Flight Delays: గగనయానం గందరగోళం
ABN , Publish Date - Nov 30 , 2025 | 05:05 AM
ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో తీవ్ర అలజడి సృష్టించాయి.
ఎయిర్‌బస్ ఏ320 విమానాల్లో సాఫ్ట్‌వేర్ సమస్యలు.. నిలిచిపోయిన 6 వేల విమానాలు
భారత్‌లోనూ 250 వరకూ నిలిపివేత
సౌర రేడియోధార్మికతతోనే సమస్యలు
న్యూఢిల్లీ, నవంబరు 29: ఎయిర్‌బస్ ఏ320 రకం విమానాల్లో ఏర్పడిన సాంకేతిక సమస్యలు ప్రపంచవ్యాప్తంగా పౌర విమానయాన రంగంలో తీవ్ర అలజడి సృష్టించాయి. ఏ318, ఏ319, ఏ320, ఏ321 రకం విమానాల్లో సౌర రేడియో ధార్మికత వల్ల సమస్యలు వచ్చాయని, వెంటనే వాటిలో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని విమానయాన కంపెనీలు, పౌర విమానయాన నియంత్రణ సంస్థలకు ఆ విమానాల తయారీ సంస్థ ఎయిర్‌బస్ శుక్రవారం అత్యవసర అడ్వయిజరీ జారీచేసింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి 6,000 విమానాలు నిలిచిపోయాయి. అడ్వయిజరీ జారీచేసిన సమయంలో ఈ రకానికి చెందిన దాదాపు 3,600 విమానాలు గాల్లో ఎగురుతున్నాయి. అవి గమ్యస్థానాలకు చేరిన వెంటనే, వాటి తర్వాతి ప్రయాణాలను రద్దుచేసి సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ కోసం తరలించారు. భారత్‌లోనూ 200 నుంచి 250 విమానాలు నిలిచిపోయాయి. దీంతో చాలాకంపెనీలు ప్రయాణాలను వాయిదా వేయటమో రీషెడ్యూల్ చేయటమో, రద్దు చేయటమో చేశాయి. అయితే, తమ విమానాల షెడ్యూళ్లలో ఏ మార్పూ లేదని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎయిర్‌బస్ కంపెనీ 55 ఏళ్ల చరిత్రలో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ అప్‌డేషన్ ప్రభావం ఇదేనని ఏవియేషన్ వర్గాలు తెలిపాయి. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ తర్వాత కూడా ఈ విమానాలను పూర్తిగా చెక్ చేసిన తర్వాతే వినియోగంలోకి తేవాలని డీజీసీఏ ఆదేశాలు జారీచేసింది.
అసలేం జరిగింది?
గత నెల 30వ తేదీన మెక్సికోలోని కాన్‌కన్ నుంచి అమెరికాలోని న్యూజెర్సీలో ఉన్న నెవార్క్‌కు వెళ్తున్న జెట్‌బ్లూ సంస్థకు చెందిన ఏ320 విమానం గాల్లో ఉన్నట్లుండి తన మార్గం నుంచి కిందికి పడిపోయింది. పైలట్ ప్రమేయం లేకుండానే ఎలివేటర్ అండ్ ఎయిలెరాన్ కంప్యూటర్ (ఈఎల్‌ఏసీ) యూనిట్ విమాన ఎలివేటర్లకు ఆదేశాలు ఇవ్వటం మొదలుపెట్టింది. అయితే, పైలట్లు విమానాన్ని నియంత్రించి యథాస్థానానికి తెచ్చారు. ఈ ఘటనతో విమానంలోని ప్రయాణికులతోపాటు సిబ్బందికి కూడా గాయాలయ్యాయి. విమానాన్ని వెంటనే ఫ్లోరిడాలోని తంపా విమానాశ్రయంలో దించివేశారు. విమానంలో జరగడానికి అంతరిక్షంలోకి భారీగా వెలువడుతున్న సౌర రేడియో ధార్మికతేనని ఎయిర్‌బస్ సంస్థ శుక్రవారం ప్రకటించింది. విమానాల్లో సాఫ్ట్‌వేర్‌ను అత్యవసరంగా అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.