Yusuf Pathan Replaced: యూసుఫ్ పఠాన్ స్థానంలో అభిషేక్ బెనర్జీ
ABN , Publish Date - May 21 , 2025 | 07:49 AM
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ అభిషేక్ బెనర్జీని అఖిలపక్ష బృందంలోకి ఎంపిక చేసింది, యూసుఫ్ పఠాన్‌కు సమాచారం లేకుండా ఎంపిక చేయడాన్ని పార్టీ తప్పుబట్టింది. పాక్‌పై దౌత్య యుద్ధం కోసం ఏర్పాటైన బృందాలకు వెళ్లే ముందు, విదేశాంగ శాఖ మంత్రి విక్రం మిస్రీ సూచనలు ఇచ్చారు.
న్యూఢిల్లీ, మే 20: భారత్‌పై విషం చిమ్ముతున్న పాకిస్థాన్ వైఖరిని ఎండగట్టేందుకు వివిధ దేశాలకు పంపేందుకు ఎంపిక చేసిన అఖిలపక్ష బృందాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తమ ప్రతినిధిగా అభిషేక్ బెనర్జీని ఎంపిక చేసినట్లు మంగళవారం ప్రకటించింది. అంతకుముందు కేంద్రప్రభుత్వం తృణమూల్ ఎంపీ, మాజీ క్రికెటర్ యూసఫ్ పఠాన్‌ను ఎంపిక చేసింది. అయితే, తనకు సమాచారం ఇవ్వకుండానే కేంద్రప్రభుత్వం తమ ఎంపీ యూసఫ్‌ను అఖిలపక్ష బృందం కోసం ఎంపిక చేసిందని టీఎంసీ అధ్యక్షురాలు మమత ఆరోపించారు. ఈ నేపథ్యంలో అఖిలపక్ష బృందం నుంచి తప్పుకుంటున్నట్లు యూసుఫ్ పఠాన్ సోమవారం ప్రకటించారు. తర్వాత అభిషేక్ బెనర్జీని ఎంపిక చేసినట్లు తృణమూల్ కాంగ్రెస్ మంగళవారం ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. సోమవారం అభిషేక్ బెనర్జీ ఈ విషయమై స్పందిస్తూ.. ‘ఉగ్రవాదంపై పోరు విషయంలో కేంద్రంతో భుజం భుజం కలిపి పోరాడుతుంది. కానీ, పాక్‌పై దౌత్య యుద్ధానికి మా పార్టీలో ఎవరిని ఎంపిక చేయాలో ఏకపక్షంగా కేంద్రం నిర్ణయించజాలదు’ అని తెలిపారు. ఇక విదేశాలకు పంపే అఖిలపక్ష బృందాలకు కేంద్రం.. కాంగ్రెస్ పార్టీ సూచించిన నేతల పేర్లు పక్కన బెట్టి, ఆ పార్టీ ఎంపీ శశి థరూర్‌ను ఎంపిక చేయడంపై ఆ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయినా సమస్య ప్రాధాన్యం దృష్ట్యా తమ నాయకులు అఖిలపక్ష బృందాలతో వెళ్లేందుకు కాంగ్రెస్ పార్టీ అనుమతించింది.
అఖిలపక్ష బృందాలతో విక్రం మిస్రీ భేటి..
విదేశాలకు వెళ్లి అక్కడి నేతలకు పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను వివరించడానికి ఉద్దేశించిన అఖిలపక్ష బృందాలతో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి విక్రం మిస్రీ మంగళవారం భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని పాకిస్థాన్ ఏ విధంగా ప్రోత్సహిస్తోందీ, భారత్ వాటిని ఏ రూపంలో తిప్పికొడుతోందన్న విషయాలను ఏ పద్ధతిలో చెప్పాలనేదానిని వారికి వివరించారు. ఈ బృందాలు బుధవారం పర్యటనలకు బయలుదేరనున్న నేపథ్యంలో పలు సూచనలు ఇచ్చారు.