Omar Abdullah: కశ్మీర్‌లో శిథిలాల కింద 500 మంది
ABN , Publish Date - Aug 16 , 2025 | 02:58 AM
కిష్ట్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటం జరిగిన సమయంలో చశోతీ గ్రామంలో వెయ్యి మందికి పైగా ఉన్నారని, సుమారు 500 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి...
నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూఖ్ అబ్దుల్లా అంచనా
మేఘ విస్ఫోటం సమయంలో చశోతీ గ్రామంలో వెయ్యి మంది!
మృతుల సంఖ్య 60కి పెరిగిందన్న సీఎం ఒమర్ అబ్దుల్లా
ఫరూఖ్ అబ్దుల్లా అంచనా
న్యూఢిల్లీ, శ్రీనగర్, ఆగస్టు 15: కిష్ట్వార్ జిల్లాలో మేఘ విస్ఫోటం జరిగిన సమయంలో చశోతీ గ్రామంలో వెయ్యి మందికి పైగా ఉన్నారని, సుమారు 500 మంది శిథిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని జమ్మూకశ్మీర్ మాజీ సీఎం ఫరూఖ్ అబ్దుల్లా అంచనా వేశారు. అయితే... ఈ ఘటనలో 60 మంది చనిపోయినట్లు సీఎం ఒమర్ అబ్దుల్లా ధ్రువీకరించారు. వంద మందికి పైగా గాయపడినట్లు తెలిపారు. ప్రధాని మోదీ తనతో ఫోన్‌లో మాట్లాడారని, తాజా పరిస్థితిని వివరించారనని చెప్పారు. మచైల్ ఆలయానికి వెళ్లే యాత్రికులకు ఈ గ్రామమే బేస్ పాయింట్. ఎగువ ప్రాంతంలో కుండపోత వానల కారణంగా మెరుపు వరదలు రావడంతో భక్తుల టెంట్లు, దుకాణాలన్నీ కొట్టుకుపోయాయి. మేఘ విస్ఫోటం సమయంలో బాంబు పేలుడు తరహాలో భారీ శబ్దం వచ్చిందని ప్రమాదం నుంచి బయటపడినవారు చెబుతున్నారు. పేలుడు రాగానే పరిగెత్తండంటూ అరుపులు వినిపించాయని, రెండు నిమిషాల్లోనే అందరూ 4 అడుగుల బురద, శిథిలాల కింద చిక్కుకుపోయారని ఓ క్షతగాత్రుడు తెలిపారు.