Total Lunar Eclipse: భూమి నీడకు చంద్రుడు
ABN , Publish Date - Sep 08 , 2025 | 03:03 AM
సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది...
82 నిమిషాల పాటు ఎరుపెక్కిన జాబిల్లి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్): సంపూర్ణ చంద్ర గ్రహణం కనువిందు చేసింది. భారత్‌లో ఆదివారం రాత్రి 9.56 గంటలకు మొదలైన గ్రహణం అర్ధరాత్రి 1.26 గంటలకు వీడింది. చంద్రుడు పూర్తిగా భూమి నీడకు వెళ్లిపోయి 82 నిమిషాల పాటు ఎర్రబారి కనిపించాడు. అనేకమంది ఈ ఖగోళ వింతను ఆసక్తిగా తిలకించారు. 2022 తర్వాత భారత్‌లో అత్యంత ఎక్కువ సేపు కనిపించిన సంపూర్ణ చంద్రగ్రహణం ఇదే కావడం విశేషం. గ్రహణం సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలను ప్రత్యేక పూజల అనంతరం ఆదివారం మధ్యాహ్నమే మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున సంప్రోక్షణ చేసిన తర్వాత తిరిగి తెరవనున్నారు. భద్రాచలంలోని శ్రీసీతారామచంద్రస్వామి ఆలయ తలుపులను ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంటకు మూసివేశారు. అంతకుముందు వేద పండితులు మూలవరుల అభిషేకం, ఇతర పూజలు నిర్వహించారు. రాజగోపురం వద్ద ఉన్న ప్రధాన ద్వారాన్ని సైతం మూసివేసి... ఆలయ ప్రాంగణంలోకి భక్తులను అనుమతించలేదు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 12.25 గంటలకు రాజభోగం నిర్వహించి మూసివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయం తలుపులు 11.36 గంటలకే మూతపడ్డాయి. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయానికి అర్చకులు, ఆలయాధికారులు ద్వారబంధనం చేశారు. వరంగల్ భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి, నిర్మల్ జిల్లా బాసర సరస్వతీ అమ్మవారి ఆలయం, జగిత్యాల జిల్లా ధర్మపురి క్షేత్రంలోని లక్ష్మీనరసింహస్వామి, మల్యాల మండలం కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలను కూడా ప్రత్యేక పూజల అనంతరం మూసివేశారు. సోమవారం ఉదయం నుంచి మళ్లీ భక్తులకు దర్శనం కల్పించనున్నారు.
చంద్రుడు ఎందుకు ఎరుపెక్కుతాడు?
సూర్యునికి చంద్రునికి మధ్యలో భూమి వచ్చినప్పుడు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. భూగోళం ఆపగా మిగిలిన సూర్యకిరణాలు, దానిచుట్టూ ఉన్న వాతావరణం గుండా ప్రసరించి చంద్రుని చేరుతాయి. ఆ క్రమంలో సూర్యుడి నుంచి వెలువడే కాంతిపుంజం చెల్లాచెదురు అవుతుంది. సప్తవర్ణాలు కలిగిన సూర్యకిరణాల్లో నీలిరంగు ఫిల్డర్ అయిపోగా, ఎరుపు, నారింజ రంగు కిరణాలు మాత్రమే చందమామపై పడతాయి. అలా చంద్రుడు ఎరుపెక్కుతాడు. ఆ ఎర్రని చందమామనే కొన్ని దేశాల్లో ప్రజలు ‘బ్లడ్ మూన్’గా పిలుస్తున్నారు.


