‘ఫఫో’ పేరెంటింగ్ వాళ్లకే వదిలేద్దాం...
ABN , Publish Date - Sep 07 , 2025 | 08:21 AM
పిల్లలు మాట వినట్లేదు... ఇల్లు పీకి పందిరేస్తున్నారు... ప్రతీ తల్లిదండ్రులు చెప్పే మాటలే ఇవి. పిల్లల పెంపకం (పేరెంటింగ్) బ్రహ్మవిద్యగా మారిన రోజులివి. పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు, సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక నవ్య సిద్ధాంతమే ‘ఫఫో’. ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారిన ఈ తరహా పేరెంటింగ్ ఏమిటో చూసేద్దాం...
పిల్లలు మాట వినట్లేదు... ఇల్లు పీకి పందిరేస్తున్నారు... ప్రతీ తల్లిదండ్రులు చెప్పే మాటలే ఇవి. పిల్లల పెంపకం (పేరెంటింగ్) బ్రహ్మవిద్యగా మారిన రోజులివి. పిల్లల పెంపకానికి సంబంధించి ఎన్నో పుస్తకాలు, సిద్ధాంతాలు ఎప్పటికప్పుడు సరికొత్తగా వస్తూనే ఉన్నాయి. అలాంటి ఒక నవ్య సిద్ధాంతమే ‘ఫఫో’. ప్రస్తుతం ఒక ట్రెండ్‌గా మారిన ఈ తరహా పేరెంటింగ్ ఏమిటో చూసేద్దాం...
- ‘ఇంకా మూడేళ్లు కూడా నిండలేదు... ఇప్పుడే మాట వినట్లేదు. ముందు ముందు వీడితో ఎలా వేగాలో ఏమో?...’ ఓ తండ్రి ఆవేదన.
- జోరున వర్షం... రెయిన్ కోట్ వేసుకోమని చేతికి ఇస్తే, ఇంట్లోనే వదిలేసి స్కూల్‌కి వెళ్లిన కూతురిని తిట్టుకుంటోంది ఓ తల్లి.
- ‘బైక్ మీద వేగంగా వెళ్లకు నాన్నా’ అని ఎన్నిసార్లు చెప్పినా వినని కొడుకు. తిరిగి వాడు ఇంటికి వచ్చే దాకా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కూర్చునే తల్లిదండ్రులు.

...ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా, పిల్లలున్న ఏ ఇంట్లో అయినా మామూలే. ఇక టీనేజీ పిల్లలు, కాలేజీ పిల్లలు, కొత్తగా ఉద్యోగంలో చేరిన పిల్లలు ఉన్న ఇళ్లలోనైతే నిత్యం రణరంగమే. తల్లిదండ్రులు ఏదో చెప్పడం, పిల్లలు దానికి విరుద్ధంగా చేయడం లేదా అస్సలు పట్టించుకోకపోవడం షరా మామూలే. దీనివల్ల ఇంట్లో మనశ్శాంతి అనేది ఉండదు. తల్లిదండ్రులకు బీపీ, షుగర్‌లాంటి వాటితో అనారోగ్యం బారిన పడే అవకాశాలు ఎక్కువ. నవతరం పేరెంటింగ్‌లో ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కించేదిగా ప్రాచుర్యం పొందుతోంది ‘ఫఫో’ (ఎఫ్‌ఎఎఫ్‌ఒ: ఫూల్ అరౌండ్ అండ్ ఫైండ్ అవుట్)’ పేరేంటింగ్. ఇందులో ఫూల్‌కి బదులుగా మరో బూతుపదాన్ని కూడా కొందరు వాడుతున్నారు. ‘ఫఫో’ను ఒక్కమాటలో చెప్పాలంటే... ‘మనం చెప్పడం ఎందుకు... వాళ్లకు వాళ్లే తెలుసుకుంటారు’ అని.
ఒక్కొక్కరిది ఒక్కో తరహా...
పిల్లల పెంపకంలో తల్లిదండ్రులది ఒక్కొక్కరిది ఒక్కో తరహాగా ఉంటుంది. కొంత మంది పేరెంట్స్ పిల్లల్ని అంత సులభంగా విడిచిపెట్టరు. వారికి ఏమాత్రం స్వేచ్ఛ ఇవ్వరు. ఎప్పుడూ వెంటపడుతూనే ఉంటారు. ఈ టైపు తల్లిదండ్రులు ‘అథారిటేటివ్’ గా పేరుతెచ్చుకున్నారు. అయితే దీనివల్ల ఆ క్షణంలో పని అయినట్టుగా అనిపిస్తుంది. కానీ పిల్లల లోపల క్రమక్రమంగా అశాంతి కమ్ముకుంటూ ఉంటుంది.
