Share News

Air India: ఎయిర్ ఇండియా సీఈవో కీలక ప్రకటన

ABN , Publish Date - Aug 06 , 2025 | 07:45 PM

ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసుల కార్యకలాపాలను దశల వారీగా పునరుద్ధరించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. అలాంటి వేళ.. ఎయిర్ ఇండియా సీఈవో కీలక ప్రకటన చేశారు.

Air India: ఎయిర్ ఇండియా సీఈవో కీలక ప్రకటన
Air India CEO Campbell Wilson

న్యూఢిల్లీ, ఆగస్ట్ 06: ఎయిర్ ఇండియా తన అంతర్జాతీయ విమాన సర్వీసుల కార్యకలాపాలను దశల వారీగా పునరుద్ధరించేందుకు సన్నాహాకాలు చేస్తోంది. అందులో భాగంగా అక్టోబర్ 1వ తేదీ నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులను మళ్లీ పూర్తి స్థాయిలో ప్రారంభిస్తామని ఆ సంస్థ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు బుధవారం ఎయిర్ ఇండియా సీఈవో కాంప్‌బెల్ విల్సన్ పేరుతో ఒక ప్రకటనను ఆ సంస్థ విడుదల చేసింది. పూర్తిగా తనిఖీలు నిర్వహించి.. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి విశ్వాసంతో విమాన సర్వీసులను నడుపుతామని ఆయన స్పష్టం చేశారు.


అయితే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటన నాటి నుంచి ఎయిర్ ఇండియా సంస్థ కొంత ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న మాట వాస్తమని పేర్కొన్నారు. ఆ క్రమంలో ఆగస్ట్ 05వ తేదీన కోల్‌కతా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమాన సర్వీస్ రెండు గంటల ఆలస్యంగా బెంగళూరులో దింపడం జరిగిందన్నారు. అలాగే సింగపూర్, చెన్నై సర్వీస్‌ను సైతం రద్దు చేయాల్సి పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. భవిష్యత్తులో తమ సంస్థ నడిపే విమాన సర్వీసులన్నీ సజావుగా సాగేలా చర్యలు చేపడతామన్నారు.


ఈ ఏడాది జూన్ 12వ తేదీన అహ్మదాబాద్ నుంచి లండన్‌కు ఎయిర్ ఇండియా విమానం బయలుదేరింది. కొన్ని సెకన్లకే ఆ విమానం కుప్పకూలి దగ్ధమైంది. ఈ ఘటనలో ఒక్కరు మినహా విమాన సిబ్బందితోపాటు ప్రయాణికులంతా మరణించారు. అదీకాక ఈ విమానం మెడికల్ కాలేజీ హాస్టల్‌పై కూలడంతో.. మెస్‌లో భోజనం చేస్తున్న వైద్య విద్యార్థులు సైతం పలువురు మరణించారు. ఈ ఘటనలో మొత్తం 274 మంది మరణించారు. ఈ ప్రమాదం చోటు చేసుకున్న నాటి నుంచి ఎయిర్ ఇండియా విమానాల్లో తనిఖీలను ముమ్మరం చేసింది. అ క్రమంలో పలు అంతర్జాతీయ విమాన సర్వీసులను పాక్షికంగా రద్దు చేసింది.


మరోవైపు.. అహ్మదాబాద్ ప్రమాద ఘటనలో ఆ విమానంలో సీనియర్ పైలెట్‌ సుమీత్ సబర్వాల్.. ఇంధన సరఫరా స్విచ్ ఆఫ్ చేయడం వల్లే ఈ దుర్ఘటన చోటు చేసుకుందంటూ అమెరికన్ పత్రిక వాల్ స్ట్రీట్ జనరల్ ఒక కథనాన్ని ప్రచురించింది. దీనిని భారత్ ఖండించింది. అయితే ఈ ప్రమాద ఘటనపై నివేదిక రావాల్సిన ఉంది.

Updated Date - Aug 06 , 2025 | 07:45 PM