Share News

తత్కాల్‌కు కొత్త నిబంధనలు

ABN , Publish Date - Jun 12 , 2025 | 04:59 AM

తత్కాల్‌ బుకింగ్‌లో అవకతవకలను నిరోధించడానికి, అంతిమ వినియోగదారుడు మాత్రమే లబ్ధి పొందేలా రైల్వే శాఖ నిబంధనలు మార్చింది. ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే తత్కాల్‌ బుకింగ్‌ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ వెబ్‌లో, యాప్‌లో మార్పులు చేయాలని, జూలై 1 నుంచి అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది.

తత్కాల్‌కు కొత్త నిబంధనలు

  • ఇకపై ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లకు మాత్రమే టికెట్లు.. జూలై 1 నుంచి అమలు

  • అవకతవకలను నివారించడమే లక్ష్యంగా..

న్యూఢిల్లీ, జూన్‌ 11: తత్కాల్‌ బుకింగ్‌లో అవకతవకలను నిరోధించడానికి, అంతిమ వినియోగదారుడు మాత్రమే లబ్ధి పొందేలా రైల్వే శాఖ నిబంధనలు మార్చింది. ఆధార్‌ వెరిఫైడ్‌ యూజర్లు మాత్రమే తత్కాల్‌ బుకింగ్‌ చేసుకునేలా ఐఆర్‌సీటీసీ వెబ్‌లో, యాప్‌లో మార్పులు చేయాలని, జూలై 1 నుంచి అమలు చేయాలని రైల్వే నిర్ణయించింది. ఈమేరకు జూన్‌ 10న అన్ని జోన్‌లకు సర్క్యులర్‌ జారీ చేసింది. అలాగే జూలై 15 నుంచి అదనంగా తత్కాల్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్న ప్రయాణికుడు ఆధార్‌ ఆధారిత ఓటీపీని కూడా నిర్ధారించాల్సి ఉంటుంది.


అలాగే రైల్వే రిజర్వేషన్‌ ఏజెంట్లు తత్కాల్‌ మొదటి రోజు మొదటి అరగంట టికెట్లు బుక్‌ చేయకుండా వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. ఏసీ టికెట్‌ అయితే 10.30 తరువాత, సాధారణ తరగతిలో అయితే 11.30 తరువాత మాత్రమే ఏజెంట్లకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. కాగా ఇప్పటి వరకూ వెయిటింగ్‌ లిస్ట్‌ ప్రయాణికులకు రైలు బయలుదేరడానికి కేవలం నాలుగు గంటల ముందు మాత్రమే తమ టికెట్‌ స్టేటస్‌ తెలుస్తుంది. దీనివలన ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో 24 గంటల ముందే వెయిటింగ్‌ లిస్ట్‌ టికెట్‌ స్టేటస్‌ వెల్లడించేందుకు రైల్వే సిద్ధమవుతోంది. ఈ మేరకు బికనీర్‌ డివిజన్‌లో దీనిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు రైల్వే బోర్డు సమాచార, ప్రచార విభాగం డైరెక్టర్‌ దిలీప్‌ కుమార్‌ తెలిపారు.

Updated Date - Jun 12 , 2025 | 04:59 AM