Share News

Goa Fire Incident: గోవాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..25 మంది మృతి

ABN , Publish Date - Dec 08 , 2025 | 03:48 AM

గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు....

Goa Fire Incident: గోవాలోని నైట్‌క్లబ్‌లో అగ్నిప్రమాదం..25 మంది మృతి

  • బిర్చ్‌ నైట్‌క్లబ్‌ లో అర్ధరాత్రి అగ్నికీలలు

  • బాణసంచా పేలుడుతో క్షణాల్లో వ్యాపించిన మంటలు

  • ఇరుకుదారిలో బయటకు వెళ్లలేకపోయిన బాధితులు

  • బేస్‌మెంట్‌లో చిక్కుకుని ఊపిరాడక పలువురి మృతి

  • మృతుల్లో నలుగురు పర్యాటకులు, 14 మంది సిబ్బంది

  • 7 మృతదేహాల్ని గుర్తించాల్సి ఉందన్న గోవా పోలీసులు

  • క్లబ్‌ యజమానులు, మేనేజర్‌పై క్రిమినల్‌ కేసు నమోదు

  • మృతుల కుటుంబాలకు గోవా సర్కారు రూ.5 లక్షలు, కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల ఎక్స్‌గ్రేషియా

పనాజీ, డిసెంబరు 7: గోవాలోని ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో 25 మంది మరణించారు. ఆరుగురు గాయపడ్డారు. ఉత్తర గోవాలోని అర్పోరా-నగావ్‌ గ్రామంలో అర్పోరా నది ఒడ్డున ఉన్న బిర్చ్‌ బై రోమియో లేన్‌ అనే నైట్‌క్లబ్‌లో ఒక్కసారిగా పేలుడు సంభవించి క్షణాల్లోనే మంటలు వ్యాపించాయి. దీంతో మంటల్లో చిక్కుకుని కొందరు, దట్టమైన పొగకు ఊపిరాడక మరికొందరు మరణించారు. మృతుల్లో నలుగురు పర్యాటకులు, 14 మంది క్లబ్‌ సిబ్బందిని గుర్తించారు. మరో 7 మృతదేహాలను గుర్తించాల్సి ఉంది. క్లబ్‌లో బాణసంచా పేలడంతో ఈ ప్రమాదం జరిగిందని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ ప్రకటించారు. నిబంధనలు అతిక్రమించి, ఏమాత్రం భద్రతా చర్యలు తీసుకోకుండా క్లబ్‌ను నిర్వహించటమే ప్రమాదానికి కారణమని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనలో క్లబ్‌ మేనేజర్‌, ఈవెంట్‌ ఆర్గనైజర్లతోపాటు ఇద్దరు యజమానులపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా క్లబ్‌ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారన్న ఆరోపణలతో అర్పోరా-నగావ్‌ గ్రామ సర్పంచ్‌ను అరెస్టు చేశారు. ఈ ఘటనకు బాధ్యులను చేస్తూ ముగ్గురు అధికారులను సస్పెండ్‌ చేశారు. ఈ ఘటనపై రాష్ట్రపతి దౌపది ముర్ము, ప్రధాని మోదీ, గోవా సీఎం ప్రమోద్‌ తదితరులు సంతాపం తెలిపారు.


ఆనందం క్షణాల్లో ఆవిరై..

గోవా రాజధాని పనాజీకి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్పోరా గ్రామంలోని బిర్చ్‌ బై రోమియో లేన్‌ నైట్‌ క్లబ్‌.. రాత్రి ఒంటిగంట సమయంలో క్లబ్‌లోని మొదటి అంతస్తులో ఉన్న డ్యాన్స్‌ హాల్‌లో ఉషారెక్కించే సంగీతం మారుమోగుతోంది.. దాదాపు వందమంది కేరింతలు కొడుతూ ఆనందంగా గడుపుతున్నారు. అప్పుడే వేదిక వెనుకవైపున పైకప్పు నుంచి చిన్నగా మంట మొదలై.. క్షణాల్లోనే హాలంతా మంటలు పాకాయి. క్లబ్‌లోనివారంతా ఒక్కసారిగా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఇరుకు దారిలో వెళ్లలేక కొందరు బేస్‌మెంట్‌లో ఉన్న వంటగదిలోకి వెళ్లారు. వారంతా ఊపిరాడక మరణించారని పోలీసులు తెలిపారు. రాత్రిపూట వేడుకలకు ఉత్తర గోవా ప్రాంతంలో బిర్చ్‌ క్లబ్‌ చాలా ప్రసిద్ధి. నిత్యం వందలాది మంది క్లబ్‌కు వస్తారు. అయితే, ఈ క్లబ్‌ నిర్మాణంలోగానీ, నిర్వహణలోగానీ ఏమాత్రం నిబంధనలు పాటించలేదని పోలీసుల విచారణలో తేలింది. లోపలికి వె ళ్లేందుకు, బయటకు వచ్చేందుకు దారులు చాలా ఇరుకుగా ఉన్నాయి. క్లబ్‌ భవనం జీవితకాలం ముగిసిపోవటంతో కూల్చివేయాలని గ్రామపంచాయతీ కార్యాలయం నోటీసులు కూడా ఇచ్చింది. అయినా క్లబ్‌ను నిర్వహిస్తున్నారు. అందులో పనిచేసే ఉద్యోగుల్లో చాలామంది అర్పోరా గ్రామ వాసులు ఉండగా, కొందరు జార్ఖండ్‌, అస్సాం రాష్ట్రాల వారు ఉన్నారు. మృతుల్లో కూడా వీరే అధికంగా ఉన్నారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ మెజిస్టీరియల్‌ విచారణకు ఆదేశించారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడినవారికి రూ.50వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

సిలిండర్లు పేలలేదు: గోవా డీజీపీ

మంటలు అంటుకోవటానికి ముందు క్లబ్‌లో భారీ పేలుడు సంభవించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. దీంతో వంటగదిలో గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఉండొచ్చని పోలీసులు మొదట భావించారు. అయితే, వంటగదిని పరిశీలించగా సిలిండర్లన్నీ సురక్షితంగా ఉన్నాయని గోవా డీజీపీ అలోక్‌కుమార్‌ ఆదివారం తెలిపారు. పేలుడుపై దర్యాప్తు జరుపుతున్నట్లు వెల్లడించారు. అగ్నిప్రమాదంలో క్లబ్‌ మొత్తం కాలిపోయింది. మంటలు క్షణాల్లోనే క్లబ్‌ మొత్తం వ్యాపించాయని పోలీసులు తెలిపారు. అగ్నిప్రమాద సమాచారం అందుకొని అగ్నిమాపక శకటాలు అక్కడికి వెళ్లినా.. దారి ఇరుకుగా ఉండటంతో క్లబ్‌కు 400 మీటర్ల దూరంలోనే ఆగిపోవాల్సి వచ్చిందన్నారు.

Updated Date - Dec 08 , 2025 | 03:48 AM