్ పేర్కొన్నారు. భారతీయ ముస్లింలు ఉగ్రవాదాన్ని ఎల్లప్పుడూ వ్యతిరేకిస్తూనే ఉన్నారని చెబుతూ.. 2012లో ఢిల్లీలోని రాంలీలా మైదాన్‌లో 50వేల మంది మౌలానాలు సమావేశమై ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఫత్వా జారీ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇటువంటి పని ఏ హిందూ సంస్థ కూడా చేయలేదని దోవల్ వ్యాఖ్యానించినట్లు ఆల్ట్ న్యూస్ పేర్కొంది.