Share News

Turkey Flying Rule: తుర్కియేలో కొత్త రూల్స్.. భారత్‌లోనూ వీటిని అమలు చేయాలంటూ డిమాండ్

ABN , Publish Date - May 30 , 2025 | 10:24 PM

విమానం పార్కింగ్ స్పేస్‌కు రాక మునుపే కొందరు ప్రయాణికులు సీటు బెల్ట్ తీసేసి నిలబడేందుకు ప్రయత్నిస్తుంటారు. దీన్ని కట్టడి చేసేందుకు తుర్కియే ప్రభుత్వం తాజాగా తెచ్చిన నిబంధనలను భారత్‌లోనూ అమలు చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

Turkey Flying Rule: తుర్కియేలో కొత్త రూల్స్.. భారత్‌లోనూ వీటిని అమలు చేయాలంటూ డిమాండ్
Turkey air travel regulations

ఇంటర్నెట్ డెస్క్: సిటీ బస్సులో ప్రయాణాలు మనందరికీ అనుభవమే. బస్సుల్లో జనాలు తోసుకుంటూ ఎక్కడం దిగడం చూస్తూనే ఉంటాం. దురదృష్టవశాత్తూ ఇలాంటి వాళ్లు విమానాల్లోనూ కనిపిస్తుంటారు. అలా విమానం ల్యాండవగానే వీళ్లు సీటు బెల్టులు తీసేసి నిలబడతారు. తమ లగేజీతో సహా సీట్ల మధ్య ఉన్న ఐల్‌లో ఇతరులకు ఇబ్బందికరంగా నిలబడిపోతారు. అప్పటికి విమానం ఇంకా పార్కింగ్ స్పాట్‌కు కూడా చేరుకోదు. అయినా వీళ్లు తొందరపాటుతో ఇతరులకు ఇబ్బందులు కలుగజేస్తుంటారు. ఇలాంటి వాళ్లకు బ్రేకులు వేసేందుకు తుర్కియే ప్రభుత్వం పలు కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. దీన్ని భారత్‌లోనూ ప్రవేశపెట్టాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.


తుర్కియే తాజా నిబంధనల ప్రకారం

విమానం ల్యాండయ్యాక పార్కింగ్ స్పాట్‌కు చేరుకునే వరకూ ప్రయాణికులు తమ సీటు బెల్టులు తొలగించకూడదు. సీట్ బెల్ట్ సైన్ ఆఫ్ అయ్యాకే వాటిని తీయాలి.

ల్యాండయిన విమానం పార్కింగ్ స్పాట్‌కు వెళ్లే క్రమంలో (టాక్సీయింగ్) ప్రయాణికులు సీట్ బెల్ట్ తీసేయడం, ఐల్‌‌లోకి వచ్చిన నిలబడటం, క్యాబిన్ లగేజీని కిందకు దించడం వంటివి చేయకూడదు.

ఈ మేరకు ప్రయాణికులకు అర్థమయ్యేలా ఫ్లైట్ సిబ్బంది స్పష్టమైన ప్రకటనలు చేయాలి. ఈ మేరకు మార్గదర్శకాల్లో మార్పులు చేయాలి.

విమానం పార్కింగ్ చోట ఆగాక ప్రయాణికులు హడావుడిగా కిందకు దిగిపోయేందుకు ప్రయత్నించకూడదు. ఐల్‌లోకి వచ్చి ఇతరులకు ఇబ్బందికరంగా నిలబడకూడదు.


ఈ రూల్స్ అతిక్రమించిన వారికి భారీ జరిమానాలు విధిస్తామని కూడా తుర్కియే స్పష్టం చేసింది. ఈ రూల్స్ అమలయ్యేలా చూడాల్సిన బాధ్యత విమానంలోని సిబ్బందిదేనని స్పష్టం చేసింది. ఎవరైనా ప్రయాణికులు ఈ నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే సిబ్బంది ఈ విషయాలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది.

అయితే, డీజీసీఏ ఇప్పటికే ఇలాంటి నిబంధనలను అమలు చేస్తోంది. విమానాల్లో దురుసు ప్రవర్తన, వేధింపులకు దిగడం వంటివి చేస్తే జైలుపాలవ్వాల్సి వస్తుంది. అయితే, టాక్సీయింగ్ సమయంలో సీట్లల్లోంచి లేచి నిలబడటం వంటి వాటిపై విషయంలో స్పష్టమైన నిబంధనలు ఏవీ లేవు. దీంతో, తమకూ ఇలాంటి రూల్స్ ఉండాలని భారతీయ నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి:

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 10:25 PM