E20 Vehicle Mileage Issues: ఈ20 ఇంధనంతో మైలేజీ సమస్యా.. ఇలా చేస్తే మీ సమస్యకు పరిష్కారం
ABN , Publish Date - Oct 16 , 2025 | 02:16 PM
వాహనంలో ఈ20 బ్లెండెడ్ ఇంధనాన్ని వాడేవారు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మైలేజీ గురించి చింత ఉండదు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: భారత్‌లో ఇథనాల్ కలిపిన ఇంధనం ఈ20 వినియోగం క్రమంగా పెరుగుతోంది. అయితే, ఈ ఇంధనంలో శక్తిసాంద్రత కాస్త తక్కువగా ఉండటంతో వినియోగదారులు కొంత అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మైలేజీ తగ్గిందని అంటున్నారు. అయితే, కొన్ని చిట్కాలు పాటిస్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు (E20 fuel mileage tips).
టైర్లల్లో గాలి ఎంత ఉందనేది మైలేజీపై ప్రభావం చూపిస్తుంది. గాలి తక్కువగా ఉన్నప్పుడు చక్రాలు సులువుగా ముందుకు కదలవు. దీంతో, ఇంజన్‌పై ఒత్తిడి పెరిగి మైలేజీ తగ్గుతుంది. కాబట్టి, టైర్లల్లో గాలి పూర్తిస్థాయిలో ఉండేలా చర్యలు తీసుకోవాలి
డ్రైవింగ్ శైలిని బట్టి కూడా మైలేజీ ఆధారపడి ఉంటుంది. కారు వేగాన్ని ఒక్కసారిగా పెంచడం లేదా సడెన్‌గా బ్రేకులు వేయడం, తరచూ గేర్లు మార్చడం వంటివి మైలేజీని తగ్గిస్తాయి. కాబట్టి, ఈ పొరపాట్లను సవరించుకుంటే మైలేజీ 10 నుంచి 15 శాతం మేర పెరిగే అవకాశం ఉంది.
కారుకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయిస్తే ఇంజన్ మంచి కండీషన్‌లో ఉంటుంది. ఎయిర్ ఫిల్టర్, ఇంజన్ ఆయిల్‌ను ఎప్పటికప్పుడు మారుస్తుండాలి. ఫ్యూయెల్ ఇంజెక్టర్‌లను క్లీన్ చేయించాలి. దీంతో, ఇంధనం పూర్తిస్థాయిలో మండి శక్తి పరిపూర్ణంగా విడుదల అవుతుంది. మైలేజీ పెరుగుతుంది. ఈ20 వాహనాలకు క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేయించాలి.
నిరంతరం ఏసీ వినియోగిస్తే కారు మైలేజీ 25 శాతం మేర తగ్గే అవకాశం ఉంది. కాబట్టి స్వల్ప దూరాలు వెళ్లేటప్పుడు ఏసీ వేయొద్దు. తక్కువ వేగంతో వెళుతున్నట్టు అయితే కారు అద్దాలను కిందకు దింపుకోవాలి. హైవేలపై ప్రయాణాలప్పుడు కారు అద్దాలను దింపుకునే ఉండటం, ఏసీని ఓ మోస్తరుగా వినియోగించడం చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది.
స్వల్ప సమయాలకు కారును పార్క్ చేసినప్పుడు ఇంజన్‌ను ఆన్‌లో ఉంచడం కూడా ఇంధన వినియోగాన్ని పెంచి మైలేజీని తగ్గిస్తుంది. ట్రాఫిక్ జంక్షన్ వద్ద, రోడ్డు పక్కన కారును నిలిపి ఉంచినప్పుడు ఇంజన్‌ను ఆఫ్ చేస్తే ఇంధనం కొంత మేర ఆదా అవుతుంది.
కారులో పరిమితికి మించి వస్తువులను తరలిస్తే అధిక బరువు వల్ల మైలేజీ తగ్గిపోతుంది. నిపుణులు చెప్పేదాని ప్రకారం, పరిమితికి మించి అదనంగా ఉండే ప్రతి 45 కేజీలకు రెండు శాతం చొప్పున మేలేజీ తగ్గిపోతుంది. రూఫ్ ర్యాక్స్, ఇతర యాక్సెసరీల వల్ల రెసిసెస్టెన్స్ పెరిగి మైలేజీ తగ్గుతుంది. కాబట్టి, వాహనంలో బరువు వీలైనంత తక్కువగా పెట్టుకుంటే మైలేజీకి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. ఈ20 వాహనాలు ఉన్న వారు ఈ విషయాల్లో అప్రమత్తంగా ఉంటే మైలేజీ విషయంలో చాలా వరకూ సమస్యలు తొలగిపోతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
విహారయాత్రకు వెళ్లే వారి స్మార్ట్ ఫోన్‌లో తప్పనిసరిగా ఉండాల్సిన యాప్స్ ఇవి
ఫ్లైట్ ఆలస్యమైందా.. సడెన్‌గా క్యాన్సిల్ అయ్యిందా.. పరిహారం ఎంతిస్తారో తెలుసా
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి