Ranya Rao: 15 చెంపదెబ్బలు కొట్టారు
ABN , Publish Date - Mar 16 , 2025 | 03:44 AM
బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన ఆమె ఈనెల 5వ తేదీన చేతితో రాసిన ఐదు పేజీల లేఖను ఆ తర్వాతి రోజు జైలు అధికారుల ద్వారా డీఆర్‌ఐ అదనపు డీజీకి పంపారు. హర్షవర్ధిని రన్య(33)గా ఆ లేఖలో తనను తాను ఆమె పరిచయం చేసుకున్నారు. తన భర్త జతిన్ హుక్కేరి అని తెలిపారు.

డీఆర్‌ఐ కస్టడీలో ఆహారం కూడా ఇవ్వలేదు
40 తెల్లకాగితాలపై సంతకాలు చేయించారు
సినీ నటి రన్యారావు ఆరోపణ
బెంగళూరు, మార్చి 15: తాను అమాయకురాలినని, తనను తప్పుడు కేసులో ఇరికించారంటూ సినీనటి రన్యారావు డీఆర్‌ఐ(డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటలిజన్స్) అధికారులకు లేఖ రాశారు. బంగారం స్మగ్లింగ్ కేసులో అరెస్టయిన ఆమె ఈనెల 5వ తేదీన చేతితో రాసిన ఐదు పేజీల లేఖను ఆ తర్వాతి రోజు జైలు అధికారుల ద్వారా డీఆర్‌ఐ అదనపు డీజీకి పంపారు. హర్షవర్ధిని రన్య(33)గా ఆ లేఖలో తనను తాను ఆమె పరిచయం చేసుకున్నారు. తన భర్త జతిన్ హుక్కేరి అని తెలిపారు. ‘విమానంలో నన్ను అదుపులోకి తీసుకున్నారు. వివరణ ఇచ్చే అవకాశం కూడా నాకు కల్పించకుండానే అరెస్టు చేశారు. అదుపులోకి తీసుకునే, కోర్టులో ప్రవేశపెట్టే సమయాల్లో కనీసం 10 నుంచి 15 సార్లు అధికారులు నన్ను చెంపదెబ్బలు కొట్టారు. వారిని నేను గుర్తుపట్టగలను. నా తండ్రి పాత్ర ఏమీ లేకపోయినా.. అధికారులు తయారు చేసిన పత్రాలపై నేను సంతకం చేయకుంటే గనుక నా తండ్రి పేరు, ఆయన ఎవరనేది బహిర్గతం చేస్తామని ఒక అధికారి నన్ను బెదిరించారు. తీవ్ర ఒత్తిడి, భౌతిక దాడి నేపథ్యంలో టైప్ చేసిన 50-60 పేజీలతోపాటు సుమారు 40 తెల్ల కాగితాలపైనా సంతకాలు చేశాను.
డీఆర్‌ఐ కస్టడీలో నన్ను సరిగా నిద్ర పోనీయలేదు. ఆహారం కూడా ఇవ్వలేదు. అధికారులు ప్రకటించినట్టు మహజర్ తీసుకోలేదు. నన్ను సోదా చేయనూ లేదు. ఏమీ స్వాధీనమూ చేసుకోలేదు. కొందరు ఢిల్లీ అధికారులు ఇతర ప్రయాణికులను కాపాడేందుకు నన్ను ఇరికించాలనుకొంటున్నారు. నన్ను అదుపులోకి తీసుకున్నప్పటి నుంచి కోర్టులో ప్రవేశపట్టే వరకు రికార్డు చేసిన ఏ వాంగ్మూలంపైనా ఆధారపడొద్దని అభ్యర్థిస్తున్నాను’ అని ఆ లేఖలో రన్యారావు పేర్కొన్నారు. లేఖపై తన సంతకం వద్ద రిమాండ్ ఖైదీ నంబరు 2198/25ను కూడా రన్యారావు రాశారు.