Share News

NDA Government: 8వ వేతన సంఘం విధివిధానాలకు ఓకే

ABN , Publish Date - Oct 29 , 2025 | 03:20 AM

లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్‌ విధివిధానాలకు ఆమోదం తెలిపింది.

NDA Government: 8వ వేతన సంఘం విధివిధానాలకు ఓకే

  • జనవరి 1 నుంచి సిఫారసులు అమలయ్యే అవకాశం

  • కమిషన్‌కు జస్టిస్‌ రంజనా దేశాయ్‌ సారథ్యం

  • యూరియాయేతర ఎరువులపై సబ్సిడీ పెంపు

  • బిహార్‌ ఎన్నికల వేళ ఎన్డీఏ సర్కారు కీలక నిర్ణయాలు

న్యూఢిల్లీ, అక్టోబరు 28: లక్షలాది మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదార్లకు కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. 8వ వేతన కమిషన్‌ విధివిధానాలకు ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి రంజనా ప్రకాశ్‌ దేశాయ్‌ కమిషన్‌కు సారథ్యం వహించనున్నారు. వచ్చే ఏడాది జనవరి 1వ తేదీ నుంచి కమిషన్‌ సిఫారసులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఫలితంగా 50 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, 69 లక్షల మంది పింఛనుదార్లకు ప్రయోజనం చేకూరనుంది. మంగళవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర క్యాబినెట్‌ 8వ వేతన సంఘం విధివిధానాలకు ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. దీని ప్రకారం.. 8వ వేతన సంఘం ఏర్పాటైనప్పటి నుంచి 18 నెలల్లోపు తుది నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తుంది. ఈ మధ్య కాలంలో పూర్తయిన తాత్కాలిక నివేదికలను ఎప్పటికప్పుడు అందజేస్తుంది. ఈ ఏడాది జనవరిలోనే వేతన సంఘం ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. 8వ వేతనసంఘంలో ఐఐఎం బెంగళూరుకు చెందిన ప్రొఫెసర్‌ పులక్‌ ఘోష్‌ తాత్కాలిక సభ్యులుగా, కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి పంకజ్‌జైన్‌ సభ్య కార్యదర్శిగా వ్యవహరిస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రస్తుతం అమలులో ఉన్న జీతభత్యాలు, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు రంగంలోని ఉద్యోగులకు అందుతున్న ప్రయోజనాలు, వేతనాలు, దేశంలోని ఆర్థిక పరిస్థితులు, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు అందుబాటులో ఉన్న నిధులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని వేతనసంఘం సిఫారసులు చేయనుంది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ క్యాబినెట్‌ నిర్ణయం తాలూకు వివరాలు వెల్లడిస్తూ.. వేతనసంఘం తాత్కాలిక నివేదికలు వచ్చిన తర్వాత సిఫారసుల అమలు తేదీని నిర్ణయిస్తామని.. అయితే, 2026 జనవరి 1వ తేదీ నుంచే అమలు జరిగే అవకాశం ఉందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలను, పింఛనుదార్ల పింఛన్లను సవరించటానికి ప్రతీ పదేళ్లకోమారు కేంద్రం వేతనసంఘాన్ని నియమిస్తుంది.


ఎరువులకు సబ్సిడీ పెంపు

2025-26 రబీ సీజన్‌కు సంబంధించి ఫాస్ఫరస్‌, సల్ఫర్‌ వంటి యూరియా యేతర ఎరువులపై సబ్సిడీని పెంచుతూ కేంద్ర క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఫాస్ఫేట్‌పై ప్రస్తుతం కిలోకు ఇస్తున్న సబ్సిడీ రూ.43.60 కాగా.. దీనిని రూ.47.96కు పెంచారు. సల్ఫర్‌ ఎరువులపై ప్రస్తుత సబ్సిడీ కిలోకు రూ.1.77 కాగా.. రూ.2.87కు పెంచారు. మొత్తంగా ఈ రెండు రకాల ఎరువులకు ఇస్తున్న సబ్సిడీ కోసం రూ.37,952 కోట్లను కేటాయించారు. కాగా, నైట్రోజన్‌ (కిలోకు రూ.43.02), పొటాష్‌ (కిలోకు రూ.2.38)ల మీద ఉన్న సబ్సిడీలో ఎటువంటి మార్పుల్లేవు.

Updated Date - Oct 29 , 2025 | 03:23 AM