మరి కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని బాగా బుజ్జగిస్తుంటారు. అంటే... వర్షంలో తడిస్తే జలుబు చేస్తుంది, ఆ తర్వాత జ్వరం వస్తుంది, అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్లాలి, ఆయన ఇంజక్షన్ ఇస్తారు... ఇలా పేద్ద కథని, బుజ్జగింపుగా చెప్పి, పిల్లల్ని తమ దారిలోకి తెచ్చుకుంటారు. దీన్నే ‘జెంటిల్ పేరెంటింగ్’ అంటారు. ఇలా చేయడం వల్ల పిల్లలు పూర్తిగా తల్లిదండ్రుల మీదే ఆధారపడతారు. అయితే పేరెంట్స్ ప్రతిసారీ ఈ పద్ధతిలో ఎంతో ప్రయాస పడాల్సి ఉంటుంది.

కాలం మారుతున్న కొద్దీ పిల్లల పెంపకంలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. జనరేషన్ మారుతోంటే, కొత్త కొత్త సమస్యలు చుట్టుముడుతున్నాయి. వాటికి తగ్గట్టుగా పిల్లల పెంపకం తీరు కూడా మార్చుకోక తప్పదంటున్నారు మానసిక నిపుణులు. అందుకే పాత చింతకాయ పచ్చడి లాంటివాటిని వదిలేసి, మారుతున్న కాలానికి తగినట్టు తల్లిదండ్రులు కూడా మారాల్సిందే. పిల్లలకు తరచూ జాగ్రత్తలు చెబుతూ ఆందోళన చెందకుండా, కొన్ని వారి అనుభవంలోకి వచ్చేలా చూడటమే సరైనది. ఉదాహరణకు చలికాలంలో జాకెట్ వేసుకోకుండా వెళితే ఏం జరుగుతుందో పిల్లవాడు స్వయంగా తెలుసుకుంటాడు. కాబట్టి అదో పాఠంగా గుర్తుండి, మళ్లీ ఆ తప్పు చేయడు అనేది ‘ఫఫో’ పేరెంటింగ్ విధానం.
స్కూల్‌కెళ్లే పిల్లలున్న ఇంట్లో ప్రతీ సాయంత్రం ఓ మోస్తరు యుద్ధ వాతావరణమే ఉంటుంది. పిల్లలతో హోంవర్క్ చేయించడానికి పెద్దలు నానా హైరానా పడుతుంటారు. ‘ఫఫో’ పద్ధతిలో హోంవర్క్ చేసుకోమని ఒక్కసారి చెప్పి వదిలేయమంటారు సైకాలజిస్టులు. పిల్లలు ఆ మాట వింటే ఓకే. ఒకవేళ వినకపోతే మరుసటి రోజు టీచర్ ఆగ్రహానికి గురికావాల్సిన పరిస్థితిని వాళ్లే ఎదుర్కొంటారు. దానివల్ల జీవితంలో మరోసారి ఆ తప్పు చేయరన్నది వాళ్ల విశ్లేషణ.

కొంత లాభమే...
- ఫో విధానం వల్ల పిల్లల్లో...
- స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే గుణం అలవడుతుంది.
- సమస్యను పరిష్కరించుకోగల సామర్థ్యం ఏర్పడుతుంది.
- ఏ పనిచేసినా తద్వారా ఎదురయ్యే పరిణామాలను ఊహించడం నేర్చుకుంటారు. దీనివల్ల వాళ్ల ప్రవర్తనలో మార్పు వస్తుంది.
- ఒకవేళ వైఫల్యాలు ఎదురైనా వాటిని అధిగమించి ముందుకు సాగే తత్వం నేర్చుకుంటారు. భవిష్యత్ జీవితానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది.
