బస్తీ మే స‘వాల్’.. ప్రపంచంలోనే అతి ఎత్తైనది ఇదే..
ABN , Publish Date - Oct 05 , 2025 | 01:22 PM
షాపింగ్‌మాల్స్, రిసార్టుల్లో ఏర్పాటుచేసే ‘క్లైంబింగ్ వాల్స్’ను పిల్లలు, యువతీ యువకులు సరదాగా, కొందరు సీరియస్‌గా ఎక్కేందుకు ప్రయత్ని స్తుంటారు. అయితే నగరం మధ్యలో ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ ‘క్లైంబింగ్ వాల్’ (ఎక్సాలిబర్)ను ఎక్కాలంటే మాత్రం గుండెల్లో దమ్ముతో పాటు చేతుల్లో సత్తువా ఉండాలి.
షాపింగ్‌మాల్స్, రిసార్టుల్లో ఏర్పాటుచేసే ‘క్లైంబింగ్ వాల్స్’ను పిల్లలు, యువతీ యువకులు సరదాగా, కొందరు సీరియస్‌గా ఎక్కేందుకు ప్రయత్ని స్తుంటారు. అయితే నగరం మధ్యలో ఆకాశాన్ని తాకేలా ఉండే ఈ ‘క్లైంబింగ్ వాల్’ (ఎక్సాలిబర్)ను ఎక్కాలంటే మాత్రం గుండెల్లో దమ్ముతో పాటు చేతుల్లో సత్తువా ఉండాలి. ఓర్పు, నేర్పూ కావాల్సిందే. పేరుమోసిన అధిరోహకులకు సైతం చుక్కలు చూపించే ఈ వాల్ ప్రపంచంలోనే అతి ఎత్తైనది...
ఔత్సాహికుల కోసం పెద్ద పెద్ద మాల్స్‌లో క్లైంబింగ్ వాల్స్‌ను ఏర్పాటు చేయడం చూస్తూనే ఉంటాం. వాటిని అధిరోహించా లంటేనే కష్టం. దానికున్న గ్రిప్స్‌ను పట్టుకుంటూ వాల్ ఎక్కడం క్లైంబర్స్‌కు కిక్కునిస్తుంది. అయితే నెదర్లాండ్స్‌లోని గ్రోనిన్‌జెన్ పట్టణంలో ఉన్న క్లైంబింగ్ వాల్‌ను ఎక్కాలంటే మాత్రం అనుభవం ఉన్న క్లైంబర్లకు సైతం చుక్కలు కనిపిస్తాయి.


మలుపులో సవాల్...
పట్టణంలోని బిజోక్స్ క్లైంబ్ సెంటర్‌లో ఉన్న ఈ వాల్ ఎత్తు 121 అడుగులు. సాధారణ వాల్స్‌ను క్లైంబర్స్ కాస్త కష్టపడి ఎక్కేస్తుంటారు. కానీ ఈ ఎక్సాలిబర్‌ను ఎక్కడం మాత్రం అంత సులువు కాదు. ఎందుకంటే 36 అడుగుల దగ్గర ఉన్న స్లీక్ కర్వ్ క్లైంబర్స్‌కు సవాలు విసురుతుంది. ఈ వాల్‌ను ఏ వైపు నుంచైనా ఎక్కవచ్చు. ఒకవైపు నుంచి ఎక్కడం చాలా కష్టంగా ఉంటే, మరొకవైపు కాస్త సులువుగా ఎక్కేలా ఉంటుంది. రిస్క్ ఎందుకు అనుకునేవారు సులువుగా ఎక్కే మార్గాన్ని ఎంచుకుంటుంటారు. మొదటిసారి ప్రయత్నించే వారికోసం 45 డిగ్రీల కోణంలో ఇండోర్ వాల్స్ ఏర్పాటు చేశారు.
ఇక్కడ ప్రాక్టీస్ చేయడం ద్వారా ఎలాంటి వాల్స్‌నైనా అధిగమించే నైపుణ్యం లభిస్తుంది. కొంతమంది ఔత్సాహికులు వాల్ పైనుంచి బేస్ జంప్ చేయడానికి ఆసక్తి చూపుతుంటారు.
ఎక్సాలిబర్‌ను అధిరోహించినవారు ఒక కొత్త అనుభూతిని సొంతం చేసుకుంటారు. సాధించామనే సంతృప్తి క్లైంబర్స్‌కు కలుగుతుంది. ఈ విభిన్న అనుభవాన్ని సొంతం చేసుకోవాలనుకునే ఔత్సాహికులు రూ. 1250 చెల్లించి టిక్కెట్ కొనుగోలు చేయాలి. అనుభవం లేకుండా ఎక్సాలిబర్‌ను ఎక్కాలని ఉత్సాహపడేవారు రూ. 3600 చెల్లిస్తే, రెండు గంటల పాటు ఇన్‌స్ట్రక్టర్ పర్యవేక్షణలో ఎక్సాలిబర్‌ను ఎక్కిస్తారు.