Karnataka MLA Veerendra Under ED Scanner: ఆ ఎమ్మెల్యే లాకర్లలో 40 కిలోల గోల్డ్!
ABN , Publish Date - Oct 11 , 2025 | 02:43 AM
ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పేరు కేసీ వీరేంద్ర. కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు సంబంధించిన..
ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో కర్ణాటక ఎమ్మెల్యే వీరేంద్రపై ఆరోపణలు
రెండు లాకర్లు తనిఖీ చేసిన ఈడీ
రూ.50.33 కోట్ల విలువైన బంగారు కడ్డీలు లభ్యం
ఇదివరకే 21 కిలోల గోల్డ్ సహా రూ.103 కోట్ల సొత్తు సీజ్
బెంగళూరు అక్టోబరు 10 (ఆంద్రజ్యోతి): ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే.. పేరు కేసీ వీరేంద్ర. కర్ణాటకలోని చిత్రదుర్గ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయనకు సంబంధించిన బ్యాంకు లాకర్లను తెరిచిచూసి ఈడీ అధికారులు నోరెళ్ల బెట్టారు. ఆ లాకర్ల నిండా బంగారం కడ్డీలే కనిపించాయి! తక్కెట్లో కుప్పగా పోస్తే ఆ గోల్డ్ 40 కిలోలు తూగింది! ఆ బంగారం విలువ రూ.50.33 కోట్లు అని ఈడీ అధికారులు లెక్కగట్టారు. వీరేంద్ర నేతృత్వంలో భారీగా అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ కుంభకోణం జరిగిందని.. పలు బెట్టింగ్ యాప్‌ల ద్వారా అమాయకులను మోసం చేశారంటూ ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ మేరకు బెంగళూరుకు చెందిన ఈడీ బృందం శుక్రవారం చల్లెకెరెలోని ఫెడరల్ బ్యాంకులో వీరేంద్రకు సంబంధించిన రెండు లాకర్లలోంచి 40 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే ఆయన్నుంచి 21 కిలోల బంగారు బిస్కెట్లు సహా నగదు, డిపాజిట్లు, లగ్జరీ కార్ల రూపంలో రూ.103 కోట్ల సొత్తును అఽధికారులు సీజ్ చేశారు. తాజా దాడులతో వీరేంద్రకు సంబంధించి రూ.150 కోట్లకు పైగానే సొత్తును సీజ్ చేసినట్లయిందని అధికారులు వెల్లడించారు. వీరేంద్ర కుటుంబసభ్యులు, ఆయన బంధువులు, సన్నిహితులు బెట్టింగ్ వెబ్‌సైట్లు, యాప్‌ల ద్వారా ప్రజలను మోసం చేస్తునట్లు దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. అక్రమంగా సంపాదించిన సొమ్మును విదేశీ బ్యాంకుల్లో డిపాజిట్ చేసినట్లు అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యేతో పాటు ఆయన తమ్ముడు కేసీ తిప్పేస్వామి, మరో వ్యక్తి పృథ్వీరాజ్ దుబాయ్‌లో పలు కాల్‌సెంటర్ల ద్వారా ఆన్‌లైన్ గేమింగ్ వ్యవహారాలు నడిపినట్లు గుర్తించారు. ఈ కార్యకలాపాలన్నీ ఎమ్మెల్యే వీరేంద్ర నియంత్రణలో జరిగాయని.. ఈ బెట్టింగ్ అప్లికేషన్ల టర్నోవర్ రూ.2వేల కోట్లకు పైగా ఉంటుందని వెల్లడించారు. మరోవైపు.. బిహార్ ఎన్నికల కోసం రూ.300 కోట్లు ఇస్తాననని కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎమ్మెల్యే వీరేంద్ర ఆఫర్ ఇచ్చారని కర్ణాటకలో విపక్ష నేత అశోక్ ఆరోపించారు. తాను చెల్లించే ఈ డబ్బుకు ప్రతిఫలంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరినట్లు తెలిసిందని పేర్కొన్నారు.