ఇలా భావిజీవనానికి చిన్నప్పటి నుంచే గట్టి పునాది వేయడం ‘ఫఫో’ విధానం. ‘ఫఫో’ పేరెంటింగ్‌కి సంబంధించి 2022లో ‘హే ఐయామ్ జెనెలీ’ అనే ఆవిడ తొలిసారిగా వీడియో పోస్ట్ చేసింది. దానికి మూడున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. ఆ వీడియోలో వాళ్ల అబ్బాయి జాకెట్ తీసి వానలో తడుస్తానని మారాం చేస్తుంటాడు. నేను వాడితో వాదించదలచుకోలేదు. వదిలేశాను. ‘లెర్నింగ్ ఫ్రమ్ నేచురల్ కాన్సిక్వెన్సెస్’ అని క్యాప్షన్ పెట్టింది. లెక్చర్ల కన్నా ‘ఫఫో’ మెథడ్ చక్కని పాఠాన్ని నేర్పిస్తుందని ఆవిడ అన్నారు. ఇక అప్పటి నుంచి సోషల్ మీడియాలో ‘ఫఫో’కి సంబంధించి పది లక్షలకు పైగా పోస్టులు షేర్ అయ్యాయి. ‘జెన్ ఎక్స్’ పిల్లలకు ఇదే చక్కని పాఠం అనే అభిప్రాయం వర్కింగ్ పేరెంట్స్‌లో కలుగుతోంది.
స్వేచ్ఛకు కూడా హద్దుండాలి...
అయితే దీనివల్ల కొన్ని ప్రమాదాలు లేకపోలేదని అంటున్నారు మానసిక నిపుణులు. పిల్లలు తమకు తామే నేర్చుకుంటారని నీళ్లు, నిప్పులు, ట్రాఫిక్ ఆక్సిడెంట్ల గురించి అవగాహన కలిగించకుండా విడిచిపెట్టడం ఎంతవరకు సబబు అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు. అందుకే పిల్లల స్వేచ్ఛకి కూడా కొన్ని హద్దులు పెట్టడం మంచిదనేది విస్మరించలేని విషయం. దేనికైనా ఓ హద్దు ఉండాలనేది అందుకే.
ప్రమాదకరమైన పరిణామాలను అర్థం చేసుకొనే గుణం వాళ్ల పసి హృదయాలకు ఉండకపోవచ్చు. కావున పిల్లలు తమ నిర్ణయాలు, వాటి పర్యవసానాలను ధైర్యంగా ఇంట్లో పంచుకోగల వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇలాంటివి మినహాయిస్తే భవిష్యత్తు కోసం పిల్లల్ని ఇప్పటి నుంచే తయారుచేసే విధానంగా ‘ఫఫో’ మాత్రం ట్రెండింగ్‌గా నవతరం పేరెంట్స్‌ను ఆకట్టుకుంటూ, అందరి మన్ననలు అందుకోవడం విశేషం.
‘లెట్ దెమ్’ థియరీ
ఇటీవల సోషల్ మీడియా ద్వారా బాగా పాపులరైన రచయిత్రి మెల్ రాబిన్స్. ఆమె రచించిన ‘ద లెట్ దెమ్ థియరీ’ ట్రెండింగ్‌లో ఉంది. ‘లెట్ దెమ్’ అనేది మనసుకు సంబంధించిన ఓ సాధనం. మన స్వాధీనంలో లేని (అంటే ఇతరుల చర్యలు, నమ్మకాలు, ఆలోచనలు) విషయాలను నియంత్రించడం మానుకుని, మన మీద మనం ఫోకస్ చేసుకోవడమే ‘లెట్ దెమ్. ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రతిపాదనలపై విస్తృత చర్చ జరుగుతోంది. ఇలా చేయడం వల్ల నిరాశానిస్పృహలు ఉండవు. ఒత్తిడి కలగదు. మానసిక ప్రశాంతత చేకూరుతుంది. కాబట్టి అనారోగ్యం దరిచేరదు. అయితే వయోజనులకు ఇది సరిపోతుంది.
కానీ పిల్లల విషయంలో ఈ సిద్ధాంతం వర్తిస్తుందా? అనే సందేహం వస్తుంది. అందుకే రచయిత్రి ‘లెట్ దెమ్’ పుస్తకంలో ‘పేరెంటింగ్ విత్ లెట్ దెమ్’ ను బోనస్ ఛాప్టర్‌గా అందించారు. ఏదైనా చెప్పినప్పుడు పిల్లలు చేయకపోతే, వాళ్లు ఎందుకు అలా చేస్తున్నారు? వాళ్ల సమస్యకు మొదలు ఏమిటి? అన్నది తెలుసుకోవాలని సలహా ఇస్తున్నారు. పిల్లలను అదుపాజ్ఞలతో కాకుండా, మాటతీరుతోనే దగ్గరికి తీసుకుంటే మంచి ఫలితాలు సాధించవచ్చని పేర్కొంటున్నారు. పిల్లల అభిప్రాయాలను గౌరవిస్తూనే, గైడెన్స్ అందిస్తే... వారి భవిష్యత్తుకు చక్కని పునాది పడుతుందని మెల్ రాబిన్స్ విశ్లేషిస్తారు.