GST Meeting Drama: జీఎస్టీ భేటీలో హైడ్రామా
ABN , Publish Date - Sep 05 , 2025 | 04:46 AM
దేశంలో వస్తు సేవల పన్ను జీఎస్టీ అమల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత భారీ సంస్కరణలు తీసుకొచ్చారు..
పన్ను తగ్గింపుపై 4 రాష్ట్రాల అభ్యంతరం
తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్
రాత్రి 7 గంటలకే ముగియాల్సిన భేటీ
రెండు రాష్ట్రాల అభ్యంతరాలతో 9.30 వరకు కొనసాగిన వైనం
ఓటింగ్‌కు వెళ్దామన్న మరో రాష్ట్ర మంత్రి
అంగీకరించిన ఆర్థిక మంత్రి నిర్మల
బెంగాల్ మంత్రి జోక్యంతో సద్దుమణిగిన వివాదం.. ఈ క్రమంలోనే ప్రకటన జాప్యం
న్యూఢిల్లీ, సెప్టెంబరు 4: దేశంలో వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన ఎనిమిదేళ్ల తర్వాత భారీ సంస్కరణలు తీసుకొచ్చారు. అయితే, బుధవారం ఢిల్లీలో జరిగిన జీఎస్టీ మండలి సమావేశంలో హైడ్రామా చోటుచేసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. జీఎస్టీ మండలి భేటీ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల మీడియాతో మాట్లాడుతూ.. జీఎస్టీ తగ్గింపు నిర్ణయాన్ని ఏకగ్రీవంగా తీసుకున్నట్లు చెప్పారు. కానీ, జీఎస్టీ తగ్గింపు వల్ల తమకు భారీగా నష్టం వాటిల్లుతుందని ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ విషయంపై బెంగాల్ కాస్త గట్టిగానే నిరసన వ్యక్తం చేసినట్లు తెలిసింది. వాస్తవానికి బుధవారం రాత్రి 7 గంటలకే జీఎస్టీ మండలి భేటీ ముగియాల్సి ఉంది. కానీ, బెంగాల్, కేరళ, పంజాబ్, కర్ణాటక రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో.. రాత్రి 9.30 గంటల వరకు సమావేశం కొనసాగినట్లు తెలిసింది. వారి అభ్యంతరాలపై కేంద్ర మంత్రి నిర్మల స్పం దిస్తూ.. రాష్ట్రాల ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిసింది. సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో తొలుత బెంగాల్, పంజాబ్ రాష్ట్రాల మంత్రులు జీఎస్టీ తగ్గింపునకు అంగీకరించినట్లు తెలిసింది. కర్ణాటక, కేరళ మంత్రులు మాత్రం పరిహారం ఇవ్వాల్సిందేనంటూ పట్టుబట్టినట్లు సమాచారం. ఈ అంశం పై చర్చను గురువారానికి వాయిదా వేయాలని కోరినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఛత్తీ్‌సగఢ్ ఆర్థిక మంత్రి కల్పించుకొని.. జీఎస్టీ రేట్ల తగ్గింపునకు కర్ణాటక, కేరళ అంగీకరించకపోతే ఓటింగ్‌కు వెళ్దామని ప్రతిపాదించినట్లు సమాచారం. నిర్మల కూడా దానికి అంగీకరించగా.. బెంగాల్ మంత్రి కలగజేసుకొని కర్ణాటక, కేరళ మంత్రులకు నచ్చజెప్పినట్లు తెలిసింది. ఈ తతంగం వల్లే జీఎస్టీ తగ్గింపు ప్రకటన ఆలస్యంగా వెలువడినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.