Uttarakhand: జలప్రళయం.. తుడిచిపెట్టుకుపోయిన ఆర్మీ బేస్ క్యాంప్.. 11 మంది గల్లంతు
ABN , Publish Date - Aug 05 , 2025 | 10:23 PM
ఇప్పుడే అందుతోన్న మరో ఘోరమైన వార్త ఏంటంటే, ఉత్తరాఖండ్ మెరుపు వరదల తాకిడికి ఆర్మీ క్యాంప్ కొట్టుకు పోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా 11 మంది సైనికులు గల్లంతయినట్టు సమాచారం. వీరికోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది.
ఉత్తరాఖండ్, ఆగష్టు, 5: ఉత్తరాఖండ్‌లో మెరుపు వరదలు జనజీవనాన్ని తుడిచిపెట్టేస్తున్నాయి. కొండ సానువుల్లోంచి ఒక్కసారిగా వచ్చిపడుతున్న వరదనీరు ఉప్పనలా జనావాసాల్ని తాకి నీటిలో కలిపేస్తున్నాయి. ఇప్పటికే ఇవాళ రెండు సార్లు సంభవించిన వరదలు జలప్రళయాన్నే తీసుకొచ్చాయి. తాజాగా అందుతోన్న మరో ఘోరమైన వార్త ఏంటంటే, అక్కడ మెరుపు వరదల తాకిడికి ఆర్మీ క్యాంప్ కొట్టుకు పోయినట్టు తెలుస్తోంది. ఫలితంగా 11 మంది సైనికులు గల్లంతయినట్టు సమాచారం. వీరికోసం తీవ్రంగా గాలింపు కొనసాగుతోంది.
హర్షిల్‌లోని భారత ఆర్మీ క్యాంప్ నుండి కేవలం 4 కి.మీ దూరంలో ఉన్న ధరాలి గ్రామ ప్రాంతం సమీపంలో మధ్యాహ్నం 1:45 గంటలకు మెరుపు వరదలు సంభవించాయి. గంగోత్రికి వెళ్లే మార్గంలోని ధరాలి ప్రధాన స్టాప్ ఓవర్.. అనేక హోటళ్ళు, రెస్టారెంట్లు, హోమ్‌స్టేలకు ఇది నిలయం. అవన్నీ వరదలకు తుడిచిపెట్టుకుపోయాయి.
ఖీర్ గంగా నది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు సంభవించాయని, ఫలితంగా వినాశకరమైన వరదలు సంభవించాయని స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన 10 నిమిషాల్లోనే, సైన్యం 150 మంది సిబ్బందిని విపత్తు ప్రదేశానికి తరలించింది. సహాయక బృందాలు వెంటనే వరదల్లో చిక్కుకున్న గ్రామస్తులను తరలించడం, క్షేత్రస్థాయిలో కీలకమైన సహాయాన్ని అందించడం ప్రారంభించాయి.