CBI Investigation: సొంత ఖాతాలకు విమానాశ్రయాల నిధులు
ABN , Publish Date - Sep 20 , 2025 | 03:59 AM
సంస్థ నిధులను సొంతానికి వాడుకున్న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఏఏఐ సీనియర్ మేనేజర్ ఫైనాన్స్ రాహుల్ విజయ్...
250 కోట్లు మళ్లించుకున్న ఏఏఐ సీనియర్ మేనేజర్
న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: సంస్థ నిధులను సొంతానికి వాడుకున్న ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) సీనియర్ మేనేజర్ (ఫైనాన్స్) రాహుల్ విజయ్ అక్రమాల్లో మరికొన్నింటిని సీబీఐ వెలుగులోకి తెచ్చింది. మొత్తం రూ.250 కోట్ల మేర కుంభకోణానికి పాల్పడినట్టు గుర్తించింది. డెహ్రాడూన్ విమానాశ్రయంలో రూ.232 కోట్ల నిధులను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై రెండు వారాల క్రితం ఆయనను అరెస్టు చేసింది. అంతకుముందు జైపూర్‌లో 2024-25 మధ్య పనిచేసినప్పుడు మరో రూ.18.12 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డారని సీబీఐ తాజాగా తెలిపింది. ఈ మేరకు బుధవారం కోర్టులో అఫిడవిట్‌ను సమర్పించింది. తన హోదాను దుర్వినియోగం చేసి స్టేటుబ్యాంకులో ఉన్న ఏఏఐ ఖాతాల నుంచి యాక్సిస్ బ్యాంకు, స్టేట్ బ్యాంకుల్లోని తన సొంత ఖాతాలకు మళ్లించుకున్నట్టు గుర్తించింది. వివిధ రకాల ఖర్చులు చూపించి, ఏఏఐ ఉద్యోగుల పేరున తన సొంత ఖాతాలకు నిధులు బదిలీ చేయించుకున్నారు. ఏఏఐ ఖాతాలన్నీ తన ఆధీనంలోనే ఉండడంతో అక్రమాలు చేయగలిగినట్టు ఆరోపించింది.