AI powered fighter jet: రాకెట్‌లాంటి యుద్ధ విమానం.. ఎక్స్-బ్యాట్
ABN , Publish Date - Nov 10 , 2025 | 02:48 AM
వైమానికరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! చోదకుడు లేకుండా.. రన్‌వే అవసరమే లేకుండా.. ఏఐ సాయంతో నిట్టనిలువునా రాకెట్‌లాగా గాల్లోకి లేచి లక్ష్యం దిశగా....
నిట్టనిలువునా టేకాఫ్ అయ్యే సత్తా.. ల్యాండింగ్ కూడా అలాగే!
జీపీఎస్ లేని చోట్లా.. ‘హైవ్‌మైండ్ ఏఐ’ సాయంతో ప్రయాణం
అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం షీల్డ్ ఏఐ అద్భుత ఆవిష్కరణ
న్యూయార్క్, నవంబరు 9: వైమానికరంగ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది! చోదకుడు లేకుండా.. రన్‌వే అవసరమే లేకుండా.. ఏఐ సాయంతో నిట్టనిలువునా రాకెట్‌లాగా గాల్లోకి లేచి లక్ష్యం దిశగా దూసుకుపోయే ఫైటర్‌జెట్‌ను అమెరికన్ డిఫెన్స్ టెక్నాలజీ దిగ్గజం షీల్డ్ ఏఐ అభివృద్ధి చేసింది. టేకాఫే కాదు.. ఈ విమానం ల్యాండింగ్ కూడా నిలువుగానే అవుతుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఫుల్లీ అటానమస్ వర్టికల్ టేకాఫ్ అండ్ ల్యాండింగ్ (వీటీవోఎల్) యుద్ధవిమానం ఇది. షీల్డ్ ఏఐ సంస్థ ఈ విమానానికి ‘ఎక్స్-బ్యాట్’ అని పేరు పెట్టింది. ఈ విమానం తయారీలో ఆ సంస్థ తాను సొంతంగా అభివృద్ధి చేసుకున్న ‘హైవ్‌మైండ్’ అనే కృత్రిమ మేధ వ్యవస్థను ఉపయోగించింది. దీనివల్ల.. జీపీఎస్, ఇతర సమాచార వ్యవస్థలేవీ పనిచేయని చోట కూడా ఎక్స్-బ్యాట్లు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకుని పనిచేయగలుగుతాయి. 2028 నాటికి ఇది అందుబాటులోకి వస్తుందని అంచనా. ఈ విమానం భారత వాయుసేనకు అందుబాటులోకి వస్తే.. పొడుగాటి రన్‌వేలు ఉండని లద్దాఖ్, అరుణాచల్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో మిషన్లు చేపట్టడానికి ఎంతగానో ఉపకరిస్తాయని రక్షణ రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. షీల్డ్ ఏఐ భారతదేశ విభాగానికి ఎండీగా వ్యవహరిస్తున్న సర్జన్ షా కూడా ఈ మేరకు సంకేతాలిచ్చారు. ఈ విమానాలు భారత వాయుసేన అమ్ములపొదిలో చేరే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.