Dr.Gopi Krishna: యువత ఆకస్మిక మరణాలు..కొవిడ్ టీకాల వల్ల కాదు
ABN , Publish Date - Dec 15 , 2025 | 04:11 AM
వయసు నలభై ఐదేళ్లలోపే ఉంటుంది. చూడటానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూస్తున్నారు.....
45 ఏళ్ల లోపువారిలో 42ు మంది ఆకస్మిక మరణాలకు గుండె జబ్బులే ప్రధాన కారణం
తర్వాతి స్థానంలో ఊపిరితిత్తుల సమస్యలు
మహిళల కంటే పురుషుల్లో 5 రెట్లు ఎక్కువ
‘ఎయిమ్స్’ వైద్యుల అధ్యయనంలో వెల్లడి
హైదరాబాద్, డిసెంబరు 14 (ఆంధ్రజ్యోతి): వయసు నలభై ఐదేళ్లలోపే ఉంటుంది. చూడటానికి చక్కగా ఆరోగ్యంగా కనిపిస్తారు. కానీ ఉన్నట్టుండి కుప్పకూలుతున్నారు. ఆస్పత్రికి తరలించేలోగానే కన్నుమూస్తున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు ఎక్కువగా చూస్తున్నాం. ముఖ్యంగా.. మద్యపానం, పొగతాగడంలాంటి దురలవాట్లు, ఊబకాయం, తీవ్రమైన ఒత్తిడి, ఆందోళనవంటి సమస్యలేవీ లేకున్నా హఠాన్మరణానికి గురవుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కరోనా వ్యాక్సిన్లు తీసుకోవడమే వారి మరణాలకు కారణమన్న అనుమానాలు చాలా మందిలో వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో.. ఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) వైద్యనిపుణులు ఏడాదిపాటు అధ్యయనం నిర్వహించి.. కొవిడ్ టీకాల వల్లే యువతలో ఆకస్మిక మరణాల సంఖ్య పెరిగిందనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని స్పష్టం చేశారు. ‘బర్డెన్ ఆఫ్ సడెన్ డెత్ ఇన్ యంగ్ అడల్ట్స్: ఏ వన్ ఇయర్ అబ్జర్వేషనల్ స్టడీ ఎట్ ఏ టెర్షియరీ కేర్ సెంటర్ ఇన్ ఇండియా’ పేరిట వారు నిర్వహించిన ఈ అధ్యయన ఫలితాలు ‘ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్ (ఐజేఎంఆర్)’లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనంలో భాగంగా ఎయిమ్స్ ఫోరెన్సిక్ మెడిసిన్, పాథాలజీ నిపుణులు.. 2023 మే నుంచి 2024 ఏప్రిల్ మధ్య 2214 మృతదేహాలను పరీక్షించారు. వాటిలో 180.. ఆకస్మికంగా మరణించినవారి మృతదేహాలు. ఆ 180 మందిలోనూ 18-45 మధ్య వయసువారు 103 మంది ఉన్నారు. వారిలో 42.6 శాతం మంది మరణాలకు కారణం గుండె సంబంధిత సమస్యలే కారణమని అధ్యయనంలో వెల్లడైంది. ఆ తర్వాత అత్యధికంగా 21.3శాతం మరణాలు ఊపిరితిత్తుల (శ్వాసకోశ) సమస్యల వల్ల సంభవించినట్టు తేలింది. ఇలా హఠాన్మరణం పాలైన వారి సగటు వయస్సు కేవలం 33.6 ఏళ్లే. అలాగే ఈ హఠాన్మరణాల సంఖ్య.. స్త్రీలతో పోలిస్తే పురుషుల్లో ఐదురెట్లు ఎక్కువగా ఉందని అధ్యయనంలో వెల్లడైంది. అంతేకాదు వారం మధ్యలో (బుధ-గురువారాల్లో) కన్నా, వారాంతాల్లోనే (శుక్ర-శని-ఆదివారాల్లో) హఠాన్మరణాలు ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు. గుండె జబ్బుతో హఠాత్తుగా చనిపోయినవారిలో చాలా మందికి అథెరోస్క్లెరోటిక్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ (ధమనుల్లో కొవ్వు పేరుకుపోవడం) ఉన్నట్లు మరణానంతరం నిర్వహించిన పరీక్షల్లో తేలిం ది. అలా చనిపోయినవారిలో చాలామందికి అసలు గుండె జబ్బు ఉన్న లక్షణాలులేవని, తమకు ఆ సమస్య ఉన్న విషయమే వారికి తెలియదని వైద్యనిపుణులు పేర్కొన్నారు. కరోనరీ ఆర్టరీ జబ్బులు 40ఏళ్ల లోపువారిలో అరుదుగా వస్తాయని కానీ, వస్తే చాలా వేగంగా ప్రాణాంతకమవుతాయని ఎయిమ్స్ కార్డియాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ధూమపానం మానేయడం, మద్యపానానికి దూరంగా ఉండటం, ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడంతోపాటు నాలుగు పదుల వయసులో ఉన్నవారు గుండెకు సం బంధించిన ముందస్తుపరీక్షలు చేయించుకోవడం మంచిదని సూచించారు.
యువతను కోల్పోవడం దేశానికి నష్టం
యువతలో వచ్చే హృద్రోగాలను చాలా మంది ఆరోగ్యపరమైన అంశంగానే చూస్తారు. కానీ అది సరికాదు. ఉత్పాదక వయసులో.. అంటే 22-50 ఏళ్ల మధ్య ఉండేవారు అకస్మాత్తుగా గుండెజబ్బుతో చనిపోవడం వారి కుటుంబంపైనే కాక ఆర్థిక వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం చూపుతుంది. వారిని ఇలా పెద్ద సంఖ్యలో కోల్పోతే ప్రభుత్వాలపై తీవ్ర భారం పడుతుం ది. ఇతర దేశాల్లో ఈ విషయాన్ని చాలా తీవ్రంగా పరిగణిస్తారు. మనకు దాని తీవ్రత అర్థం కావట్లేదు. ఇప్పటికే మనదేశంలో ఫర్టిలిటీ రేటు తగ్గుతోంది. దానికితోడు ఈ వయసువారిని కోల్పోతే మరింత నష్టం జరుగుతుంది. వీటిపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి. ప్రాసెస్డ్ ఆహారపదార్థాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి. గుండె జబ్బులపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
- డాక్టర్ రాయిడి గోపీకృష్ణ, సీనియర్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్టు, యశోద ఆస్పత్రి, హైటెక్ సిటీ, హైదరాబాద్