Share News

UP Vistadome Jungle Safari Train: రైల్లో సఫారీ జర్నీ.. తొలి విస్టాడోమ్ రైలు సర్వీసును ప్రారంభించిన యూపీ ప్రభుత్వం

ABN , Publish Date - May 17 , 2025 | 09:34 PM

ఎకో టూరిజంను ప్రోత్సహించే దిశగా యూపీ ప్రభుత్వం దేశంలోనే తొలిసారిగా విస్టాడోం జంగల్ సఫారీ రైలు సర్వీసును ప్రవేశపెట్టింది. మరి దీని విశేషాలు ఏమిటో తెలుసుకుందాం పదండి.

UP Vistadome Jungle Safari Train: రైల్లో సఫారీ జర్నీ.. తొలి విస్టాడోమ్ రైలు సర్వీసును ప్రారంభించిన యూపీ ప్రభుత్వం
UP Vistadome Jungle Safari Train

ఇంటర్నెట్ డెస్క్: రైలు ప్రయాణాన్ని ఇష్టపడని వారు దాదాపుగా ఉండరు. అయితే, ఈ జర్నీ అనుభవాన్ని ఉచ్ఛస్థితికి తీసుకెళ్లేదే విస్టాడోమ్ రైలు. మరి ఈ రైల్లో వన్యప్రాణులు, అడవి అందాలను ఎంజాయ్ చేస్తూ సఫారీ జర్నీ చేస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో మాటలు చెప్పడం కష్టం. దేశ ప్రజలకు సరిగ్గా ఇదే అవకాశం తాజాగా అందుబాటులోకి వచ్చింది.

ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం.. దేశంలోనే తొలి విస్టాడోమ్ జంగల్ సఫారీ రైలు సర్వీసును ప్రారంభించింది. కతార్నియాఘాట్ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ, దుధ్వా టైగర్ రిజర్వ్‌ మధ్య ఈ సర్వీసును ప్రవేశపెట్టింది. భారీ గాజు అద్దాలున్న కటికీలు, టాపుతో కూడిన విస్టాడోమ్ రైల్లో కూర్చుని టూరిస్టులు అడవి అందాలను ఆస్వాదించేలా ఈ సర్వీసును ప్రారంభించారు. ఈ రక్షిత అడవుల్లోని పచ్చిక మైదానాలు, చిత్తడి నేలలు, భారీ అరణ్యాలు, అడవి జంతువుల అద్భుత దృశ్యాలను ఆస్వాదించేలా 107 కిలోమీటర్ల మేర ఈ రైలు ప్రయాణిస్తుంది. జర్నీ సమయం సుమారు నాలుగున్నర గంటలు. ఒక్కో టిక్కెట్ ధరను రూ.275గా నిర్ణయించారు. దుధ్వా, పలియా కలాన్, మైలానీ వంటి తొమ్మది స్టేషన్లలో రైలు ఆగుతుంది.


ఇక ఈ రైలుకు ప్రాచుర్యం తీసుకొచ్చేందుకు యూపీ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది. ఈ దిశగా స్కూలు పిల్లలు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల కోసం ప్రత్యేక టూర్ ప్యాకేజీలను కూడా రూపొందించింది. యూపీ జాతీయ వనాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం కల్పించేందుకు ఎకో టూరిజం శాఖ ‘మూడు జాతీయ వనాల్లో ప్రయాణం’ పేరిట ఈ సర్వీసు గురించి ప్రచారం చేస్తోంది.

బిచియా స్టేషన్‌లో మొదలయ్యే ఈ రైలు జర్నీ మైలానీ వద్ద ముగుస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారాంతాల్లోనే ఈ సర్వీసు అందుబాటులో ఉంది. ఉదయం 11.45 లకు బయలు దేరి సాయంత్రం 4.10 గంటలకు రైలు మైలానీకి చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 6.05కు బయలుదేరి రాత్రి 10.30కి బిచియాకు చేరుకుంటుంది.


రోజువారీ సర్వీసులను ఏర్పాటు చేసేందుకు యూపీ ప్రభుత్వం ట్రై చేస్తోంది. టూరిస్టులకు అనుకూలంగా మరిన్ని రైలు జర్నీ ప్యాకేజీలను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని యూపీ పర్యాటక శాఖ డైరెక్టర్ పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి:

రూల్స్‌కు విరుద్ధంగా చీతాల దాహం తీర్చినందుకు అటవీ శాఖ సిబ్బందిపై వేటు

అర్ధరాత్రి వేళ విమాన టిక్కెట్లు బుక్ చేస్తే తక్కువ ధర..

సెవెన్ సిస్టర్స్ అద్భుతాల్ని తరిస్తారా.. లక్కీ ఛాన్స్

మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 17 , 2025 | 10:05 PM