Address Change in Passport: పాస్‌పోర్టులో అడ్రస్ మార్చుకునేందుకు ఏం చేయాలంటే..
ABN , Publish Date - Dec 19 , 2025 | 10:23 PM
కొత్త ఇంటికి మారారా? అయితే పాస్‌పోర్టులో అడ్రస్ ఎలా మార్చుకోవాలో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం పదండి.
ఇంటర్నెట్ డెస్క్: ఇల్లు మార్చిన ప్రతిసారీ కీలక డాక్యుమెంట్స్‌లో అడ్రస్ మార్పు తప్పనిసరి. ముఖ్యంగా పాస్‌పోర్టు ఉన్న వారు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అసలు పాస్‌పోర్టులో అడ్రస్ మార్చుకునేందుకు ఏం చేయాలో చూద్దాం.
అడ్రస్ మార్చడమంటే పాస్‌పోర్టులో వ్యక్తిగత వివరాలు మార్చినట్టే. కాబట్టి అడ్రస్ మార్పు తరువాత కొత్త బుక్‌లెట్‌ను కేటాయిస్తారు. పాస్‌పోర్టు నెంబర్‌లో మార్పు లేకపోయినా కొత్త అడ్రస్ ఉన్న బుక్‌లెట్ అందుబాటులోకి వస్తుంది.
అడ్రస్ మార్పు ఇలా
ముందుగా వినియోగదారులు పాస్‌పోర్టు సేవా వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అందులో పాస్‌పోర్టు రీ ఇష్యూ సేవలను ఎంచుకోవాలి. అందులో ఛేంజ్ ఆఫ్ పర్సనల్ పర్టిక్యులర్స్ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఆ తరువాత జాగ్రత్తగా కొత్త అడ్రస్ వివరాలను ఎంటర్ చేయాలి. ఇంటినెంబర్, రోడ్డు నెంబర్ లేదా పేరు, లొకాలిటీ, పిన్ కోడ్ వివరాలను ఎంటర్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి.
ఈ వివరాలు నింపాక కొత్త అడ్రస్ ధ్రువీకరణ పత్రాలను ఎంటర్ చేయాలి. అంటే, కొత్త అడ్రస్ ఉన్న ఆధార్ కార్డు, వోటర్ ఐడీ కార్డు, కరెంటు బిల్లులు, లేదా బ్యాంక్ స్టేట్‌మెంట్ పాస్‌బుక్ తాలూకు కాపీలను అప్‌లోడ్ చేయాలి. వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలకు, ధ్రువీకరణ వివరాలు ఒకేలా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి.
అప్లికేషన్ పూర్తిగా నింపాక, ఫీజు చెల్లించి సమీప పాస్‌పోర్టు కేంద్రంలో అపాయింట్‌మెంట్‌ను బుక్ చేసుకోవాలి. డాక్యుమెంట్స్‌కు సంబంధించి జిరాక్స్ కాపీలతో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను కూడా రెడీ గా పెట్టుకోవాలి. కొత్త రాష్ట్రం లేదా కొత్త ప్రాంతానికి మారినప్పుడు పోలీస్ వెరిఫికేషన్ కూడా ఉండొచ్చనే విషయాన్ని మర్చిపోకూడదు.
వెరిఫికేషన్ పూర్తయ్యాక దరఖాస్తు పరిశీలన ఏ దశలో ఉందో వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవాలి. ప్రక్రియ అంతా పూర్తయ్యే వరకూ మీరు అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్స్‌కు సంబంధించిన కాపీలను రెడీగా పెట్టుకోవాలి. ఈ యావత్ ప్రక్రియ సాఫీగా సాగిపోవాలంటే అన్ని దశల్లో సరైన సమాచారాన్ని సమర్పించాలని నిపుణులు చెబుతున్నారు.