Aircraft Age: మీరు జర్నీ చేస్తున్న విమానం ఎప్పుడు తయారు చేశారో తెలుసుకోవాలనుందా.. అయితే..
ABN , Publish Date - Jun 27 , 2025 | 02:06 PM
ధనవంతులు మినహా చాలా మందికి విమానంలో ప్రయాణించడం కల. అయితే, ఇటీవలి కాలంలో జరుగుతున్న విమాన ప్రమాదాలు.. ఫ్లైట్ ఎక్కాలంటే భయపడేలా చేస్తున్నాయి. ఎందుకంటే.. ఆ విమానంలో ఎప్పటిదో.. ఏం సమస్యలున్నాయో.. టేకాఫ్ అయ్యాక సేఫ్‌గా ల్యాండ్ అవుతుందో లేదో అనే సందేహాలే ఎక్కువ. మరి ఒక వేళ మీరు విమానం ఎక్కితే.. ఆ విమానం పాతదా.. కొత్తదా అని తెలుసుకునే మార్గం ఉంది. అదేంటో ఈ కథనం చదివి తెలుసుకోండి..
ఇంటర్నెట్ డెస్క్: విమానం ఎక్కే ముందు ఎవరైనా తమ సీటు నెంబర్, బోర్డింగ్ పాస్, లగేజీలను చెక్ చేసుకుంటారు. చాలా అరుదుగా మాత్రమే జనాలకు విమానాన్ని ఎప్పుడు తయారు చేశారన్న డౌటొస్తుంది. అయితే, ఇది తెలుసుకోవడం చాలా సులభమని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు ఏయే ఎయిర్‌లైన్స్ ఈ విమానాన్ని వాడాయో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు (Check Aircraft Age Online).
నిపుణులు చెప్పే దాని ప్రకారం, విమానం భద్రతకు, విమానం ఎప్పుడు తయారు చేశారన్న దానితో ఎలాంటి సంబంధం లేదు. విమానానికి క్రమం తప్పకుండా సర్వీసు చేయిస్తూ, అవసరమైనప్పుడు అప్‌గ్రేడ్ చేస్తూ ఉంటే భద్రతకు ఎలాంటి ఢోకా ఉండదు. అయితే, పాత విమానాల్లో సీట్లు, వెలుతురు, లావెటరీ సౌకర్యాల వంటివి కాస్త తీసికట్టుగా ఉండే అవకాశం ఉంది. సౌకర్యవంతమైన ప్రయాణం కోరుకునే వారికి ఇవి కాస్త చిరాకు కలిగించొచ్చు.
చార్టర్డ్ విమాన కంపెనీలు చెప్పే దాని ప్రకారం, విమానం తయారు చేసి నాటి నుంచి పదేళ్ల వరకూ దాన్ని కొత్త విమానంగానే పరిగణిస్తారు. ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించిదన్న దానితో నిమిత్తం లేదు. ఇక పది నుంచి 20 ఏళ్లుగా సర్వీసులో ఉన్న వాటిని ప్రామాణిక విమానాలుగా పరిగణిస్తారు. ఒక విమానం 20 ఏళ్లకు మించి వినియోగంలో ఉందంటే దాన్ని పాత విమానంగా భావించాలి. ఇక విమానం 30 ఏళ్లకు మించి వాడకంలో ఉందంటే అందులోని సౌకర్యాలు కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సుదీర్ఘ ప్రయాణాలు చేసేవారు ఈ విమానాలను ఎంచుకోక పోవడమే మంచిదని అంటున్నారు. అయితే, వీటిల్లో వసతులను మెరుగుపరిచి, అవసరమైన చోట్ల రిట్రోఫిటింగ్ నిర్వహిస్తే జర్నీని పూర్తిస్థాయిలో ఎంజాయ్ చేయొచ్చని అంటున్నారు.
విమానం ఎప్పుడు తయారైందో ఎలా చెక్ చేయాలంటే..
విమానం తయారైన తేదీని తెలుసుకునేందుకు ముందుగా ఫ్లైట్ నెంబర్‌ను తెలుసుకోవాలి. FlightRadar24, FlightAware, Airfleets, Planespotters తదితర వెబ్‌సైట్‌లల్లో ఫ్లైట్ నెంబర్ ఆధారంగా విమానాల రిజిస్ట్రేషన్ నెంబర్‌ను తెలుసుకోవాలి. భారత్‌లోని విమానాల రిజిస్ట్రేషన్ నెంబర్లు సాధారణంగా వీటీ అనే అక్షరాలతో మొదలవుతాయి. ఈ నెంబర్లను Airfleets, Planespotters వెబ్‌సైట్‌లో మళ్లీ ఎంటర్ చేస్తే విమానం చరిత్ర మొత్తం తెలిసిపోతుంది. విమానాన్ని ఎప్పుడు తయారు చేశారు? ప్రస్తుతం ఏ ఎయిర్‌లైన్స్ వినియోగిస్తోంది? అంతకుమునుపు ఎవరు వినియోగించారు? వంటి వివరాలన్నీ తెలిసిపోతాయి.
ఇవి కూడా చదవండి:
ఎయిర్‌పోర్టులో తమ వస్తువులు పోగొట్టుకున్న వాళ్లు వెంటనే చేయాల్సిందేంటంటే..
రైలు ప్రయాణమా.. మీ లగేజీ బరువు ఈ పరిమితి దాటితే..
మరిన్ని ట్రావెల్ వార్తల కోసం క్లిక్ చేయండి